
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని వరుస ఓటములు వెంటాడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో వరుస ఓటములతో క్యాడర్ డీలా పడింది. అయినా బీఆర్ఎస్ అగ్ర నేతలు మౌనంగా ఉండటంపై గులాబీ కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొంది. పార్టీ పరిస్థితిపై సమీక్షలు లేకపోవడంతో కింది స్థాయి నేతల్లో నిరూత్సాహం ఏర్పడింది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల ముందు ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారగా మరికొంతమంది ఎమ్మెల్యేలు అదే దారిలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ 39 స్థానాలతో ప్రతిపక్ష స్థానానికి పరిమితం అయింది. దీంతో తెలంగాణ భవన్ వేదికగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించారు ముఖ్యనేతలు. పార్టీ కార్యకర్తల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. త్వరలోనే జిల్లా స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా నుంచి మండల స్థాయి వరకు పార్టీ కార్యకర్తలకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తామని సన్నాహక సమావేశాల్లో చెప్పినా... కార్యరూపం దాల్చలేదు. ఈ లోగా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని గులాబీ అధిష్టానం భావించింది. ఫలితాల తర్వాత బీఆర్ఎస్ కు ఒక్క సీటు దక్కలేదు.
రాష్ట్రంలో 17 పార్లమెంట్ సీట్లలో పోటీ చేసిన గులాబీ పార్టీ అన్ని స్థానాల్లోను ఓడిపోయింది. ఎనిమిది లోక్ సభ స్థానాల్లో డిపాజిట్లు దక్కలేదు. తన ఓట్ల శాతాన్ని సగానికి పైగా కోల్పోయింది. ఓటమి తర్వాత ఒక్క సారిగా బీఆర్ఎస్ సైలెంట్ అయింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీ ఓటమిపై ట్వీట్ కు మాత్రమే పరిమితం అయ్యారు. గులాబీ అధినేత కేసీఆర్ ఫలితాల తర్వాత ఫామ్ హౌస్ కు పరిమితం అయ్యారు. దీంతో తెలంగాణ భవన్ కళ తప్పింది. ముఖ్య నేతలు ఎవరూ తెలంగాణ భవన్ కు రావడం లేదు. కార్యకర్తలుపార్టీ కార్యాలయం వైపు రావడం లేదనే చర్చ జరుగుతోంది.
పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిపై ఇప్పటి వరకు తెలంగాణ భవన్ వేదికగా సమీక్షలు లేకపోవడంపై బిఆర్ఎస్ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. తొలిసారి పార్లమెంటులో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం కోల్పోయింది. దీంతో పార్టీని తిరిగి గాడిలో పెట్టాలంటే సమీక్ష చేయాలనే భావన వ్యక్తం అవుతోంది. అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులతో సమీక్ష ఏర్పాటు చేస్తే క్షేత్రస్థాయిలో పరిస్థితులతో పాటుగా ఓటమికి కారణాలు తెలుసుకునే అవకాశం ఉంటుందనే భావన పార్టీ క్యాడర్ లో వ్యక్తం అవుతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ నిర్మాణంపై స్పెషల్ ఫోకస్ పెడతామని అధిష్టానం చెప్పింది. అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు.పార్టీ కమిటీలన్నీ రద్దు చేసి, కొత్త కమిటీల నియామకం ద్వారా పార్టీలో జోష్ నింపే ప్రయత్నం చేస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది. పార్టీ ప్లినరీ నిర్వహించుకుని ఎన్నికలపై సమీక్షలు చేద్దామని అధినేత కేసీఆర్ చెప్పినప్పటికీ దీనిపై క్లారిటీ రాలేదు. అధికారంలో ఉన్నప్పుడు నిత్యం కార్యకర్తలతో సందడిగా ఉన్న బీఆర్ఎస్ కార్యాలయం వరుస ఓటములతో బోసిపోయింది. ఆ పార్టీ అగ్రనేతలు తెలంగాణ భవన్ వైపుకు రావడం లేదు.