పొంగులేటి అనుచరుడిపై బీఆర్ఎస్ దాడి
పోలీసుల సమక్షంలోనే కొట్టిన మంత్రి పువ్వాడ అనుచరులు
మంత్రిపై కామెంట్లు చేశాడని కాలితో తన్నుతూ, పిడిగుద్దులు
ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ పొందుతున్న బాధితుడు కార్తీక్
ఖమ్మం, వెలుగు : మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరుడిపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. పోలీసుల సమక్షంలోనే ఆయనను విపరీతంగా కొట్టారు. ఆదివారం ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో భాగంగా ఖమ్మం పట్టణంలోని ఇల్లందు రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాళులు అర్పించాల్సి ఉండగా.. అది డ్రోన్ తో షూట్ చేసేందుకు ఆయన అనుచరుడు, బీఆర్ఎస్వీ మాజీ రాష్ట్ర కార్యదర్శి చీకటి కార్తీక్ ముందుగానే అక్కడికి చేరుకున్నాడు. ఆ సమయంలో కార్తీక్‌ను చూసిన మంత్రి పువ్వాడ అజయ్ అనుచరులు అయనపై దాడి చేశారు.
మూడ్రోజుల కింద ఫేస్బుక్ లైవ్‌లో మాట్లాడుతూ మంత్రి అజయ్ ఫ్యామిలీపై కార్తీక్ అనుచిత వ్యాఖ్యలు చేశాడని, సోషల్ మీడియాలో మంత్రికి వ్యతిరేకంగా కామెంట్లు పెడుతున్నాడని ఆయనపై పిడిగుద్దులు కురిపించారు. తప్పించుకునే ప్రయత్నంలో కార్తీక్ కింద పడిపోగా, కాలితో తన్నారు. అక్కడే ఉన్న టూటౌన్ పోలీసులు వచ్చి ఆపే ప్రయత్నం చేసినా.. మంత్రి అనుచరులు వినకుండా కార్తీక్‌ను విపరీతంగా కొట్టారు. ఆ తర్వాత పోలీసులు కార్తీక్‌ను గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి కార్తీక్‌ను కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. కాగా, మంత్రి ఫ్యామిలీపై కామెంట్లు చేశాడని ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో కార్తీక్‌పై కేసు నమోదైంది.
పొంగులేటి క్యాంప్ ఆఫీస్‌పై దాడి
మధిర, వెలుగు : మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ ఆఫీసుపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ జీడుపాడు గ్రామంలో ఉన్న ఆఫీసుపై శనివారం రాత్రి దాడికి పాల్పడ్డారు. దుండగులు పూల కుండీలను పగులగొట్టి, పొంగులేటి ఫ్లెక్సీలను చింపారు. అది చూసి చుట్టుపక్కల వాళ్లు అరవడంతో అక్కడి నుంచి పారిపోయారు. దాడిపై పొంగులేటి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు పిరికిపందల్లాగా క్యాంప్ ఆఫీసుపై దాడి చేశారని మండిపడ్డారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పొంగులేటి అనుచరుడు కోటా రాంబాబు తెలిపారు.