కరీంనగర్: జమ్మికుంట బీఆర్ఎస్ సభ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మంత్రి కేటీఆర్ సభకు వచ్చిన ఓ యువకున్ని బీఆర్ఎస్ కార్యకర్తలు చితకబాదారు. సదరు యువకుడు బీజేపీ పార్టీకి చెందిన టీ షర్ట్ వేసుకొని వచ్చాడన్న కారణంగా దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు యువకున్ని అక్కడి నుంచి పంపించారు.
అడుగడుగునా అడ్డుకున్నరు
మరోవైపు మంత్రి కేటీఆర్‌ను నిరసనకారులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. పోలీసులు అప్రమత్తమై ముందస్తు అరెస్టు చేసినా కేటీఆర్‌కు నిరసన సెగ తప్ప లేదు. కమలాపూర్ లో మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ను ఎన్ఎస్యూఐ నేతలు అడ్డుకున్నారు. నల్ల చొక్కాలు ధరించి.. నల్ల జెండాలు పట్టుకుని నిరసన తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకారుల చొక్కాలు చింపి వారిపై దాడికి పాల్పడ్డారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.