- ఇటీవల రేఖా నాయక్ రాజీనామా
- బోథ్ ఎమ్మెల్యే బాపురావు సైతం అనిల్‌కు మద్దతుపై అనుమానాలు
- సైలెన్స్‌లో ఆత్రం సక్కు
ఆదిలాబాద్, వెలుగు: బీఆర్ఎస్ అధిష్టానం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మూడు ఎస్టీ నియోజకవర్గాల్లో ముగ్గురు సిట్టింగ్‌లకు షాకిస్తూ కొత్త అభ్యర్థులను ఎన్నికలో బరిలో దించింది. బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో సిట్టింగ్ఎమ్మెల్యేలను కాదని వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇచ్చింది. అయితే, టికెట్ దక్కకపోవడంతో ఈ ముగ్గురు సిట్టింగులు తీవ్ర అసంతృప్తితో ఉండగా.. ఈ ప్రభావం ఎలక్షన్‌పై పడుతుందని క్యాడర్భావిస్తోంది. ఇటీవల ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ బీఆర్ఎస్కు రాజీనామా చేసి పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ ను ఓడించడమే తన లక్ష్యమంటూ శపథం పూనారు. గత పదేండ్లుగా ఎస్టీ నియోజకవర్గాల్లో బలంగా ఉన్న బీఆర్ఎస్కు ఎమ్మెల్యేల అసంతృప్తితో ఈ ఎన్నికలు సవాల్‌గా మారనున్నాయి.
సిట్టింగుల తిరుగుబాటు..
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుతో పాటు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు బీఆర్ఎస్ పార్టీ ఈసారి మొండిచేయి చూపింది. దీంతో ఖానాపూర్, బోథ్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే సైలెంట్ అయిపోయారు. ఈ క్రమంలో రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటు కొత్త అభ్యర్థులకు ఆందోళన కలిగిస్తోంది. ఖానాపూర్‌కు కేటీఆర్ ఫ్రెండ్ జాన్సన్ నాయక్ పేరును ప్రకటించడంతో రేఖా నాయక్ ఆ పార్టీకి రాజీనామా చేసి రెబల్‌గా పోటీ చేయనున్నట్లు ప్రకటించడంతో ఇక్కడ రాజకీయాలు ఆసక్తిగా మారాయి. జాన్సన్ నాయక్ ను టార్గెట్ చేస్తూ నాన్ లోకల్ అభ్యర్థి అంటూ కొత్త ప్రచారం మొదలు పెట్టారు.
ALSO READ :- అక్టోబర్ 9న భూపాలపల్లి కలెక్టరేట్ ఓపెనింగ్ .. హాజరుకానున్న మంత్రి కేటీఆర్
అటు బోథ్ నియోజకవర్గంలో సైతం కేటీఆర్ కు సన్నిహితుడైన అనిల్ జాదవ్‌కు హైకమాండ్ టికెట్ కేటాయించింది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు సైతం తిరుగుబాటు చేయడం అనిల్‌కు తలనొప్పిగా మారింది. ఇటీవల నిర్మల్‌లో జరిగిన కేటీఆర్ సభకు సైతం బాపూరావు హాజరు కాకపోవడంతో అనిల్‌కు మద్దతు తెలిపే అవకాశాలు సన్నగిల్లినట్లు కనిపిస్తోంది. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు ఎంపీ టికెట్ ఇస్తారనే ప్రచారం జరిగినప్పటికీ.. ఇంతవరకు అధిష్టానం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ఆయన పూర్తిగా సైలెంట్ అయ్యారు. సిట్టింగ్ఎమ్మెల్యేల తిరుగుబాటుతో వీరి మద్దతుదారులు ప్రస్తుత అభ్యర్థులకు సపోర్ట్ చేస్తారా? అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది.
బీఆర్ఎస్ పై అసంతృప్తితో ఆదివాసులు
ఎస్టీ నియోజకవర్గాలు కావడంతో పార్టీ పరంగానే కాకుండా ఆదివాసీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ఖానాపూర్, బోథ్ నియోజకవర్గాల్లో ఆదివాసీలకు కాకుండా ఆదివాసేతరులకు కేటాయించడంతో ఈ సెగ్మెంట్లలో ఆదివాసీ ఓటర్లు అసంతృప్తితో ఉన్నారు. తామంతా ఏకమై ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు బుద్ధి చెబుతామంటూ ఇప్పటికే ఆదివాసీ సంఘాలు హెచ్చరించాయి. ఓ వైపు సొంత పార్టీలో అసంతృప్తులు.. మరోవైపు నియోజకవర్గంలో ఆదివాసీ ఓటర్ల ప్రభావం ఈ ఎన్నికల్లో పార్టీకి సవాల్‌గా మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఆయా నియోజకర్గాల్లో ఆదివాసీ నేతలనే గెలిపించుకోవాలంటూ తీర్మానాలు కూడా చేశారు.