సీతక్కపై బీఆర్​ఎస్ ట్రోలింగ్స్.. పీక్స్​కు చేరిన దాడి

సీతక్కపై బీఆర్​ఎస్ ట్రోలింగ్స్.. పీక్స్​కు చేరిన దాడి
  • సోషల్​ మీడియాలో పీక్స్​కు చేరిన దాడి
  • మార్ఫింగ్​ వీడియోలతో రెచ్చిపోతున్న గులాబీ' నేతలు, కార్యకర్తలు
  • ఇటీవల అసెంబ్లీ స్పీచ్​ మార్ఫింగ్ 
  • ఇప్పుడు మరో వీడియోకు బూతు డైలాగ్స్​ జోడించి ట్రోలింగ్​
  • కరోనా టైమ్​లో అడవిబిడ్డలకు అండగా ఉంటే కూడా ఇదే తీరు
  • మహిళా కమిషన్ చైర్​పర్సన్​ నేరెళ్ల శారదపైనా దాడి
  • కేటీఆర్​కు నోటీసులిచ్చినందుకు ఆమెపై దారుణంగా కామెంట్లు
  • చర్యలు తీసుకోవాలని పోలీసులకు పౌరసమాజం ప్రతినిధుల ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు: మంత్రి సీతక్క లక్ష్యంగా సోషల్​ మీడియాలో బీఆర్​ఎస్  నేతలు, కేసీఆర్​ అభిమానులు, కేటీఆర్​ ఫ్యాన్స్​ చేస్తున్న దాడులు శ్రుతి మించుతున్నాయి. గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ తరహా వేధింపులు మొదలైనా.. నిరుడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి మంత్రిగా ఆమె ప్రమాణం చేసినప్పటి నుంచి మరింత పెరిగాయి. సీతక్క ఎక్కడ,  ఏమి మాట్లాడినా అందులో కొన్ని మాటలను కట్​చేసి వాటికి బూతు డైలాగ్స్, సొంత స్క్రిప్ట్ యాడ్ చేసి ఫేస్​బుక్, ట్విట్టర్, ఇన్​స్టాగ్రామ్, వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేస్తున్నారు.  వాటికింద బీఆర్ఎస్ కార్యకర్తలు పెడ్తున్న కామెంట్లు మరీ దారుణంగా ఉంటున్నాయి. 

అసెంబ్లీ స్పీచ్​ను కూడా..!

ఇటీవల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మంత్రి సీతక్క మాట్లాడుతున్న టైమ్​లో ఆమె వెనుక ఉన్న మంత్రి పొన్నం దగ్గరికి అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు వచ్చి మాట్లాడుతున్నారు. ఈ వీడియోకు బూతు డైలాగ్స్​ యాడ్ చేసి బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సోషల్ మీడియా అకౌంట్లలో సర్క్యులేట్ చేశారు. ఇలా మంత్రి సీతక్క వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్​ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సీసీఎస్ పోలీసులకు అప్పట్లోనే కాంగ్రెస్ నేత వెంకట్ నాయక్ ఫిర్యాదు చేయగా.. సైబర్ క్రైమ్ పోలీసులు  కేసునమోదు చేశారు. తాజాగా మరో సారి మంత్రి సీతక్క పాత వీడియోలోని ఓ డైలాగ్​ను కట్​చేసి, బూతు మాటలు జోడించి సర్క్యులేట్ చేస్తున్నారు. 

గత ప్రభుత్వంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క కరోనా టైమ్​లో ములుగు నియోజకవర్గంలోని అన్ని తండాలు, గూడేలు, గ్రామాలు తిరుగుతూ అడవిబిడ్డలకు నిత్యావసర వస్తువులు, దుప్పట్లు, కూరగాయలు అందజేశారు. రోడ్డు మార్గం లేని ప్రాంతాలకు నడుచుకుంటూ, ఎడ్ల బండ్ల మీద, ట్రాక్ట ర్ల మీద వెళ్లి పేదలకు బాసటగా నిలిచారు. ఇదంతా మైలేజ్ కోసం చేస్తున్నారంటూ సోషల్​ మీడియాలో బీఆర్​ఎస్​ లీడర్లు ట్రోల్​ చేశారు.  

కేటీఆర్​కు నోటీసులిచ్చినందుకు నేరెళ్ల శారదపై..!

సీతక్కతో పాటు మహిళా కమిషన్  చైర్​పర్సన్​ నేరెళ్ల శారదను కూడా బీఆర్​ఎస్​ నేతలు టార్గెట్​ చేస్తున్నారు. బస్సుల్లో మహిళల ఫ్రీ జర్నీపై కేటీఆర్ ​చేసిన వివాదాస్పద కామెంట్లకు వివరణ ఇవ్వాలంటూ ఆయనకు శారద నోటీసులు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక.. బూతులు తిడ్తూ సోషల్​ మీడియాలో ట్రోల్​ చేస్తున్నారు. వాటికింద గులాబీ పార్టీ కార్యకర్తలు, కేటీఆర్​ అభిమానులు దారుణంగా కామెంట్లు పెడ్తున్నారు. గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్న ఈ ఇద్దరు మహిళలపై సోషల్ మీడియాలో అభ్యంతరకర కామెంట్స్ చేయడంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.  

ట్రోలర్స్​పై చర్యలు తీసుకోండి

పంజాగుట్ట పీఎస్​లో పౌర సమాజం ప్రతినిధుల ఫిర్యాదుబషీర్ బాగ్, వెలుగు: మంత్రి సీతక్క, మహిళా కమిషన్​ చైర్​పర్సన్​ నేరెళ్ల శారదపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ పౌర సమాజం ప్రతినిధులు శనివారం పంజాగుట్ట పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఉన్నతస్థాయిలో ఉన్నవారిపై ఇలాంటి ట్రోలింగ్స్ అవుతుంటే , సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందని , ఇలా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కేసును స్వీకరించిన పంజాగుట్ట పోలీసులు.. సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు బదిలీ చేశారు. ట్రోలింగ్స్ చేస్తున్న వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. 

ఆదివాసీ మహిళ మంత్రి అయితే ఓరుస్తలేరు

మహిళలంటే కొందరికి చిన్న చూపు. తొలిసారి ఒక ఆదివాసీ మహిళ మంత్రి అయితే ఓర్వలేక నిత్యం సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నరు. వాటిని చూస్తుంటే చాలా బాధేస్తుంది. కానీ, వాటిని పట్టించుకుంటే ముందడుగు వేయలేం. సమ సమాజం కోసం ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంట. - మంత్రి సీతక్క