కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ పై విమర్శలు గుప్పించారు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్. మంచోడిననే ముసుగులో వినోద్ కుమార్ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. వినోద్ మంచోడైతే ఆయన ఫోటోతో జనంలోకి వెళ్లాలి కానీ కేసీఆర్ ఫొటోతో జనంలోకి ఎందుకు వెళ్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. కరీంనగర్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో బీజేపీ ముఖ్యనేతల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతవుతుందని అన్నారు. ప్రజల కోసం పోరాడి జైలుకు వెళ్లిన చరిత్ర తనదని అన్నారు. రోడ్ల విస్తరణ, ఆర్వోబీ పనులు సహా కరీంనగర్ అభివృద్ధికి రూ.12 వేల కోట్లకుపైగా నిధులు తెచ్చింది తానే అని చెప్పారు.
కాంగ్రెస్ కు అభ్యర్ధే కరువయ్యారని.. 6 గ్యారంటీల అమలు చేస్తే ఎంతమందికి ఇచ్చారో చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు. బీజేపీ గెలుపు ఎప్పుడో ఖాయమైందని చెప్పారు. ఈ నెల 21 న నామినేషన్ వేస్తానని బండి సంజయ్ తెలిపారు.