టెండర్లు ఫైనల్ ​కాకున్నా.. జోరుగా శంకుస్థాపనలు!

టెండర్లు ఫైనల్ ​కాకున్నా.. జోరుగా శంకుస్థాపనలు!
  • కొత్తగూడెం మున్సిపాలిటీలో బీఆర్ఎస్​ పాలకవర్గం నిర్వాహకం
  • తమ హయాంలోనే పనులు చేశామని చెప్పుకునేందుకే హడావిడి
  • ఈనెల 27తో ముగియనున్న మున్సిపల్​ పాలకవర్గం పదవీకాలం
  • రూ.10కోట్ల పనులకు స్పీడ్​గా శిలాఫలకాల ఏర్పాటు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : తమ హయాంలోనే అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పుకునేందుకు కొత్తగూడెం మున్సిపాలిటీలోని బీఆర్ఎస్​ పాలకవర్గం హడావిడిగా శంకుస్థాపనలు చేస్తోంది. ఈనెల 27తో మున్సిపల్​ పాలకవర్గాల పదవీ కాలం ముగియనుంది. రూ. 10కోట్ల విలువైన డెవలప్​మెంట్​ వర్క్స్​కు సంబంధించి టెండర్లు ఫైనల్​ కాకపోయినా పనులకు శంకుస్థాపనలు చేయాలని ప్రయత్నిస్తోంది. 

రెండు, మూడు  రోజులుగా పనులు.. 

కొత్తగూడెం మున్సిపాలిటీలో బీఆర్ఎస్​ కౌన్సిలర్లు మెజార్టీ స్థానాల్లో గెలిచి పాలకవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో కొందరు బీఆర్ఎస్​ కౌన్సిలర్లు ఇటీవల  కాంగ్రెస్​లో చేరారు. కానీ మున్సిపల్​చైర్​పర్సన్​కాపు సీతాలక్ష్మి, వైస్​ చైర్మన్​ దామోదర్​యాదవ్​తో పాటు పలువురు కౌన్సిలర్లు బీఆర్​ఎస్​లో కొనసాగుతూ తమ హయాంలోనే అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పేందుకు రెండు, మూడు రోజులుగా డెవలప్​మెంట్​వర్క్స్​కు శంకుస్థాపనలు చేయాల్సిందేనంటూ బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు ఆఫీసర్లపై ఒత్తిడి తెస్తున్నారు. 

రూ.10కోట్ల వర్క్స్.. టెండర్లు ఫైనల్ ​కాకుండానే.. 

కొత్తగూడెం మున్సిపాలిటీలో కమ్యూనిటీ హాల్స్, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు గానూ రూ. 10కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఇటీవల ఆఫీసర్లు టెండర్లు పిలిచారు. 18వ తేదీతో టెండర్లు దాఖలు చేసుకునేందుకు గడువు ముగిసింది. 20నఓపెన్​ చేయాల్సి ఉంది. 

టెండర్లు పరిశీలించి ఆఫీసర్లు ఫైనల్​ చేస్తారు. తర్వాత టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్​తో ఆఫీసర్లు అగ్రిమెంట్​ చేసుకోవాల్సి ఉంది. అగ్రిమెంట్​ అయిన తర్వాతనే కాంట్రాక్టర్లు పనులు చేపట్టాల్సి ఉంది. కానీ ఇవన్నీ లేకుండా, టెండర్లు అధికారికంగా ఫైనల్​కాకుండానే మున్సిపాలిటీల్లో గత రెండు రోజులు అభివృద్ధి పనులకు పాలకులు శంకుస్థాపన చేస్తున్నారు. టెండర్లు ఫైనల్​ కాకుండా శంకుస్థాపనలు చేసే ఈ పనులకు ఆఫీసర్లు అటెండ్​అవుతుండడం గమనార్హం. మరో వైపు అసెంబ్లీ ఎన్నికలకు ముందు పలు పనులకు హడావుడిగా శంకుస్థాపన చేయగా, అవి ముందుకు సాగలేదు.