- బీఆర్‌ఎస్‌ను వీడి నీలి కండువా కప్పుకుంటున్న అసమ్మతి నేతలు
- ఇప్పటికే పలువురు కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధుల చేరిక
- మరో10 మంది కౌన్సిలర్లు సైతం చేరేందుకు సిద్ధం
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌కు బీఎస్పీ భయం పట్టుకుంది. బహుజన నినాదంలో బరిలోకి దిగిన డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్‌కు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. కొన్నాళ్ల కిందనే బీఆర్‌ఎస్‌ను వీడిన ఈయన ఎన్నో కేసులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులు మంత్రి జగదీశ్ రెడ్డి పెట్టించారనే ఆరోపణలు ఉండడం, బీఆర్ఎస్ బీసీలకు తక్కువ సీట్లు కేటాయించడం లాంటి కారణాలతో అసంతృప్తిగా ఉన్న ఆ పార్టీలోని బడుగు బలహీన వర్గాల నేతలు బీఎస్పీలో చేరుతున్నారు.
ఇప్పటికే పలువురు కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు నీలి కండువా కప్పుకోగా.. ఇదేబాటలో మరో 10 మంది కౌన్సిలర్లు ఉన్నట్లు తెలిసింది. అయితే బీఎస్పీ గెలుస్తుందా..? లేదా..? అనేది పక్కన పెడితే తమ విజయావకాశాలు దెబ్బతీస్తోందని బీఆర్‌ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే బీఎస్పీ ఆఫీస్‌పై దాడులు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
నియోజకవర్గంలో 1.32 లక్షల మంది బీసీలు..
నియోజకవర్గంలో 2.44 లక్షల మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 1.32 లక్షల మంది బీసీలు ఉన్నారు. బీసీ ఓట్లతో పాటు ఎస్సీ, ఎస్టీ ఓటర్లే టార్గెట్‌గా వట్టె జానయ్య ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో పాటు ప్రతి గ్రామంలో వందల మంది నేతలు బీఎస్పీలో చేరుతున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి కావడం, కాంగ్రెస్ టికెట్ కూడా రెడ్డి వర్గానికే ఇచ్చే అవకాశం ఉండడం బీఎస్పీకి కలిసి వస్తోంది. అన్ని పార్టీల్లోని బీసీ నేతలు, బీసీ సంఘాలు కూడా తమ వర్గం నేతకు సపోర్ట్ చేస్తామని ముందుకు వస్తున్నారు.
సూర్యాపేట మున్సిపాలిటీలోని మెజారిటీ నాయకులు ఇప్పటికే మద్దతు తెలిపారు. మున్సిపాలిటీ కి చెందిన ఇద్దరు బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు పార్టీలో జాయిన్ అవ్వగా మరో 10 మంది కౌన్సిలర్లు, ఓ సీనియర్ నాయకుడు కూడా రెండు రోజుల్లో చేరనున్నట్లు తెలిసింది. జానయ్య కూడా అన్ని మండలాల బీసీ నాయకులతో మంతనాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఎదుగుదల ఓర్వలేకనే దాడులు
తన ఎదుగుదలను చూసి ఓర్వలేకనే కొందరు నాయకులు బీఎస్పీ ఆఫీసుపై దాడులు చేశారని ఆ పార్టీ అభ్యర్థి వట్టె జానయ్య యాదవ్ ఆరోపించారు. సోమవారం బీఆర్‌ఎస్ మాజీ కౌన్సిలర్ కుంభం రజిత నాగరాజు, బీజేపీ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు మీర్ అక్బర్, టూ వీలర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్‌తో పాటు 600 మంది వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు బీఎస్పీలో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్రవర్ణ నాయకులు 75 ఏండ్లగా బహుజనులు ఓట్లతో గెలిచి పెత్తనం చేలాయిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు బహుజనవాదాన్ని గెలిపించుకునే అవకాశం వచ్చిందని, ప్రతి ఒక్కరూ బీఎస్పీకి మద్దతు ఇవ్వాలని కోరారు. 2014 ముందు ఏమీ లేని మంత్రి జగదీశ్ రెడ్డికి వేల కోట్ల ఆస్తి ఎలా వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.