కాంగ్రెస్‌‌కు డిపాజిట్ కూడా రాదు : సునీత

యాదాద్రి, యాదగిరిగుట్ట, వెలుగు:  ఆలేరు కాంగ్రెస్‌‌ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాదని బీఆర్‌‌‌‌ఎస్‌‌ అభ్యర్థి గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి జోస్యం చెప్పారు.  బీఆర్ఎస్‌‌ పార్టీ 50 వేల మెజారిటీతో గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆలేరు,  యాదగిరిగుట్టలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 24 గంటల కరెంట్‌‌, రైతుబంధును ఆపేస్తామంటున్న కాంగ్రెస్ కు పొరపాటున కూడా ఓటెయ్యొద్దని సూచించారు. రాష్ట్రంలో 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేసిందేమీ లేదని, ఇప్పుడు ఒక్కఛాన్స్ అంటూ  ఆ పార్టీ నాయకులు ఊర్ల మీద పడి తిరుగుతున్నారని మండిపడ్డారు.  

రేవంత్ రెడ్డి రాసిన లేఖ వల్లే రైతుబంధు ఆగిపోయిందని, రైతులకు మేలు జరిగితే ఓర్వని కాంగ్రెస్ ను  ఎన్నికల్లో పాతాళానికి తొక్కాలని పిలుపునిచ్చారు.  ఇప్పటివరకు భూములున్నోళ్లకు మాత్రమే రైతుబీమా వచ్చేదని,  మళ్లీ బీఆర్ఎస్ గెలిస్తే భూములు లేనోళ్లకు కూడా కేసీఆర్ బీమా వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు.  పదేళ్లలో ఆలేరు నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేశామని, మరోసారి గెలిపిస్తే పెండింగ్‌‌లో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేస్తామని మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్ ఉన్నారు.