- రాష్ట్రంలో ల్యాండ్ మాఫియాపై ఉక్కుపాదం
- రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు
మహబూబాబాద్, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్‌ను దెబ్బకొట్టేందుకు బీఆర్‌ఎస్, బీజేపీలు ఒక్కటయ్యాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి విమర్శించారు. కొన్ని ఎంపీ స్థానాల్లో బీజేపీని గెలిపించేందుకు బీఆర్‌ఎస్ ముడుపులు తీసుకుందన్న సీఎం రేవంత్ మాటలు నిజమేనన్నారు. మహబూబాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో బుధవారం మీడియాతో మాట్లాడారు.
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన మొత్తం అవినీతిమయంగా మారిందన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టారని, మిషన్ భగీరథ పేరుతో వేల కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా దక్కదన్నారు. రాష్ట్రంలో ల్యాండ్ మాఫియాపై ఉక్కు పాదం మోపుతామన్నారు. నాలుగేళ్లలో 25 లక్షల ఇండ్లను నిర్మిస్తామని ప్రకటించారు.
మానుకోట కాంగ్రెస్ క్యాండిడేట్ పోరిక బలరాంనాయక్‌ను 2 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ నెల 19న మహబూబాబాద్ ఎన్‌టీఆర్ స్టేడియంలో జరిగే సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎంపీ క్యాండిడేట్ పోరిక బలరాంనాయక్, ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రునాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, డీసీసీ అధ్యక్షుడు భరత్ చందర్‌రెడ్డి పాల్గొన్నారు.