బీఆర్ఎస్ను గెలిపించకపోతే పెన్షన్లు రావు, దళితబంధు రాదు, రైతుబంధు రాదు మొదలైన బెదిరింపు మాటలు తెలంగాణ ఓటర్ల పై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ అంధకారమేనని, ధరణిని తీసేస్తారని చేసిన బెదిరింపులు కూడా పనిచేయలేదు. కేసీఆర్ ఓటమికి అనేక కారణాల్లో నిరుద్యోగ సమస్య ఒక బలమైన కారణం. ఉన్న ఖాళీలను భర్తీ చేయకపోవడం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్లక్ష్య నిర్వహణ, పరీక్షల రద్దు, పేపర్ లీకేజీలతో కేసీఆర్ సర్కార్ నిరుద్యోగుల్లో పూర్తి విశ్వాసాన్ని కోల్పోయింది.
కేసీఆర్ అహంకార ధోరణితో ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడం, తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోకపోవడం కూడా ప్రధాన కారణాలయ్యాయి. మంత్రులతో, ఎమ్మెల్యేలతో, అధికారులతో, ఇతర నాయకులతో, కార్యకర్తలతో, ప్రజలతో,ప్రజాసంఘాల నాయకులతో, ఉద్యమకారులతో మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటున్నారో, ప్రజల సమస్యలు ఏమిటో కేసీఆర్‌కు తెలిసేవి. ఎవరికీ అతనితో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో ఏ నిర్ణయమైనా అతని ఆలోచనలతోనే తీసుకోవడం జరిగింది. దీనివల్ల కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు దూరమైంది. కేవలం 24 గంటల కరెంటు, రైతు బంధు పథకం, పెన్షన్లు తనను గట్టెక్కిస్తాయని అనుకున్నాడు. కానీ, ప్రజలు మార్పును కోరుకున్నారు.
బీజేపీ అభ్యర్థుల వ్యక్తిగత బలంతోనే 8 స్థానాలు
బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించినా అందులో దాదాపు అభ్యర్థుల వ్యక్తిగత పలుకుబడే ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఆదిలాబాద్ నుంచి పాయల్ శంకర్ కొన్ని ప్రజాహిత కార్యక్రమాలు చేయడం, కాంగ్రెస్ అభ్యర్థిని కాదని రెబల్ అభ్యర్థి నిలబడడం వల్ల పాయల్ శంకర్ గెలుపు సులభమైంది. నిర్మల్‌లో పోటీ చేసిన మహేశ్వర్ రెడ్డి ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించడం అతని విజయానికి కారణం. సిర్పూర్లో బీజేపీ అభ్యర్థి వ్యక్తిగత పలుకుబడి, మంచి పేరు, ప్రజాహిత కార్యక్రమాలు ఆయన విజయానికి కారణం. కామారెడ్డి అభ్యర్థికి మంచి పేరు ఉండడం సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రధాన కారణం.
హైదరాబాద్‌లో గోషామహల్ నుంచి గెలిచిన అభ్యర్థి రాజాసింగ్ కూడా వ్యక్తిగత పలుకుబడి, ప్రజలతో సంబంధాలు అతని విజయానికి కారణం. అతి విశ్వాసంతో రెండు చోట్ల పోటీ చేయడం ఈటల రాజేందర్ ఓటమికి కారణం. బండి సంజయ్, అరవింద్, రఘునందన్, సోయం బాపురావు లాంటి నాయకుల అతి విశ్వాసమే వారి కొంపముంచింది. హిందువుల ఓట్లు రాబట్టడానికి చేసిన ప్రయత్నం వారి ఓటింగ్ శాతాన్ని పెంచినా మెజారిటీ ప్రజలను ప్రభావితం చేయలేదు. బీసీని ముఖ్యమంత్రిని చేస్తామనే ప్రకటన కూడా ఏ మాత్రం పనిచేయలేదు. విచిత్రంగా బీజేపీలోని ప్రముఖ బీసీ నాయకులంతా ఓడిపోయారు. మందకృష్ణ మాదిగ, పవన్ కల్యాణ్ లాంటి ప్రయోగాలు పనిచేయలేదు. ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా లాంటి నాయకులు విస్తృతంగా పర్యటించినా ఫలితం రాలేదు.
మేధావులు, ఉద్యమకారులు, నిరుద్యోగుల కృషి
బీఆర్ఎస్, బీజేపీలను ఓడించాలని అనేక మంది మేధావులు, విద్యావంతులు, ఉద్యమకారులు పనిచేశారు. చాలా నియోజకవర్గాల్లో నిరుద్యోగులు తమంత తామే ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసి బీఆర్ఎస్ను ఓడించమని చెప్పారు. దీంతో ప్రజల ఆలోచన ధోరణి మారిపోయింది. బీఆర్ఎస్ డబ్బులు పంచినా, ప్రజలు డబ్బులు తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారని సమాచారం. కాంగ్రెస్ పార్టీ నాయకుల అతి విశ్వాసం వల్ల , సరైన వారికి కొన్నిచోట్ల టికెట్లు కేటాయించకపోవడం కాంగ్రెస్ కొంత నష్టపోయింది. హైదరాబాద్‌లో మజ్లిస్ రిగ్గింగ్‌ను కాంగ్రెస్ అడ్డు కోకపోవడం, ముస్లింలలో పలుకుబడి తగ్గినా మజ్లిస్గెలుపునకు కారణమైంది. ఇతర రాష్ట్రాల్లో బీజేపీ గెలవడానికి ప్రధాన కారణం ప్రతిపక్షాల ఐక్యత లేక పోవడం, ప్రతిపక్షాల ఓట్లు చీలిపోవడం.
విద్య, వైద్యం ప్రభావం
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజల సంక్షేమాన్ని చూడాలి. ప్రజల ప్రధాన సమస్యల్ని తీర్చే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేట్ సంస్థలను బలపరచడం, కార్పొరేట్ విద్యను, వైద్యాన్ని ప్రోత్సహించడం, ప్రభుత్వ విద్యా రంగాన్ని ధ్వంసం చేయడం, ప్రభుత్వ వైద్య రంగాన్ని పరిపుష్టం చేయకపోవడం వల్ల విద్య, వైద్య ఖర్చులు పెరిగిపోయాయి. అవి బీజేపీ, బీఆర్ఎస్ ఓటమికి కారణాలయ్యాయి.
పోల్ మేనేజ్మెంట్ సరిగా లేక..
కాంగ్రెస్ పార్టీలో కూడా జగ్గారెడ్డి లాంటి సీనియర్ నాయకుడు ఓడిపోవడానికి అతి విశ్వాసమే ప్రధాన కారణం. మధుయాష్కి ఎల్బీ నగర్ ప్రాంతంలో గతంలో ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించకపోవడం, కొత్తగా రంగంలోకి రావడం ఒక కారణమైతే.. మరో కారణం బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లను కాంగ్రెస్, బీజేపీ పంచుకోవడం ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి దోహదం చేసింది. పోల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కనీసం మరో ఐదారు సీట్లు కోల్పోయిందని చెప్పవచ్చు.
బీఆర్ఎస్, బీజేపీ బంధమూ ఓటమికి కారణమే
కేసీఆర్ పైన వస్తున్న అవినీతి ఆరోపణలు నిజమేనని, కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్స్ కుంగడంతో వాస్తవమేనని ప్రజలు భావించారు. కేసీఆర్‌కు బీజేపీకి ఒప్పందం ఉందనే ప్రచారాన్ని ప్రజలు నమ్మారు. లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కున్న కవితను అరెస్టు చేయకపోవడం కేసీఆర్ కుటుంబంపై, ఎలాంటి ఈడీ, సీబీఐ దాడులు చేయకపోవడం బీజేపీకి కేసీఆర్‌కు అనైతిక సంబంధం ఉందనే వాదనకు బలం చేకూర్చింది. అంతేకాదు బీజేపీ నుంచి బయటకు వచ్చిన వివేక్ లాంటి వారి మీద మరికొందరి మీద కేంద్ర సంస్థలు దాడులు చేయడం కూడా బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందనే భావన ఏర్పడింది.
- జస్టిస్ చంద్రకుమార్, హైకోర్ట్ జడ్జి (రిటైర్డ్)