
= కీలక అంశాలపై స్టాండ్ చెప్పాల్సి వస్తుందనే దూరంగా ఉన్నారా?
= నిన్న కేంద్ర మంత్రులకు ఫోన్ చేసిన డిప్యూటీ సీఎం భట్టి
= ఇవాళ ఉదయం రాలేమంటూ బండి, కిషన్ రెడ్డి రిప్లయ్
= తాము హాజరు కావడం లేదని ప్రకటించిన బీఆర్ఎస్
= ఎంఐఎం తరఫున హాజరైన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
= రాష్ట్రానికి నిధులు రాబట్టడంపైనే ప్రధానంగా చర్చ
హైదరాబాద్: కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టేందుకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు దూరంగా ఉన్నారు. ముఖ్యంగా మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, ఆర్ఆర్ఆర్కు నిధులు, ఫ్యూచర్ సిటీకి కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన ఇవాళ ప్రజాభవన్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రావాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కి భట్టి విక్రమార్క స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. బీఆర్ఎస్ రాజ్యసభ్య సభ్యులకు కూడా ఆహ్వానం పంపారు.
వీరితోపాటు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ను సైతం ఆహ్వానించారు. ఇవాళ ఉదయం ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక నోట్ విడుదల చేశారు. తాము సమావేశానికి రాలేమని, మహిళా దినోత్సవం కార్యక్రమాల్లో బిజీగా ఉన్నామని పేర్కొన్నారు. ముందుగా చెబితే ప్లాన్ చేసుకునేవారమని అన్నారు. బీజేపీ తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. పదేండ్లలో పది లక్షల కోట్ల రూపాయలను తెలంగాణ అభివృద్ధి కోసం ఖర్చు చేసిందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తామని ప్రకటించారు.
ALSO READ | సౌత్‌లో బీజేపీకి సీట్లు తగ్గతాయనేది రీజనల్ పార్టీల ఫేక్ ప్రచారం: MP అరవింద్
మరో వైపు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కూడా ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం కేఆర్ సురేశ్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథి రెడ్డి, దామోదర్ రావు బీఆర్ఎస్ తరఫున రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు. వీళ్లు నలుగురు కూడా ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కాలేదు. పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం మేరకే సమావేశానికి దూరంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఇవాళ్టి సమావేశానికి కాంగ్రెస్ నుంచి గెలుపొందిన లోక్ సభ సభ్యులు, రాజ్యసభ ఎంపీలు సమావేశానికి హాజరయ్యారు. వీరితో పాటు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వచ్చారు.
కీలక అంశాలపై స్టాండ్ చెప్పాల్సి వస్తుందనేనా..?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, కేంద్ర మంత్రులను పలు మార్లు కలిసి విజ్ఞాపన పత్రాలు సమర్పించారు. ముఖ్యంగా మూసీ నది ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీతో పాలు ఐటీఐఆర్, ఐఐఎం, బయ్యారం ఉక్కు పరిశ్రమ తదితర అంశాలను ప్రస్తావించారు. వినతి పత్రాలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం నిధుల మంజూరు విషయాన్ని అటకెక్కించింది. దీంతో కేంద్ర మంత్రులు ఇద్దరున్నా నిధులు తేవడం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.
మెట్రో విస్తరణకు, మూసీ ప్రక్షాళను కిషన్ రెడ్డే అడ్డుపడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. మూసీ ప్రక్షాళన చేస్తే మొదటి తట్ట తానే మోస్తానని, తాను అడ్డుపడటం లేదని కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ అలైన్ మెంట్ మార్చకుంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం కూడా చేశారు. మెట్రోకు తాను అడ్డుకాదని క్లారిటీ ఇచ్చారు. సమావేశానికి హాజరైతే ఇటు బీజేపీ, అటు బీఆర్ఎస్ తమ పార్టీ స్టాండ్‌ను కచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. అందుకే మీటింగ్ కు రాలేదనే చర్చ ఉంది.