అమలు కాని హామీలే ఎజెండాగా.. పోటా పోటీగా ప్రజల్లోకి బీఆర్ఎస్​, బీజేపీ

 

నిజామాబాద్,  వెలుగు:  ఇందూరులో పాగా వేసేందుకు బీఆర్ఎస్, బీజేపీ అన్ని రకాల వెపన్స్​ రెడీ చేసుకుంటున్నాయి.  జిల్లాలో ఎన్నో ఏండ్లుగా పెండింగ్ ​ఉన్న పసుపుబోర్డు హామీతో  ఎంపీ అర్వింద్​ను ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్​యత్నిస్తుండగా,  పోటీగా నిజాం షుగర్స్​, ఎన్నారై సెల్, డబుల్​బెడ్​రూం ఇండ్ల  పంపిణీ లాంటి అమలు కాని హామీలపై బీజేపీ లీడర్లు నిలదీస్తున్నారు. ఎలక్షన్స్​ టైం దగ్గర పడుతుండడంతో ఇప్పటికే అధికార పార్టీ లీడర్లు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో హడావుడి చేస్తుండగా,  ప్రతిపక్ష పార్టీ లీడర్లు అదునుచూసి రంగంలోకి దిగుతున్నారు.  ఎంపీ అర్వింద్​పసుపుబోర్డు తేవడంలో విఫలమయ్యారని  బీఆర్ఎస్ ​లీడర్లు రైతుల పేరుతో  ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీటుగా బీజేపీ లీడర్లు సీఎం కేసీఆర్​హామీలు ఏమయ్యాయని ఫ్లెక్సీల పక్కనే  ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.  

 ఎంపీ అర్వింద్ ​లక్ష్యంగా ..
 
ఏడాది కాలంగా పసుపుబోర్డు ఏర్పాటుపై బీఆర్ఎస్​, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పసుపు బోర్డు ఏర్పాటు చేయలేదని రైతుల పేరుతో బీఆర్ఎస్​లీడర్లు ఎంపీ అర్వింద్ పర్యటనను పలు మార్లు అడ్డుకున్నారు.  ఇటీవల పసుపు బోర్డు ఏర్పాటు చేసే  ప్రపోజల్స్​లేవని  కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ పార్లమెంటులో ప్రకటించడంతో గురువారం జిల్లా అంతటా  ‘పసుపు బోర్డు.. ఇది మా ఎంపీ గారు తెచ్చిన పసుపు బోర్డు’ అని పసుపు రంగులో ఫ్లెక్సీలు వెలిశాయి.  ‘గత ఎన్నికల్లో  పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్న అర్వింద్ బాండ్ పేపరు రాసిచ్చినా నేటికీ నెరవేర్చలేకపోయారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయలేమని కేంద్రం చెప్పినా.. ఎంపీ స్పందిచడం లేదు. ఇచ్చిన హామీ నెరవేర్చ లేకపోతే పదవికి రాజీనామా చేస్తానన్న ఎంపీ ఎందుకు రాజీనామా చేయడం లేదు’ అని ఫ్లెక్సీలో ప్రశ్నించారు.  

నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ ఏమైంది..

రైతుల పేరుతో వెలసిన ఫ్లెక్సీలకు కౌంటర్​గా  ఇందూరు లో ఎనిమిదేండ్ల పాలనలో జిల్లాకు సీఎం కేసీఆర్​ ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తూ  ఫ్లెక్సీలు వెలిశాయి.  నిరుద్యోగ భృతి,  రైతు రుణ మాఫీ, ఉచిత యూరియా పంపిణీ, దళితులకు మూడెకరాల భూమి లాంటి హామీలు ఏమయ్యాయని ఫ్లెక్సీలలో రాసి ఉంది.  రైతుల పేరుతో వెలసిన ఫ్లెక్సీల పక్కనే,  ప్రభుత్వానికి వ్యతిరేకంగా  ఫ్లెక్సీలు ఏర్పాటు  చేయడంతో సదరు ఫ్లెక్సీలను బీజేపీ, బీఆర్ఎస్​లీడర్లు శుక్రవారం పోటాపోటీగా  చించివేయడంతో మళ్లీ  ప్రత్యక్ష పోరు  మొదలైంది. 

ఏడాదిగా మాటల యుద్ధం..

ఎంపీ ధర్మపురి అర్వింద్​, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య ఇప్పటికే మాటల యుద్ధం మొదలైంది.  ఎమ్మెల్సీ కవిత .. మల్లికార్జున ఖర్గేకు ఫోన్ చేసి కాంగ్రెస్ లో చేరుతానని చెప్పినట్టు  ఎంపీ అర్వింద్ చేసిన కామెంట్స్ ఆ రెండు పార్టీల మధ్య ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. అర్వింద్ కామెంట్స్ పై కవిత సీరియస్ గా స్పందించారు. అంతేకాదు.. బీఆర్ఎస్ శ్రేణులు అర్వింద్ ఇంటిపై దాడులకు దిగాయి.  బీజేపీ శ్రేణులు కూడా రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చాయి.     అప్పటినుంచి నగర ప్రజలకు సీఎం ఇచ్చిన హామీలు, ప్రభుత్వ వైఫల్యాలు, లీడర్ల  దందాలను ప్రశ్నిస్తూ  బీజేపీ సైలెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా,  బీఆర్ఎస్​అభివృద్ధి పనులతో హంగామా చేస్తోంది. దీంతో ఆరు నెలల ముందుగానే  ఇందూరు పాలిటిక్స్​హీటెక్కాయి.