హెచ్సీయూ భూముల విషయంలో.. బీఆర్ఎస్​, బీజేపీవి పచ్చి అబద్ధాలు.. మీడియాతో మంత్రులు

హెచ్సీయూ భూముల విషయంలో.. బీఆర్ఎస్​, బీజేపీవి  పచ్చి అబద్ధాలు.. మీడియాతో మంత్రులు
  • రెండు పార్టీల ఫెవికాల్​ బంధం మరోసారి బయటపడింది
  • హెచ్​సీయూ నుంచి అంగుళం భూమి కూడా తీసుకోవడం లేదు
  • మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్​బాబు, పొంగులేటి
  • ఫ్రాడ్​ సంస్థకు 400 ఎకరాల ప్రభుత్వ ల్యాండ్​ కేటాయిస్తే మేం కొట్లాడినం
  • కోర్టులో పోరాడి వేల కోట్ల విలువైన ఆ భూములను వెనక్కి తెచ్చినం
  • పదేండ్లు బీఆర్​ఎస్​ పవర్​లో ఉండి ఎందుకు పట్టించుకోలే?
  • ఇప్పుడు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నరు: భట్టి విక్రమార్క
  • 1,500 ఎకరాల హెచ్​సీయూ భూములకు ఇప్పటికీ టైటిల్​ లేదు.. త్వరలోనే ఇస్తం: శ్రీధర్​బాబు
  • హెచ్‌‌‌‌సీయూ పరిసరాల్లో జీవ వైవిధ్యాన్ని కాపాడుతామని వెల్లడి
  • వర్సిటీ చుట్టూ హైరైజ్​ బిల్డింగులకు పర్మిషన్​ ఇచ్చింది బీఆర్​ఎస్​ కాదా?: పొంగులేటి
  • విద్యార్థుల ముసుగులో అధికారులపై బీఆర్ఎస్ దాడులు చేస్తున్నదని ఫైర్

హైదరాబాద్, వెలుగు: అబద్ధాల మీద బతుకుతున్న కొన్ని రాజకీయ పార్టీలు కంచ గచ్చిబౌలి భూములపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్​బాబు, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి మండిపడ్డారు. ‘‘పదేండ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్​ఎస్..  ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూములను వెనక్కి తెచ్చేందుకు ఏనాడూ ప్రయత్నించలేదు. మా ప్రజా ప్రభుత్వం కొట్లాడి వాటిని వెనక్కి తెచ్చింది. అలాంటి భూములపై ఇప్పుడు బీఆర్​ఎస్​, బీజేపీ రాద్ధాంతం చేస్తున్నాయి. అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయి. ఆ రెండు పార్టీల ఫెవికాల్​ బంధం మరోసారి బయటపడింది” అని వ్యాఖ్యానించారు.

 హైదరాబాద్‌‌‌‌ సెంట్రల్‌‌‌‌ వర్సిటీకి చెందిన ఒక్క అంగుళం భూమిని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం లేదని స్పష్టం చేశారు.  అసలు హెచ్‎సీయూ భూములకు ఇప్పటి వరకు ల్యాండ్ టైటిల్ లేదని.. తాము వర్సిటీ భూములకు టైటిల్ ఇవ్వాలని నిర్ణయించామని వెల్లడించారు. మంచి పని చేసే విషయంలో ప్రతిపక్షాలు ఎంత అడ్డు తగిలినా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. హెచ్​సీయూ  ల్యాండ్ చుట్టూ హైరైజ్ భవనాలకు గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం అనుమతులు ఎలా ఇచ్చిందని, అంత ఎత్తయిన భవనాలు నిర్మించినప్పుడు పర్యావరణానికి నష్టం జరుగుతుందనే ఆలోచన లేదా?  అని నిలదీశారు. 

రాక్‌‌ ఫార్మేషన్స్, లేక్‌‌లు, ప్రసిద్ధి గాంచిన మష్రూమ్‌‌ రాక్స్‌‌, పికాక్‌‌ లేక్‌‌ను పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, హెచ్‌‌సీయూ పరిసరాల్లో జీవ వైవిధ్యాన్ని కాపాడతామని తెలిపారు. 400 ఎకరాల ప్రభుత్వ భూమిని న్యాయపరంగానే ప్రభుత్వం తీసుకున్నదని, హెచ్‌‌సీయూ విద్యార్థులు ఆందోళనకు గురికావొద్దని వారు కోరారు.  కంచ గచ్చిబౌలి భూముల అంశంపై మంగళవారం సెక్రటేరియెట్​లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్​ బాబు, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

ఫ్రాడ్​ సంస్థకు కేటాయిస్తే.. వెనక్కి తెచ్చినం: భట్టి

ప్రైవేట్​ వ్యక్తుల చేతుల్లో ఉన్న భూములను వెనక్కి తెచ్చేందుకు పదేండ్లలో ఏనాడైనా గత బీఆర్​ఎస్​ సర్కార్​ ప్రయత్నించిందా? అని డిప్యూటీ సీఎం భట్టి ప్రశ్నించారు. కావాలనే ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. హెచ్‌‌సీయూ నుంచి భూములను లాక్కొని రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏవో వెంచర్లు, ప్లాట్లు వేసి అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కల్పితాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

 ‘‘పదేండ్లు ఈ 400 ఎకరాల ప్రభుత్వ భూములను గాలికొదిలేశారు. ఇప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధి జరగాలి. సంపద సృష్టించాలి. ఉపాధి పెరగాలి. మేం పట్టించుకోకపోతే ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లేది. 400 ఎకరాలు సాధించడం ఈ ప్రభుత్వ విజయం.. రాష్ట్ర ప్రజల విజయం’’ అని ఆయన పేర్కొన్నారు. 400 ఎకరాలను కాపాడి.. అక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు లభించేలా ఒక కార్యాచరణ రూపొందించి ముందుకెళ్తున్నామని తెలిపారు. యువతకు భారీ ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.  

‘‘2024  జనవరి 13- -వరకు ఈ 400 ఎకరాలు(కంచ గచ్చిబౌలిలోని) హైదరాబాద్​ సెంట్రల్​ యూనివర్సిటీ (హెచ్‌‌సీయూ) పరిధిలోనే ఉన్నట్లు వర్సిటీ భావించింది. వాస్తవాలను చూస్తే ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఈ 400 ఎకరాలను వర్సిటీ నుంచి తీసుకొని ఓ ప్రైవేటు సంస్థకు కేటాయించారు. నాడు ప్రభుత్వం హెచ్​సీయూ నుంచి తీసుకున్న ఈ 400 ఎకరాల భూమికి బదలాయింపుగా గోపన్ పల్లి గ్రామంలోని సర్వే నంబర్ 36 లో 191.36 ఎకరాలు, సర్వేనెంబర్ 37 లో 205.20 ఎకరాలను అప్పగించారు.  

భూ బదలాయింపు జరిగిన తర్వాత 2004లో అప్పటి టీడీపీ ప్రభుత్వం కంచ గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూమిని బిల్లీ రావు ప్రాతినిథ్యం వహించిన ఐఎంజీ ఫ్లోరిడాకు చెందిన ఐఎంజీ భారత అనే ఓ ఫ్రాడ్‌‌ సంస్థకు కేటాయించింది. దానికి సంబంధించి ఆనాడు రెవెన్యూ అధికారులు, వర్సిటీ యాజమాన్యం కలిసి సంతకం చేసిన రికార్డులు ఉన్నాయి.

 రాష్ట్ర ప్రజలు, వర్సిటీ విద్యార్థులకు ఈ విషయాలు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అంశంలో కొన్ని రాజకీయ పార్టీలు కావాలనే దుష్ప్రచారం చేస్తూ ప్రజలను, విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయి” అని భట్టి విక్రమార్క మండిపడ్డారు.  2004లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఐఎంజీ భారత అనే ఫ్రాడ్​ సంస్థకు 400 ఎకరాలు కేటాయిస్తే.. -2006లో వైఎస్సార్​ నాయకత్వంలోని కాంగ్రెస్​ ప్రభుత్వం ఆ కేటాయింపులను రద్దు చేసిందని గుర్తుచేశారు. దీనిపై ఐఎంజీ భారత  సంస్థ.. ‘‘ఇప్పటికే గత ప్రభుత్వం రాసి ఇచ్చింది... ఇప్పుడు మీరు రద్దు చేస్తే ఎలా?”అని హైకోర్టులో రిట్‌‌ పిటిషన్‌‌ వేసిందని ఆయన తెలిపారు. 

అప్పట్లోనే నాటి తమ కాంగ్రెస్​ ప్రభుత్వం పోరాటం చేసిందని పేర్కొన్నారు. కానీ, బీఆర్​ఎస్​అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదని, పదేండ్లు ఆ ఊసే ఎత్తలేదని విమర్శించారు. ‘‘తిరిగి కాంగ్రెస్‌‌ పార్టీ అధికారంలోకి రాగానే రూ.వేల కోట్ల విలువైన ఆ భూమి ప్రభుత్వానికే చెందేలా పోరాటం చేయాలని సీఎం రేవంత్​ రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌‌లో నిర్ణయం తీసుకున్నాం. హైకోర్టులో కొట్లాడి కేసు గెలిచాం. తెలంగాణ ప్రజల ఆస్తిని తిరిగి తెచ్చుకున్నాం. ఆ తర్వాతే టీజీఐఐసీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఇది అభినందించాల్సిన విషయం. కానీ, దీనిపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి” అని భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. 

విద్యార్థులు ఆందోళనకు గురికావొద్దు: శ్రీధర్​ బాబు

హైదరాబాద్‌‌ సెంట్రల్‌‌ యూనివర్సిటీకి సంబంధించిన ఆస్తి, ఒక అంగుళం భూమిని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదని మంత్రి శ్రీధర్‌‌ బాబు స్పష్టం చేశారు. ఈ విషయంలో కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలతో అనుసంధానంగా ఉన్న సంఘాలు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. హెచ్​సీయూ భూమి ఆ వర్సిటీకే ఉందని తెలిపారు. ప్రభుత్వ పనికి అడ్డుతగిలితే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.  

‘‘వారం రోజుల కింద హెచ్‌‌సీయూ వీసీ, రిజిస్ట్రార్‌‌తో ప్రభుత్వ పరంగా మేం సంప్రదింపులు చేశాం. వారికి స్పష్టంగా చెప్పాం. చాలా ఏండ్లుగా పెండింగ్‌‌లో ఉన్న సమస్యను పరిష్కరించాలని భావించాం. వర్సిటీ భూమి వర్సిటీకే ఉండాలని వారికి తెలియజేశాం. 2016లో సీనియర్‌‌ ఐఏఎస్‌‌ అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తే.. 1,500 పైచిలుకు ఎకరాల భూమి వారికి న్యాయపరంగా ఇచ్చేందుకు సిఫార్సులు చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మీ ఎగ్జిక్యూటివ్‌‌ కౌన్సిల్‌‌లో చర్చించాలని సూచించాం. 

చట్టపరమైన అన్ని హక్కులు కల్పిస్తామని వారికి స్పష్టంగా చెప్పాం.    రాక్‌‌ ఫార్మేషన్స్, లేక్‌‌లు,  మష్రూమ్‌‌ రాక్స్‌‌, పికాక్‌‌ లేక్‌‌ను పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. హెచ్‌‌సీయూ పరిసరాల్లో జీవ వైవిధ్యాన్ని కాపాడతాం. 400 ఎకరాల ప్రభుత్వ భూమిని న్యాయపరంగానే ప్రభుత్వం తీసుకుంటున్నది. హెచ్‌‌సీయూ విద్యార్థులు ఆందోళనకు గురికావొద్దు’’ అని శ్రీధర్‌‌బాబు పేర్కొన్నారు. 

నాడు హైరైజ్​ భవనాలకు పర్మిషన్​ ఎలా ఇచ్చారు?: పొంగులేటి

ఫెవికల్​ బంధం ఉన్న రెండు పార్టీలు కలిసి కంచ గచ్చిబౌలి భూములపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ చీకటి బంధం మరోసారి రుజువైందని విమర్శించారు. ‘‘బీఆర్ఎస్ అధికారంలోకి ఉన్న పదేండ్లు 400 ఎకరాల అంశాన్ని ఎందుకు పట్టించుకోలేదు? చీకటి ఒప్పందంలో భాగంగా వాళ్లకు  చెందిన సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం చేశారు. 

గతంలోనే ప్రభుత్వం, వర్సిటీ మధ్య భూ మార్పిడి ఒప్పందం జరిగింది.  400 ఎకరాల ల్యాండ్ కేసులో మా ప్రజా ప్రభుత్వం గెలిచింది. దీన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలే కపోతున్నాయి. భూములు చదును చేస్తుంటే పర్యావరణానికి ప్రమాదమని దుష్ప్రచారం చేస్తున్నారు.. మూగ జీవాలు చనిపోయాయని సోషల్ మీడియాలో పాత ఫొటోలు సర్క్యూలేట్ చేస్తున్నారు. ఈ కుట్ర వెనక బీఆర్ఎస్ నేతలే ఉన్నారు. విద్యార్థుల ముసుగులో అధికారులపై దాడులకు పాల్పడుతున్నారు” అని మండిపడ్డారు. ఒక్క జంతువు అయిన చనిపోయినట్లు రుజువు చేయాలని ఆయన సవాల్ చేశారు. పాత పొటోలను షేర్​ చేస్తూ వైరల్​ చేస్తున్నారని తెలి పారు. పర్యావరణానికి, మూగ జీవాలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా భూమి చదును పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. 

ప్రతిపక్షాలది గుడ్డకాల్చి మీద  వేసే ప్రయత్నం తప్ప.. మరొకటి కాదని విమర్శించారు. అసలు హెచ్‎సీయూ భూములకు ఇప్పటి వరకు ల్యాండ్ టైటిల్ లేదని.. తాము ఇప్పుడు వర్సిటీ భూములకు టైటిల్ ఇవ్వాలని నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు. మంచి పని చేసే విషయంలో ప్రతిపక్షాలు ఎంత అడ్డు తగిలినా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 

సెంట్రల్ యూనివర్సిటీని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమని, ఇందిరా గాంధీ అని తెలిపారు. ఆ ల్యాండ్ చుట్టూ హైరైజ్ భవనాలకు గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం అనుమతులు ఎలా ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు. అంత ఎత్తయిన భవనాలు నిర్మించి నప్పుడు పర్యావరణానికి నష్టం జరుగుతుం దనే ఆలోచన లేదా?  అని నిలదీశారు. విద్యార్థుల ముసు గులో ఏసీపీ స్థాయి పోలీస్ అధికారిని కొట్టారని.. హెచ్​సీయూ లో ప్రతిపక్షాలు కిరాయి మనుషులను పెట్టారని ఆయన ఆరోపించారు. మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు హెచ్​సీయూ ఓల్డ్ స్టూడెంట్స్ అని పొంగులేటి గుర్తు చేశారు.