సీఎం అలా ఎలా మాట్లాడుతారు..? స్పీకర్ పోడియం ముందు బీఆర్ఎస్, ఎంఐఎం నిరసన

సీఎం అలా ఎలా మాట్లాడుతారు..? స్పీకర్ పోడియం ముందు బీఆర్ఎస్, ఎంఐఎం నిరసన

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. పార్టీ ఫిరాయింపులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం సుప్రీంకోర్టులో ఉందని.. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా మాట్లాడుతారని ప్రతిపక్ష బీఆర్ఎస్, ఎంఐఎం సభలో ఆందోనళనకు దిగాయి. స్పీకర్ పోడియం ఎదుట బీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ.. కోర్టు పరిధిలో ఉన్న ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంపై సీఎం సభలో ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. 

వెంటనే కలగజేసుకున్న మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపక్షాల నిరసనలను తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి కోర్టు తీర్పు గురించి మాట్లాడలేదని.. కేవలం ఫిరాయింపుల విషయంలో గతంలో మాదిరిగానే వ్యవహరిస్తామని అన్నారని వివరణ ఇచ్చారు. సీఎం మాట్లాడిన దాంట్లో తప్పేమి లేదని.. ఉప ఎన్నికలు వస్తాయని బయట బీఆర్ఎస్ నాయకులు చేస్తోన్న బెదిరింపుల గురించి మాత్రమే మాట్లారని శ్రీధర్ క్లారిటీ ఇచ్చారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంట్లో కూడా ఇలాంటి అంశంపై చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. జ్యుడిషియరిని విమర్శించే హక్కు పార్లమెంట్‎లో కూడా ఉంటుందని అన్నారు. మంత్రుల వివరణతో సంతృప్తి చెందని బీఆర్ఎస్, ఎంఐఎం ఎమ్మెల్యేలు నిరసన కంటిన్యూ చేస్తున్నారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. 

ALSO READ | సీఎం రేవంత్ ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

అంతకుముందు సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు గగ్గోలు పెడుతున్నారు. ప్రతిరోజు ఉప ఎన్నికలు వస్తాయని ప్రచారం చేస్తున్నారు. 2014 నుంచి 2024 వరకు రాష్ట్రంలో ఎలాంటి సంప్రదాయం ఉందో అదే సంప్రదాయాన్ని మేం ఫాలో అవుతున్నాం. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ మంత్రి పదవులు ఇచ్చింది. మేం ఎలాంటి పదవులు ఇవ్వడం లేదు. వాళ్ల అడుగుజాడల్లో మేం నడవడం లేదు. ప్రతి రోజు ఉప ఎన్నికలు వస్తాయని ప్రచారం చేస్తున్నారు. ఫిరాయింపుల అంశం కోర్టు పరిధిలో ఉంది. తెలంగాణలో ఎలాంటి ఉప ఎన్నికలు రావు. ఎమ్మెల్యేలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మా దృష్టి ఉప ఎన్నికలపై లేదు.. అభివృద్దిపైనే ఉంది’’ అని అన్నారు.