మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్ నవీన్ కుమార్ రెడ్డి పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నవీన్ కుమార్ పేరు ఫైనలైజ్ చేశారు కేసీఆర్.
నందిగామ మండలం మామిడిపల్లికి చెందిన ఎన్ నవీన్ కుమార్ రెడ్డి పూర్తి పేరు నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి. గతంలో ఉమ్మడి పాలమూరు జిల్లా జడ్పీ వైస్ చైర్మన్‌గా ఆయన పనిచేశారు. ఇక్కడ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో చేరి.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటి చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో పాలమూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 11వ తేదీ నామినేషన్లకు చివరి తేదీ. కాంగ్రెస్ పార్టీ తరుఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, ఎంఎస్ఎన్ ఫార్మా డైరెక్టర్ మన్నె జీవన్ రెడ్డి పోటీ చేయనున్నారు.