రాష్ట్ర సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే బీఆర్ఎస్ ప్రకటన

విజయదశమి రోజున తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్​)ని భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా మార్చినట్లు కేసీఆర్​ప్రకటించారు. దీన్ని తెలంగాణ రాజకీయాల్లో ఒక నాటకీయ పరిణామంగానే చూడాలి. కాకపోతే ఈ మార్పు టీఆర్ఎస్ రాజకీయాల  డొల్లతనాన్ని బయట పెడుతున్నది. ముందుగా మనం ఒక్క విషయాన్ని చెప్పుకోవాలి. టీఆర్ఎస్ ను ఇప్పుడు బీఆర్ఎస్​గా రంగు మార్చినంత మాత్రాన తెలంగాణకు ఒరిగేదేమీ లేదు. పోనీ దీనివల్ల భారత దేశ రాజకీయాలు బాగుపడుతాయా? కేసీఆర్ దేశాన్ని ఉద్ధరించే ఉదాత్త ఆశయంతో భారత రాష్ట్ర సమితిని పెట్టలేదు. బీఆర్ఎస్​వల్ల దేశ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు కూడా సంభవించవు. ఎక్కడా గెలిచేది ఉండదు.. అధికారంలోకి వచ్చేది ఉండదు. ఇవన్నీ కేసీఆర్ కు తెలియవా? అంటే, అన్నీ తెలిసే ఆయన బీఆర్ఎస్​ను ఏర్పాటు చేశాడు. దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టి గెలవనని కేసీఆర్ కు స్పష్టంగా తెలుసు. అయినా ఆయన జాతీయ పార్టీని పెట్టడం వెనుక తన తక్షణ ప్రయోజనాలే ఉన్నాయి తప్ప దేశాన్ని  కాపాడే ఆలోచన లేదు. 

రాష్ట్ర ప్రజలకు ఏ మేలూ జరగలే..

ఇయ్యాల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్సలు బాగ లేదు. రాష్ట్ర అప్పు రూ. 3,12,000 కోట్లకు చేరుకున్నది. కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి లేదు. అప్పు తేకుండా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేయలేదు. కనీసం ఉద్యోగుల జీతాలను కూడా ఇచ్చే పరిస్థితిలేదు. అధికారిక లెక్కల ప్రకారమే 2014 –- 2019 మధ్య కాలంలో నిరుద్యోగం మూడు రెట్లు పెరిగి తార స్థాయికి చేరుకున్నది. ఉద్యోగం, ఉపాధి అవకాశాలు లేక యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. 

“నిరుద్యోగమే నా ఆత్మహత్యకు కారణమని” సూసైడ్ నోట్ రాసిపెట్టి చనిపోయిన యువకులూ ఉన్నారు.  రైతులకు రుణ మాఫీ అమలు కాక పోవడంతో భారం పెరిగిపోతున్నది. జోనల్ వ్యవస్థలో ఉద్యోగుల కేటాయింపు కూడా ఈ ప్రభుత్వం సక్రమంగా నిర్వహించలేకపోయింది. ధాన్యం సేకరణలో దోపిడీని ఆపలేక పోయింది. పోడు రైతుల భూ సమస్యను   అటవీ హక్కుల చట్టం ప్రకారం పరిష్కరించలేక పోయింది. ఎనిమిదేండ్లలో ఒక్క పోడు రైతుకు కూడా పట్టా రాలేదు.  ధరణి పేరుతో పేద రైతుల హక్కులను కాలరాసి, వాటిని బడా బాబులకు దఖలు పరిచింది. అభివృద్ధి పేరుతో నాటి జాగీర్దార్లను మరిపించే విధంగా పేద రైతుల భూములు లాక్కుంటున్నారు. కేసీఆర్ పాలన  నిరంకుశత్వానికి నిర్వచనంగా మారి పోయింది. చట్టబద్ధపాలన పట్ల వీసమెత్తు గౌరవం లేదు. ప్రతిపక్షాల మీటింగులకు అనుమతి దొరుకదు. ఎక్కడా నిరసనకు అవకాశం ఇవ్వరు.  కాంట్రాక్టర్ల జేబులు నింపిన కాళేశ్వరం వేల ఇండ్ల మునకకు, వేల ఎకరాల్లో పంట నష్టానికి కారణమైంది. అయినా దానిపై విచారణ ఉండదు. నాసిరకం భోజనం కారణంగా విద్యార్థులు తరచూ అస్వస్థతకు గురవుతున్నారు. ఇట్లాంటి ఎన్నో లోపాలు, అన్యాయాలు టీఆర్ఎస్ పాలనలో కనబడుతున్నాయి. ఆరోగ్య వ్యవస్థ కునారిల్లిపోతున్నది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కారణంగానే నలుగురు మహిళలు మరణించారంటే రాష్ట్రంలో ఆరోగ్యరంగం పరిస్థితి ఎంత అధ్వానంగా ఉన్నదో అర్థమవుతున్నది. పాలనలో లోపాలను సరిదిద్దుకొని ప్రజలకు న్యాయం చేసే ప్రయత్నం ఎప్పుడూ జరగడం లేదు. ఆ ప్రయత్నం టీఆర్ఎస్ ఇప్పటికే మొదలుపెట్టి ఉంటే, ఇప్పుడు ఇట్లాంటి నిర్ణయాలు చేసి ఉండరు.

దృష్టి మళ్లించేందుకే..

ఈ ప్రజా వ్యతిరేక పాలన వల్లనే ఇయ్యాల టీఆర్ఎస్​ పార్టీ ప్రజల్లో బద్నాం అయింది. ఆ పరిస్థితి నుంచి బయట పడటానికి వేసిన ఎత్తుగడనే భారత రాష్ట్ర సమితి. బీఆర్ఎస్​ ఏర్పాటు చేయడం వల్ల.. రాష్ట్రంలో సమస్యలు, ఉద్యమ ఆకాంక్షలు, పాలనపై ప్రజల అసంతృప్తినంతటినీ మరుగున పడేసి, చర్చను ఢిల్లీకి మీదకు తిప్పవచ్చు. ఇక్కడి పరిస్థితి మీది నుంచి ప్రజల దృష్టి మళ్లించవచ్చు. చర్చించాల్సిన అంశాలను పక్కన పెట్టవచ్చు. అనవసరమైన అంశాలను చర్చలోకి తేవచ్చు. ఇదొక విచిత్రమైన రాజకీయం. ప్రజల సమస్యలను పక్కనబెట్టి అవసరం లేని అంశాలను చర్చలోనికి తెచ్చి రాజకీయాలపై పట్టు సాధించే వికృతమైన ఆట ఇది. ఈ ఆటలో ప్రజల ప్రయోజనాలు పక్కనపడిపోయి, ప్రజలతో సంబంధం లేని ఒక రాజకీయ చర్చకు తెరలేపడం టీఆర్ఎస్ ఎత్తుగడ. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. పాలకుల కుట్రలను పసిగట్టగలరు. బీఆర్ఎస్​ ఏర్పాటు ప్రజలతో సంబంధం లేని ఒక రాజకీయ ఆటకు తొలి అంకం మాత్రమే.

తక్షణ ప్రయోజనాలే ప్రధానం

తెలంగాణ ఉద్యమం వల్లే, ప్రత్యేకించి తెలంగాణ ప్రజలు,  అనేక ప్రజా సంఘాల నేతృత్వంలో  చేసిన భావ వ్యాప్తి, ఆందోళనలే టీఆర్ఎస్ ​ఏర్పడటానికి, ఎదగటానికి నిట్రాడు వలె పనిచేశాయి. అధికారం రాక ముందు ఈ విషయాన్ని టీఆర్ఎస్ నాయకత్వం గుర్తించింది. కానీ అధికారంలోకి రాగానే తమ రాజకీయ ఎదుగుదలకు తోడ్పడిన రాష్ట్ర సాధన ఉద్యమాన్ని మరిచిపొయింది. తెలంగాణా ఉద్యమమే తన ఎదుగుదలకు ఉపయోగపడిందని గుర్తిస్తే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు గుర్తుండేవి, తెలంగాణ అభివృద్ధికి అనుసరించవలసిన పంథా టీఆర్ఎస్​కు కనబడేది. ప్రజలకు చేయాల్సిన తన బాధ్యత యాదికి వచ్చేది. నిరంతరం ప్రజల పట్ల జవాబుదారీతనంతో  వ్యవహరించి ఉండాల్సి వచ్చేది. టీఆర్ఎస్ ఈ బాధ్యతను స్వీకరించ దలుచుకోలేదు. అధికారాన్ని స్వార్థ ప్రయోజనాలకు వాడుకోదలిచింది. ఆ దుష్ట బుద్ధితోనే ఉద్యమంతో ఉన్న బంధనాలను తెంచుకున్నది. తమది ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించి ఇష్టానుసారంగా పాలనాధికారాన్ని చెలాయిస్తూ వచ్చింది. తన తక్షణ ప్రయోజనమే తప్ప రాష్ట్ర ప్రజల పట్ల ఆ పార్టీకి  గౌరవం లేదని ఆనాడే తేలిపోయింది. సొంత ప్రయోజనాల కోసం అధికారాన్ని నిలబెట్టుకోవాలనే తాపత్రయంతో పనిచేస్తే  ఇక దీర్ఘకాలిక ప్రయోజనాల మీద దృష్టి ఉండదు.  ఇప్పుడు టీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం వెనుక తన తక్షణ ప్రయోజనాలే దాగి ఉన్నాయి. కుర్చీని కాపాడుకోవాలనే ఆలోచన తప్ప ఇక టీఆర్ఎస్​కు రాష్ట్రం పైన, దేశం పైన ప్రేమ లేదు. ప్రస్తుత నిర్ణయాలు ఈ కోణం నుంచి తీసుకున్నవే. రాష్ట్ర సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి ఆ పార్టీ ఇప్పుడొక వృథా ప్రయత్నం చేస్తున్నది.

- ఎం. కోదండ రామ్,
అధ్యక్షులు, 
తెలంగాణ జన సమితి