- నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి..
- భువనగిరి నుంచి క్యామ మల్లేశ్‌కు ఛాన్స్
- సీనియర్లకు మొండిచేయి.. కేడర్‌లో నిరుత్సాహం
నల్గొండ, యాదాద్రి, వెలుగు : నల్గొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలకు బీఆర్ఎస్ హైకమాండ్ కొత్త ముఖాలను తెరపైకి తెచ్చింది. సీనియర్లను కాదని జిల్లా రాజకీయాలతో పెద్దగా సంబంధం లేని వ్యక్తులను బరిలో దింపడంతో స్థానిక నేతలు షాక్‌కు గురయ్యారు. రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో ఇప్పటికే పార్టీ కేడర్‌లో నైరాశ్యం అలుముకుంది. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్లకు అవకాశం ఇస్తే కనీసం పార్టీ పరువైనా నిలబడుతుందని కార్యకర్తలు భావించారు. కానీ, కొత్తవారికి ఛాన్స్ ఇవ్వడంతో మళ్లీ పరాభావం తప్పేలా లేదని పెదవి విరుస్తున్నారు.
నల్గొండలో కృష్ణారెడ్డికి ఎదురీతే!
నల్గొండ ఎంపీ సెగ్మెంట్‌లో బీఆర్ఎస్ ఇప్పటి వరకు బోణీ కొట్టలేదు. 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గుత్తా సుఖేందర్‌రెడ్డి గెలవగా.. బీఆర్ఎస్నుంచి పోటీ చేసిన పల్లా రాజేశ్వరరెడ్డి మూడో ప్లేస్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2018లో ఆరుగురు ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ 2019లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గెలిచారు. ఈ ఎన్నికలో బీఆర్‌ఎస్ జిల్లా రాజకీయాలతో ఏమాత్రం సంబంధాలు లేని వేమిరెడ్డి నర్సింహారెడ్డిని పోటీలో దింపి చేతులు కాల్చుకుంది.
ఈ సారి కూడా నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్న కంచర్ల కృష్ణారెడ్డిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సెగ్మెంట్‌లో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో సూర్యాపేట మినహా ఆరుచో ట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇంకోవైపు మండలి చైర్మన్సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్‌కు టికెట్ నిరాకరించడంతో ఆయన సైలెంటయ్యారు.
అదీగాక గుత్తా, కంచర్ల కుటుంబాల మధ్య రాజకీయ వైరుధ్యం ఉంది. మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నప్పరెడ్డిది అదే పరిస్థితి. ఎంపీ టికెట్ఆశించిన ఆయనకు పార్టీ మరోసారి హ్యాండిచ్చింది. ఎంపీ క్యాండిడేట్ కృష్ణారెడ్డికి సీనియర్లతో తప్ప ప్రజలతో రాజకీయ సంబంధాలు అంతగా లేవు. హుజూర్నగర్, మునుగోడు, నల్గొండ, నాగార్జునసాగర్ ఎన్నికల్లో ఇన్చార్జిగా పనిచేసిన అనుభవం మాత్రమే ఉంది.
వ్యూహాత్మకంగానే మల్లేశ్‌కు భువనగిరి టికెట్
భువనగిరి అభ్యర్థిఎంపికలో జిల్లా నేతలు వ్యూహత్మకంగా వ్యవహారించినట్టు కనిపిస్తోంది. భువనగిరి ఎంపీ సెగ్మెంట్‌పరిధిలో బీసీ ఓటర్లు ఎక్కువ. వీళ్లలో గౌడ, కురమ సామాజిక వర్గాల ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. 2014లో తొలిసారిగా డాక్టర్బూర నర్సయ్యగౌడ్‌కు బీఆర్‌ఎస్ టికెట్ ఇవ్వడంతోఎంపీగా గెలిచారు. బీసీ సెంటిమెంట్, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం ఆయనకు కలసివచ్చింది. కానీ 2019 ఎన్నికల్లో సీన్ మారిపోయింది. ఎమ్మెల్యేల మధ్య విభేదాలు, పార్టీలో గ్రూపుల వల్ల కాంగ్రెస్ గెలుపొందింది.
ఆ తర్వాత బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరి టికెట్ తెచ్చుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్నుంచి మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్పేరు పరిశీలనలోకి వచ్చింది. కానీ, ఒకటే సామాజిక వర్గానికి టికెట్ఇవ్వడం వల్ల ఓట్లు చీలి కాంగ్రెస్‌కు బెనిఫిట్జరుగుతుందని భావించిన హైకమాండ్ మల్లేశ్‌ను బరిలోకి దింపినట్టు తెలిసింది. దీనివల్ల బీసీ ఓట్లు చీలిపోతాయని, అంతిమంగా పార్టీని వీడిన బూర నర్సయ్యగౌడ్‌ను కూడా దెబ్బతీయాలన్నది ఎత్తుగడ. గతంలో రంగారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్‌గా పనిచేసి, ప్రస్తుతం కుర్మ సంఘానికి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మల్లేశ్‌కు రంగారెడ్డి ప్రజలతో తప్ప నల్గొండ, భువన గిరి, సూర్యాపేట, జనగామ జిల్లాల్లోని పార్టీ కేడర్‌తో అంతగా రిలేషన్స్లేవు.
దీనికి తోడు టికెట్ విషయంలో సీనియర్లను విస్మరించడంతో బీఆర్ఎస్లో వ్యతిరేకత తప్పేలా కనిపించడం లేదు. ఇప్పటికే బీఆర్ఎస్లో చీలికలు ఏర్పడి చాలామంది కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఇది చాలదన్నట్టుగా ఎంపీ టికెట్ ఆశించిన జిట్టా బాల కృష్ణారెడ్డి, చెరుకు సుధాకర్పార్టీ వైఖరి మీద మండిపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యేల్లో ఫైళ్ల శేఖర్ రెడ్డి కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారు.
భిక్షమయ్య, జిట్టాకు దక్కని ఛాన్స్
ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా, ఆలేరు మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన బూడిద భిక్షమయ్య గౌడ్సీఎం కేసీఆర్ఇచ్చిన ఎమ్మెల్సీ హామీ మేరకు మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. కానీ, ఎమ్మెల్సీ హామీ నెరవేరకపోవడంతో ఎంపీ టికెట్‌పై హామీ ఇచ్చారని ప్రచారం జరిగింది. కానీ, చివరికి నిరాశ తప్పలేదు. ఈయనతో పాటు ఎంపీ టికెట్ ఆశించిన జిట్టా బాలకృష్ణారెడ్డి సైతం తీవ్ర నిరాశకు లోనయ్యారు. తాను పార్టీలో చేరిన సమయంలో హామీ ఇచ్చి.. ఇలా మాట తప్పుతారని అనుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని జిట్టా తెలిపారు.