నిజామాబాద్ లో ఖాళీ అవుతున్న కారు

 నిజామాబాద్ లో ఖాళీ అవుతున్న కారు
  •     ఇప్పటికే ద్వితీయ శ్రేణి లీడర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు జంప్​
  •     తాజాగా పార్టీని వీడిన జహీరాబాద్​ఎంపీ బీబీపాటిల్

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో ఓ వెలుగు వెలిగిన బీఆర్ఎస్​అసెంబ్లీలో ఓటమితో క్రమంగా తన ప్రాభావాన్ని కోల్పోతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే గులాబీ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. అసెంబ్లీ పోలింగ్​కు ముందే పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, ద్వితీయ శ్రేణి లీడర్లు ఆ పార్టీని వీడారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ జిల్లాలో ఘోర పరాభవాన్ని చవిచూసింది. 

జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క స్థానంతోనే సరిపెట్టుకున్నారు. పార్టీకి మంచి పట్టు ఉందని భావించి గులాబీ బాస్​ కామారెడ్డిలో పోటీ చేయగా ఈయనకు కూడా ఓటమి తప్పలేదు. ఏకంగా పార్టీ అధినేతే ఓడిపోవడం గులాబీ శ్రేణులను విస్మయానికి గురి చేసింది. అసెంబ్లీ ఎన్నిటకల్లో కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్​ క్యాండిడేట్లు ఓడిపోగా, కేవలం బాన్సువాడలో మాత్రమే మాజీ స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి విజయం సాధించారు. 

దీంతో బీఆర్ఎస్​ పార్టీ నుంచి లీడర్లు, ప్రజాప్రతినిధులు క్రమంగా కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నారు. శుక్రవారం జహీరాబాద్​ఎంపీ బీబీపాటిల్ ​సైతం బీఆర్ఎస్​ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇప్పటివరకు స్థానిక ప్రజాప్రతినిధులు, లీడర్లు  మాత్రమే పార్టీలు మారగా, తాజాగా ఎంపీ పార్టీ మారడంతో పెద్ద లీడర్లను సైతం ప్రభావితం చేసేలా కనిపిస్తోంది.

నియోజకవర్గాల్లో పెరిగిన వలసలు

కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ ​నియోజకవర్గాలకు చెందిన పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, మండల స్థాయి, గ్రామ స్థాయి బీఆర్ఎస్​లీడర్లు కాంగ్రెస్ ​పార్టీలో చేరుతున్నారు. కామారెడ్డిలో కేసీఆర్​ పోటీ చేసిన అసెంబ్లీ ఎన్నికల టైమ్​లోనే  ఎంపీపీ, జడ్పీటీసీ, మున్సిపల్​ కౌన్సిలర్లు కాంగ్రెస్​లో చేరారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంంలోకి రావడంతో వలసలు మరింత పెరిగాయి. కామారెడ్డి మున్సిపాలిటీకి చెందిన 17 మంది బీఆర్ఎస్​ కౌన్సిలర్లు సైతం కాంగ్రెస్​లోకి వెళ్లారు.

బీజేపీలోకి ఎంపీ బీబీ పాటిల్​

జహీరాబాద్​ ఎంపీ బీబీ పాటిల్​ శుక్రవారం బీజేపీలో చేరారు. కొద్దిరోజులుగా ఆయన పార్టీ మారుతారంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది. 2014, 2019 ఎన్నికల్లో పాటిల్ ​బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఎంపీ బీబీ పాటిల్​ఇదే జిల్లాలోని జుక్కల్​నియోజకవర్గానికి చెందినవారు. బిజినెస్​ మ్యాన్ ​అయిన పాటిల్​2014లో అనూహ్యంగా బీఆర్ఎస్​ టికెట్ ​దక్కించుకొని వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలిచారు.

ఈయనకు బీజేపీ ముఖ్య నేతలతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ మారాలని ఆయన అనుచరులు పాటిల్​పై ఒత్తిడి తీసుకొచ్చారు. స్టేట్​లో బీఆర్ఎస్​ అధికారం కోల్పోవడంతో లోక్​సభ ఎన్నికలకు ముందే ఆయన బీజేపీలో చేరారు. బీఆర్ఎస్​కు రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం లెటర్​ రిలీజ్ ​చేసిన కొన్ని నిమిషాలకే ఢిల్లీలో బీజీపీ పెద్దల సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఎంపీ అనుచరుల్లోనూ కొందరు పార్టీ మార్పుపై సమాలోచనలు చేస్తున్నారు.