బీఆర్‌‌ఎస్‌లో ఓసీ వర్సెస్​ బీసీ!

 ఉమ్మడి జిల్లాలో ఐదు చోట్ల ఈ వర్గం లీడర్ల మధ్య​ఫైట్​

  •     కోదాడ, నాగార్జునసాగర్‌‌లో ఎడతెగని వర్గపోరు   
  •     నల్గొండ, మునుగోడు, ఆలేరులో బీసీ లీడర్లు నారాజ్​
  •     ఎమ్మెల్యేల ఆధిపత్య పోరుపై తీవ్ర అసంతృప్తి

నల్గొండ, వెలుగు : ఉమ్మడి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో బీసీ, ఓసీ లీడర్ల మధ్య బిగ్ ఫైట్ నడుస్తోంది.  నల్గొండ, సూర్యాపేట జిల్లాలోని బీసీ ఎమ్మెల్యేల వైఖరిపై బీఆర్‌‌ఎస్‌లోని బలమైన సామాజిక వర్గం లీడర్లు తిరుగుబాటు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు బదులు తమకే ఛాన్స్​ఇవ్వాలన్న డిమాండ్​ముందుకు తెస్తున్నారు. నల్గొండ, యాదాద్రి జిల్లాలో మూడు చోట్ల ఎమ్మెల్యేల ఆధిపత్య పోరుపై బీసీ లీడర్లు నారాజ్​ అవుతున్నారు. ఎమ్మెల్యేల వైఖరి నచ్చని కొందరు బీసీ నేతలు సొంత దారులు వెతుక్కుంటున్నారు. 2018లో సీఎంకేసీఆర్​కుల సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని గౌడ, యాదవ సామాజిక వర్గాలకు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు.  కానీ, అదే సామాజిక వర్గం ఎమ్మెల్యేలు, ఓసీ నేతలకు మధ్య పొలిటికల్​వార్​నడుస్తుండడం చర్చనీయాంశంగా మారింది. 

ఎమ్మెల్యేలకు తప్పని ఎదురీత..

2018లో కోదాడ, నాగార్జునసాగర్‌‌లో యాదవ సామాజికవర్గానికి చెందిన నేతలు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. కోదాడలో చివరి నిమిషంలో టికెట్​దక్కించుకున్న బొల్లం మల్లయ్య యాదవ్​స్వల్ప ఓట్ల తేడాతో గట్టెక్కెరు. మల్లయ్య కోదాడ నుంచి తొలి బీసీ ఎమ్మెల్యే కావడం గమనార్హం. కాగా, అప్పటి వరకు టికెట్​వస్తదని ఆశించిన ఓసీ లీడర్లకు చివరి నిమిషంలో చేజారిపోవడంతో బీఆర్ఎస్‌లో చీలిక వచ్చింది.  ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తూ వచ్చిన మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్​రావు, కన్మంత శశిధర్​ రెడ్డి, పాండురంగారావు, యెర్నేని వెంకటరత్నం బాబు తదితర సీనియర్లు ఎన్నికలు సమీపిస్తుండడంతో ఏకతాటిపైకి వస్తున్నారు.  ఎమ్మెల్యేపై ఎదురుదాడికి దిగుతున్న వీళ్లు సిట్టింగ్‌ను మారిస్తే తమకు అవకాశం వస్తుందనే ధీమాలో ఉన్నారు. 

యాదవ ఓటర్లు అత్యధికంగా ఉన్న నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 1994 తర్వాత 2018లోనే బీసీ అభ్యర్థి నోముల నర్సింహయ్య గెలుపొందారు. 2021లో ఆయన మరణించడంతో బైపోల్‌లో ఆయన కొడుకు నోముల భగత్‌కు ఛాన్స్​లభించింది. కాగా, సాగర్‌‌లో రాజకీయంగా ముందునుంచి రెడ్లదే ఆధిపత్యం. ఈ నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గాన్ని బ్యాలెన్స్​చేసేందుకు కేసీఆర్​ఎంసీ కోటి రెడ్డిని ఎమ్మెల్సీని చేశారు.  కానీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాలకు అస్సలు పడట్లేదు. ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలు నచ్చక ఓసీ లీడర్లు దూరంగా ఉంటున్నారు. కేసీఆర్​, కేటీఆర్​ఎమ్మెల్యేకు భరోసా ఇచ్చినా.. రెడ్డి నేతలు సపోర్ట్​చేయకపోవడంతో భగత్​ఒంటిరిగానే కష్టపడుతున్నారు. 

యాదవ, గౌడ ఓటర్లు ఎక్కువగా ఉన్న నల్గొండలో స్థానిక పదవుల్లో తమకు స్థానం దక్కలేదని ఆ వర్గం లీడర్లు ఫీలవుతున్నారు. ఎమ్మెల్యే భూపాల్​ రెడ్డి వ్యవహారి శైలి నచ్చక ఇప్పటికే పిల్లి రామరాజు యాదవ్ సొంత దారి చూసుకున్నారు. రామరాజు ఎఫెక్ట్​ నియోజకవర్గంలో 15 శాతం ఉండొచ్చని ఇటీవల జరిపిన ఓ సర్వేలో తేలింది. ఇక మున్సిపల్​ వైస్​ చైర్మన్ అబ్బగోని రమేశ్ గౌడ్​తో సహా పలువురు కౌన్సిలర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గతంలో మున్సిపల్​ చైర్మన్​ పదవి ఆశించిన రమేశ్..అది దక్కకపోవడంతో నుడా చైర్మన్​పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ఎన్నికల నాటికి  పరిస్థితులు మారకపోతే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని బీసీ వర్గం నేతలు హెచ్చరిస్తున్నారు

బీసీ ఓటర్లు అత్యధికంగా ఉన్న మునుగోడులో ఎమ్మెల్యే టికెట్​ఆ వర్గానికే ఇవ్వాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది.  గతేడాది జరిగిన బైపోల్‌లో అయినా అవకాశం ఇస్తారని భావించినా.. రెడ్డి వర్గామే అవకాశం దక్కించుకుంది.  తమకు అవకాశం ఇవ్వాలని  మండలానికి ఇద్దరు, ముగ్గురు బీసీ లీడర్లు ముందు నుంచీ కోరుతున్నారు.  ఈ లెక్కలను బ్యాలెన్స్​ చేసేందుకే హైకమాండ్​ కర్నె ప్రభాకర్‌‌ను ఎమ్మెల్సీని చేసింది. ప్రస్తుతం ఆయన టర్మ్​అయిపోయినా.. ఆ స్థాయిలో బీసీలకు పదవి ద క్కలేదు. ఈ సారి ఎన్నికల్లో తమకు ఛాన్స్​ఇవ్వకపోతే తాడోపేడో తే ల్చుకుంటామని బీసీ లీడర్లు హెచ్చరిస్తున్నారు.

ఆలేరు నుంచి బూడిద భిక్షమయ్యగౌడ్​ బీసీ అభ్యర్థిగా 2009 ఎన్నికల్లో కాంగ్రెస్​ నుంచి గెలిచారు.  2014, 2018లోనూ ఛాన్స్​ లభించినా.. రెడ్డి అభ్యర్థి(బీఆర్‌‌ఎస్‌) చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2019లో బీఆర్‌‌ఎస్‌లో, 2022లో బీజేపీలో చేరిన ఆయన మునుగోడు ఎన్నికల టైంలో తిరిగి బీఆర్‌‌ఎస్‌లో చేరారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తామనే హామీతోనే మళ్లీ పార్టీలోకి వచ్చినట్లు ప్రచారం జ రిగింది. నిజానికిగా బూర నర్సయ్యగౌడ్​ఎంపీగా ఓడిపోయాక, ఆ వర్గాని కి ఎలాంటి పదవులు దక్కలేదు. దీంతో అప్పటి నుంచి యాదాద్రి జిల్లాలో బీసీలు గుర్రుగా ఉన్నారు. ఎమ్మెల్సీ పదవి రాకపోవడంతో భిక్షమయ్య గౌ డ్, ఎమ్మెల్యే గొంగడి సునీతతో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఎన్నికల నాటికి పరిస్థితులు మారకపోతే పార్టీకి నష్టం తప్పదని బీసీ లీడర్లు హెచ్చరిస్తు న్నారు. ఇప్పటికే పలువురు నేతలు బీజేపీలో చేరారు.