- పదేండ్లు పట్టించుకోకుండా ఇప్పుడు నీతులా?
- కృష్ణా జలాల్లోని 811 టీఎంసీల్లో 299 టీఎంసీలకు సంతకం పెట్టింది గత బీఆర్ఎస్ సర్కారు కాదా?
- రాయలసీమను సస్యశ్యామలం చేస్తామన్నది కేసీఆరే కదా?
- -రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుపై చూసీచూడనట్టు నటించారు
- ఏపీతో చీకటి ఒప్పందంతోనే రాష్ట్రానికి తీరని అన్యాయం
- పోతిరెడ్డిపాడు నుంచి నీటిని ఏపీ దోపిడీ చేస్తుంటే హరీశ్‌రావు ఎందుకు ప్రశ్నించలేదని ఫైర్
హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాల వాటాలపై పదేండ్లుగా పట్టించుకోని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు నీతులు వల్లిస్తున్నారని, బీఆర్ఎస్ హయాంలోనే ఏపీ విచ్చలవిడిగా జలదోపిడీకి పాల్పడిందని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో తొలి పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా నీటి కేటాయింపులపై కొట్లాడలేదని, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ తొలి నుంచీ పోరాటం చేస్తున్నదని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రం వచ్చిన కొన్ని నెలలకే 2015 జూన్‌లో అప్పటి బీఆర్ఎస్ సర్కారు.. ఏపీతో నీటి వాటాలపై ఒప్పందం చేసుకున్నదని తెలిపారు.
ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల్లో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలకే ఒప్పుకొని, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని మండిపడ్డారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్న చీకటి ఒప్పందం కారణంగానే రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. తాత్కాలిక కేటాయింపులని చెప్తూనే ఏటా సంతకాలు చేసింది గత బీఆర్ఎస్ సర్కారు కాదా? అని మండిపడ్డారు. కృష్ణా వాటాలు తేల్చాలని పోరాటం చేయకుండా ఎందుకు సంతకాలు చేశారని ప్రశ్నించారు. కృష్ణా జలాలపై గత సర్కారు ఆడిన నాటకాలను అసెంబ్లీలోనే నిలదీసి శ్వేత పత్రం విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమని గుర్తు చేశారు. పోతిరెడ్డిపాడు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై నోరెత్తకుండా చూసీచూడనట్టు నటించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఫైర్ అయ్యారు.
గత సర్కారు హయాంలోనే ఏపీ నీళ్ల దోపిడీ
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఏపీ అడ్డగోలుగా జలదోపిడీకి పాల్పడిందని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లా రైతులు నష్టపోతుంటే కళ్లప్పగించి చూస్తూ ప్రేక్షకపాత్రకు పరిమితమైంది బీఆర్ఎస్ కాదా? అని నిలదీశారు. ‘‘బీఆర్ఎస్ హయాంలోనే ఏపీ పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని అదనంగా మరో 44 వేల క్యూసెక్కులకు పెంచింది.
కృష్ణా బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోకుండానే శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల, 80 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో పోతిరెడ్డిపాడు విస్తరణ పనులకు రూ.6,829.15 కోట్లతో పరిపాలనా అనుమతులు జారీ చేసింది. అప్పుడు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చూసీచూడనట్టు నటించింది.గోదావరి జలాలను రాయలసీమ దాకా తీసుకెళ్లి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చెప్పిందెవరు.. కేసీఆర్ కాదా?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ నేతలవి నాటకాలే
కృష్ణా, గోదావరి జలాల వాటాలను కొట్లాడి తెచ్చుకోవాల్సింది పోయి రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లేలా నాటకాలాడింది బీఆర్ఎస్ నేతలేనని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. పోతిరెడ్డి పాడు నుంచి ఏపీ నీళ్లు దోచుకెళ్లిపోతుంటే అప్పుడు అధికారంలో ఉన్న హరీశ్‌రావు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని నిలదీశారు. ‘‘1978 గోదావరి అవార్డు ప్రకారం.. పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే నాగార్జునసాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలకు నీటి హక్కులు వస్తాయని క్లియర్‌గా చెప్పారు. ఎగువ రాష్ట్రం తెలంగాణే కాబట్టి అక్కడ రావాల్సిన 45 టీఎంసీల వాటా మనకే దక్కాలి.
పోలవరం కాకుండా ఇంకా ఏదైనా కొత్త ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే అంతే పరిమాణం ఎగువ రాష్ట్రాలకు వాటా ఉంటుందని బచావత్ అవార్డు తెలిపింది. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఏపీకి తరలిస్తున్న 80 టీఎంసీల్లో తెలంగాణకు 45 టీఎంసీల వాటా దక్కాలి కదా? అప్పుడే మీరు పట్టుపడితే, నిజంగానే పోరాడితే తెలంగాణ నీటి వాటా 90 టీఎంసీల వరకు పెరిగేది కదా? ఆ నీటి వాటాలు ఎందుకు తెచ్చుకోలేదు? అది ఎవరి వైఫల్యం?’’ అని బీఆర్ఎస్నేతలను ఉత్తమ్ నిలదీశారు.
70 శాతం కావాలని కొట్లాతున్నదే మేం
గంపగుత్త కేటాయింపుల్లో ఏపీకి 70 శాతం.. తెలంగాణకు 30 శాతానికే గత బీఆర్ఎస్ సర్కారు ఒప్పుకొని అన్యాయం చేస్తే.. తెలంగాణకు 70 శాతం కావాలని కొట్లాడుతున్నదే తమ ప్రభుత్వమని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. నదీ పరివాహక ప్రాంతానికి అనుగుణంగా, అంతర్జాతీయ నీటి ఒప్పందాల ప్రకారం తెలంగాణకు రావాల్సిన నీటి వాటాల కోసం పట్టుబట్టింది, కేంద్రంపై ఒత్తిడి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ‘‘సెక్షన్3లోని ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌ను కేంద్రం పెట్టడంలో బీఆర్ఎస్ లీడర్ల గొప్పతనమేమీ లేదు. బీఆర్ఎస్ వైఖరిని కాంగ్రెస్ నిలదీసినందుకే సెక్షన్ 3 అంశం తెరపైకి వచ్చింది.
నదీ జలాల వాటాల విషయంలో జాప్యం జరగడంలో బీఆర్ఎస్ పార్టీనే ప్రధాన దోషి. వాళ్ల హయాంలోనే తెలంగాణకు అన్యాయం, ద్రోహం జరిగింది. వాటాల కేటాయింపులకు ఏర్పాటు చేసిన బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ గడువును కేంద్రం పలుసార్లు పొడిగించింది. అయినా కూడా నిర్దిష్ట గడువులో కేటాయింపులు జరిగేలా పదేండ్లపాటు నాటి బీఆర్ఎస్ సర్కారు ఎందుకు ఒత్తిడి చేయలేదు? మేం అధికారంలోకి వచ్చాకే ట్రిబ్యునల్ ద్వారా వేగంగా నీటి కేటాయింపులు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చాం’’ అని గుర్తు చేశారు.