- జోరుగా ఇంటింటా ప్రచారాలు
- ఓటర్లను ప్రభావితం చేసే వ్యక్తుల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు
- ఆయావర్గాల ముఖ్యనేతలతో భేటీలు
- ప్రతీ ఓటును కీలకంగా భావిస్తున్న నేతలు
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి ఎన్నికలను బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఓ వైపు జోరుగా ఇంటింటా ప్రచారాలు చేస్తున్న ఆయా పార్టీల లీడర్లు, పోలింగ్ తేదీ సమీపించడంతో ఓటర్లను ప్రభావితం చేసే వ్యక్తుల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయా వర్గాల ముఖ్యులతో భేటీలు నిర్వహించి మద్దతివ్వాలని కోరుతున్నారు. టౌన్‌లోని కాలనీల్లో, గ్రామాల్లో జోరుగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థుల తరఫున బూత్‌లకు బాధ్యతలు వహిస్తున్న లీడర్లు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి తమ క్యాండిడేట్‌కు ఓటేయాలంటూ అభ్యర్థిస్తున్నారు. ఇప్పటికే ఆయా పార్టీల అగ్రనేతలు నరేంద్రమోదీ, రాహుల్‌గాంధీ, కేసీఆర్ఇక్కడ బహిరంగ సభలు నిర్వహించారు.
రంగంలోకి కేటీఆర్..
బీఆర్ఎస్తరఫున ఆ పార్టీ అధినేత కేసీఆర్ పోటీ చేస్తున్నందున ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్అన్ని తానై వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు నియోజకవర్గంలో పర్యటించిన కేటీఆర్సభలు, కార్నర్ మీటింగ్స్, రోడ్‌షోలు, ర్యాలీలు, వివిధ వర్గాల వారితో మీటింగ్‌లు నిర్వహించారు. తాజాగా కేటీఆర్ఆదివారం రాత్రి వ్యాపారవర్గాలు, రియల్ఎస్టేట్, వివిధ సంఘాల ప్రతినిధులు, ముఖ్యులతో సమావేశమయ్యారు. కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం కేసీఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మూడు రోజులుగా ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర నేతలు రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. బీడీ కార్మికులు, కుల సంఘాలు, వివిధ వర్గాల వారితో మండలాలు, గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం హోంమంత్రి మహబూబ్ అలీ మైనార్టీలతో భేటీ అయ్యారు. మంగళవారం జిల్లా కేంద్రంలో కేటీఆర్ రోడ్‌షో నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ర్యాలీలు, ఇంటింటి ప్రచారాలతో కాంగ్రెస్
కామారెడ్డిలో కేసీఆర్పోటీ చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్అనూహ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఇక్కడ బరిలో దింపింది. ఆయన తరఫున స్థానిక లీడర్లు, పీసీసీ ఇన్చార్జులుగా ఉన్న నేతలు, అనుచరులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. గ్రామాలు, టౌన్లలో బూత్‌ల వారీగా లీడర్లు ప్రచారం చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి ఇప్పటికే రామారెడ్డి, మాచారెడ్డి, పాల్వంచ, రాజంపేట, భిక్కనూరు మండలాల్లో జరిగిన కార్నర్మీటింగ్స్లో పాల్గొన్నారు.
ఆదివారం రోజూ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, డీకే శివకుమార్తదితరులు అటెండ్అయ్యారు. రేవంత్‌రెడ్డి సైతం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. కామారెడ్డిలో ఉన్న విలువైన భూములపై కేసీఆర్కన్నుపడిందని, వాటిని దోచుకునేందుకే ఇక్కడికి వస్తున్నారంటూ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
క్షేత్రస్థాయిపై బీజేపీ ఫోకస్
బీజేపీ మొదటి నుంచి క్షేత్రస్థాయి ప్రచారంపై ఫోకస్పెట్టింది. ఆ పార్టీ తరఫున ఇక్కడ బరిలో నిలిచిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఐదేండ్లుగా నియోజకవర్గంలో పట్టు పెంచుకున్నారు. ప్రజా సమస్యలపై ఆందోళనలు నిర్వహించి స్థానికులకు దగ్గరయ్యారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినాటికే స్థానిక పార్టీ శ్రేణులు ఇంటింటి ప్రచారం షూరు చేశారు. ఈ నెల 25న ఎన్నికల ప్రచారసభకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హాజరయ్యారు. మోదీ సభ పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచింది. వెంకటరమణారెడ్డి ఊరురా ప్రచారం చేయగా, కార్యకర్తలు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. పార్టీ అనుబంధ సంఘాలు, ఇతర సంఘాల ప్రతినిధులు అంతర్గతంగా ప్రచారం చేస్తున్నారు.