స్కీముల కోసం బీఆర్ఎస్​ క్యాడర్ లొల్లి!

స్కీముల కోసం  బీఆర్ఎస్​ క్యాడర్ లొల్లి!
  • స్కీముల కోసం  బీఆర్ఎస్​ క్యాడర్ లొల్లి!
  • ఊరికి ఒకరిద్దరినే ఎంపిక చేస్తున్న లీడర్లు
  • తమ పరిస్థితి ఏమిటని నిలదీస్తున్న మిగిలిన కార్యకర్తలు
  • ఎంపిక చేయకుంటే ఎన్నికల్లో సహకరించమని బెదిరింపులు
  • తలపట్టుకుంటున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు

యాదాద్రి, వెలుగు : ఎన్నికల వేళ సర్కారు ప్రకటించిన స్కీముల కోసం బీఆర్ఎస్​క్యాడర్​లొల్లి పెడుతోంది. ఏ స్కీము చూసినా ఊరిలో ఇద్దరు ముగ్గురికి మించి ఇచ్చే పరిస్థితి లేదు. కానీ రెండు దఫాలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు ఊరూరా వందల మంది కార్యకర్తలు ఉన్నారు. వీరంతా ఆయా స్కీములపై ఆశలు పెట్టుకున్నారు. కానీ ఒకరిద్దరికే ఇస్తుండడంతో మిగిలినవాళ్లు నారాజ్​అవుతున్నారు. తమను ఎంపిక చేయకుంటే ఎన్నికల్లో సహకరించమని బెదిరింపులకు దిగుతుండడంతో ఎమ్మెల్యే అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు.

పోటీపడుతున్న కార్యకర్తలు.. 

హుజూరాబాద్ ఉప ఎన్నికలప్పుడు ప్రకటించిన దళితబంధు, ఇటీవల ప్రకటించిన  బీసీ, మైనార్టీ సాయం, గృహలక్ష్మి స్కీములకు గ్రామాల్లో తీవ్ర పోటీ కనిపిస్తోంది. సామాన్యుల సంగతేమోగానీ ఊరూరా వందల్లో ఉన్న బీఆర్ఎస్​ కార్యకర్తలే స్కీముల కోసం పోటీపడ్తున్నారు. గతంలో సర్కారు స్కీములకు లబ్ధిదారులను ఆఫీసర్లు ఎంపిక చేయగా, ప్రస్తుతం ట్రెండ్​మారింది. ఎమ్మెల్యేలే కింది స్థాయి లీడర్ల సాయంతో లబ్ధిదారుల లిస్టులను ఫైనల్ చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో దాదాపు బీఆర్ఎస్​ కార్యకర్తలనే ఎంపిక చేస్తున్నారనేది బహిరంగ రహస్యం. నిజానికి  మొదటి విడత  దళితబంధు నియోజకవర్గానికి 500 మంది చొప్పున అందిస్తామని చెప్పినా ఎక్కడా పూర్తిస్థాయిలో అమలుకాలేదు. 

యాదాద్రి జిల్లా మొత్తం మీద కేవలం 413 కుటుంబాలకు మాత్రమే లబ్ధి చేకూరింది. తర్వాత నియోజకవర్గానికి 1,500 చొప్పున ఇస్తామని సర్కారు ప్రకటించడంతో లిస్టులు తయారు చేస్తున్నారు. కానీ ఒక్కో గ్రామానికి ఐదు, ఆరు కుటుంబాలకు మించి దళితబంధు వచ్చే పరిస్థితి లేదు. ఒకరిని ఎంపిక చేస్తే మరొకరి నుంచి ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని లీడర్లు భయపడుతున్నారు. ఈ కారణంతో భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపికను ఎమ్మెల్యేలు పెండింగ్​పెట్టినట్లు చెబుతున్నారు.

కేవలం 300 మందికే.. 

బీసీ ఆర్థిక సాయం స్కీంకు ప్రతి విడత ఒక్కో నియోజకవర్గం నుంచి కేవలం 300 మంది చొప్పున ఎంపిక చేస్తున్నారు. యాదాద్రి జిల్లాలో ఇప్పటికే12,978 మంది అప్లై చేసుకున్నారు. ఈ స్కీం కూడా ఊరికి ఇద్దరు, ముగ్గురికి మించి ఇచ్చే పరిస్థితి లేదు. తాజాగా మైనార్టీ సాయం విషయంలోనూ ఇదే పరిస్థితి. ఇక డబుల్​బెడ్​రూమ్ ఇండ్ల స్కీం ఫెయిల్​ కావడంతో అందరూ గృహలక్ష్మి కింద ఇచ్చే రూ.3 లక్షల సాయం కింద ఆశలు పెట్టుకున్నారు. 

అన్ని వర్గాల్లోనూ బీఆర్ఎస్​కార్యకర్తలు ఉండడంతో కొందరిని ఎంపిక చేస్తే ఇంకొందరి నుంచి వ్యతిరేకత వస్తోంది. దీంతో లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యేలకు సవాల్​గా మారింది. ఇప్పటికే అన్ని స్కీములను కార్యకర్తలకు ఇస్తున్నారని కామన్​పబ్లిక్​ నుంచి వ్యతిరేకత వస్తోంది. తీరా కార్యకర్తలు కూడా స్కీముల కోసం మీటింగులలో నిలదీస్తుండడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

ఎక్కడికక్కడ నిలదీత

లబ్ధిదారుల లిస్టుల్లో తమ పేర్లు లేకపోవడంతో ఎమ్మెల్యేలను కార్యకర్తలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్​ రెడ్డి దళితబంధు కోసం ఎంపిక చేసినట్టుగా ఓ లిస్ట్​సోషల్​ మీడియాలో వైరల్​అయింది. దీంతో సంస్థాన్​ నారాయణపురంలో కొందరు తమ సంగతి ఏమిటని ఎమ్మెల్యేను నిలదీశారు. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత గ్రామాల్లో ఒక్కో యూనిట్​ను 5 నుంచి 10 కుటుంబాలు పంచుకోవాలని సూచించడంతో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇటీవల ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ఇంట్లో ముఖ్య కార్యకర్తల మీటింగ్​ జరిగింది. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్​ గొంగిడి మహేందర్​ రెడ్డి మాట్లాడుతూ.. లబ్ధిదారులుగా పేదలనే ఎంపిక చేయాలని సూచించారు. దీంతో కొందరు కార్యకర్తలు లేచి తాము కూడా పేదలమేనని, బయటవాళ్లకిస్తే తమ సంగతి ఏమిటని నిలదీసినట్లు తెలిసింది. ప్రభుత్వం ప్రకటించే స్కీమ్స్​ ఊరికి ఇద్దరు ముగ్గురికే అందుతున్నాయని, అలాగైతే తమ వంతు ఎప్పుడొస్తుందని ప్రశ్నించినట్లు సమారం. కొందరైతే ఎన్నికలు ముగిసేంత వరకూ లబ్ధిదారుల ఎంపిక ఆపి వేయాలని, లేదంటే తమ కార్యకర్తలే తమకు వ్యతిరేకంగా మారుతారని చెప్పినట్లు సమాచారం.