
పరకాల, వెలుగు : హన్మకొండ జిల్లా పరకాల బస్టాండ్‌సెంటర్‌లో కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్ నిర్వహిస్తుండగా బీఆర్ఎస్ ప్రచార వాహనం అటూఇటూ చక్కర్లు కొట్టడంతో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ వాహనాన్ని ధ్వంసం చేశారు. కాంగ్రెస్అభ్యర్థి రేవూరి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతుండగా ముందుగా వెల్లంపల్లి రోడ్డు నుంచి బస్టాండ్ వైపుకు వచ్చిన బీఆర్ఎస్ ప్రచార వాహనం మైకును బంద్ చేయకుండానే వెళ్లింది.
పది నిమిషాల వ్యవధిలో మళ్లీ ప్రచార వాహనం అధిక సౌండ్‌తో రావడంతో కాంగ్రెస్నాయకులు, కార్యకర్తలు సౌండ్బంద్ చేయాలని డ్రైవర్‌కు సూచించారు. అయినా సౌండ్బంద్చేయకపోవడంతో ప్రకాష్‌రెడ్డి జోక్యం చేసుకుని పోనివ్వండి ఇలాంటివాటిని పట్టించుకోవద్దని చెప్పారు. అయినా ఆగని కాంగ్రెస్నాయకులు బీఆర్ఎస్ప్రచార రథానికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపేశారు. పోలీసులు జోక్యం చేసుకుని కాంగ్రెస్ వారిని వారించి బీఆర్ఎస్ ప్రచార వాహనాన్ని అక్కడి నుంచి పంపించివేశారు. కొద్దిసేపటికే బీజేపీ వాహనం అటుగా రాగా బస్టాండ్ నుంచి వెల్లంపల్లి రోడ్డుకు పంపించారు.