- బీఆర్ఎస్ ప్రచార రథాన్ని అడ్డుకున్న దివ్యాంగుడు..
- కొత్తగూడెం నియోజకవర్గంలో ఘటన
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
సుజాతనగర్, వెలుగు : దళితబంధు పథకంలో ఎమ్మెల్యే కొడుక్కి రూ.2 లక్షలు ఎందుకివ్వాలంటూ కొత్తగూడెం నియోజకవర్గంలోని సుజాత నగర్ మండలం సింగభూపాలెంలో ఓ దివ్యాంగుడు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ప్రచార రథాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గుమిగూడిన కొందరు దళితులు కూడా అతడికి మద్దతు పలికి తమ గ్రామంలోకి ప్రచార రథం రావాల్సిన అవసరం లేదన్నారు. బుధవారం ఎమ్మెల్యేకు సంబంధించిన ఓ ప్రచార రథం వనమాకు ఓటెయ్యాలని క్యాంపెయినింగ్ చేస్తూ సింగభూపాలెం వైపు వచ్చింది.
ఇది చూసిన దివ్యాంగుడు బుట్టి నరేశ్ వీల్‌చైర్ పై వచ్చి వాహనానికి అడ్డు తగిలాడు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, అతని కొడుకు వనమా రాఘవకు రూ. 2లక్షలు ఇస్తేనే దళితబంధు పథకంలో పేరు వస్తోందని, అసలు అర్హులైన వాళ్లు డబ్బులెందుకివ్వాలని ప్రచార రథంలో ఉన్నవారిని నిలదీశాడు. సింగభూపాలెంలో సుమారు 50 మంది నుంచి రూ.2 నుంచి రూ.3 లక్షల వరకు తీసుకున్నారని ఆరోపించాడు. రూ. 10 లక్షలు వస్తాయనే ఆశతో చాలామంది అప్పులు చేసి చెల్లించారన్నాడు.
తీరా ఇప్పుడు దళిత బంధు కింద తమ పేరు రాలేదని అడిగితే.. ఎన్నికల్లో మళ్లీ గెలిపించండి తర్వాత ఇస్తామని చెప్తున్నారని వాపోయాడు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన కొంతమంది దళితులు గ్రామంలో తమ నుంచి కూడా కొంతమంది డబ్బులు వసూలు చేశారని, పథకంలో పేరు లేకపోవడంతో అడిగితే అప్పు తీసుకున్నట్లు ప్రామిసరీ నోటు రాసిచ్చారని వాపోయారు. ఎన్నికలైపోయిన తర్వాత 15 రోజుల్లోపు దళిత బంధు ఇప్పిస్తామని చెబుతున్నారని తెలిపారు. నరేశ్ నిలదీసిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.