అభివృద్ధిపై కాంగ్రెస్ మాట్లాడటం సిగ్గుచేటు : ఎర్రబెల్లి దయాకర్ రావు

  •     పాలకుర్తిని సశ్యశ్యామలం చేశా
  •     నిధులు తీసుకొచ్చి డెవలప్ మెంట్ చేశా
  •     బీఆర్ఎస్​ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు

పాలకుర్తి, వెలుగు: తెలంగాణ అభివృద్ధిపై కాంగ్రెస్​నాయకులకు మాట్లాడే అర్హత లేదని  బీఆర్​ఎస్​ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం పాలకుర్తి మండలంలోని కోతులబాధ, అయ్యంగారిపల్లి గ్రామాల్లో ప్రచారాన్ని నిర్వహిం చారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ 10 ఏళ్ల బీఅర్ఎస్ పాలనలో ఏం అభివృద్ధి జరిగిందని కాంగ్రెస్ వాళ్లు అడుగుతున్నారని, మరి 60 ఏళ్లలో మీరు ఏం చేశారని ప్రశ్నించారు. 

కనీసం గ్రామానికి లక్ష రూపాయల పని కూడా చేయలేదు, తట్టెడు మట్టి కూడా పోయలేదని విమర్శించారు. తాను వచ్చాకే  ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేయించానన్నారు. కాలువలు తవ్వించి, చెక్ డ్యాంలు కట్టించి పాలకుర్తిని సశ్యశ్యామలం చేశానని తెలిపారు. 24 గంటల కరెంట్ తో పాటు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించానని పేర్కొన్నారు. సొంత డబ్బులతో మహిళలకు కుట్టు మిషన్  శిక్షణ ఇప్పించి  ఉద్యోగాలు ఇప్పించానని తెలిపారు. 

యువకులకు డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు, కరోనా కష్టకాలంలో కొన్ని కోట్లు ఖర్చుపెట్టి ప్రజలను కాపాడానని చెప్పారు. మంత్రినయ్యాక నియోజకవర్గానికి కోట్ల నిధులు తీసుకొచ్చి డెవలప్ మెంట్ చేశానని తెలిపారు. కాంగ్రెస్​ నాయకులు డబ్బులతో ప్రలోభపెట్టి ఓట్లను కొనాలని చూస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్​ను గెలిపించుకోకుంటే కన్నతల్లిని మోసం చేసినట్లే అవుతుందని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

మరోసారి  గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తా

తొర్రూరు, వెలుగు : మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని   ఎర్రబెల్లి దయాకర్​ రావు అన్నారు. ఆదివారం  పట్టణంలోని ఎల్​వైఆర్​ గార్డెన్స్​లో నిర్వహించిన తొర్రూరు ప్రైవేట్​స్కూల్స్ టీచర్స్​ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ప్రైవేట్ టీచర్లకు  రాబోయే రోజుల్లో హెల్త్ కార్డ్స్ ఇప్పిస్తానన్నారు.  ఇప్పటికే జాగా ఉండి కట్టుకున్న వాళ్లకు, కట్టుకోబోయే వాళ్లకు ఐదు లక్షల ఆర్థిక సాయం చేస్తామన్నారు. 

అలాగే  దళిత బంధు, బీసీ బందు  ఇప్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్​కు ఓటు వేసి, మరో 20 ఏళ్లు వెనక్కి వెళ్లకుండా జాగ్రత్త పడాలని హెచ్చరించారు.  మీ దయన్నను మరోసారి గెలిపించుకోవాలని కోరారు.  సమావేశంలో  మున్సిపల్​ చైర్మన్​ రామచంద్రయ్య, ఎంపీపీ అజంయ్య,  జడ్పీటీసీ శ్రీనివాస్​, కిశోర్​ రెడ్డి, డాక్టర్​ సోమేశ్వర్​ రావు,  దేవేందర్​ రెడ్డి, తాళ్లపల్లి రమేశ్, రవిశంకర్​, రమేష్​, ప్రైవేట్​​ స్కూల్ టీచర్స్​, తదితరులు పాల్గొన్నారు.