
- ఉమ్మడి మెదక్ జిల్లాలో సిట్టింగ్ లకే ఛాన్స్
- టికెట్లపై ఊహగానాలు పటాపంచలు
సిద్దిపేట/సంగారెడ్డి/మెదక్, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ల లిస్టును సీఎం కేసీఆర్ సోమవారం ప్రకటించారు. ఇందులో నర్సాపూర్ ఒకటి సస్పెన్స్ లో పెట్టగా దుబ్బాకకు కొత్త క్యాండిడేట్‌ను ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని పది స్థానాల్లో తొమ్మిది స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. కొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తుందనే ఉహాగానాలు సాగాయి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ సిట్టింగ్‌ల వైపే సీఎం కేసీఆర్ మొగ్గు చూపడం గమనార్హం.
సెంటిమెంట్ కొనసాగింపుగా గజ్వేల్
సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవరిస్తూనే సెంటిమెంట్ ను కొనసాగిస్తూ గజ్వేల్ బరిలో మరోసారి పోటీ చేయనున్నారు. గజ్వేల్లో గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉంది. అయితే ఉత్తర తెలంగాణలో పార్టీకి మరింత జోష్ తేవడానికి కామారెడ్డి నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ పూర్వీకుల గ్రామం కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ లో వుండటంతో పాటు స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రత్యేకంగా కామారెడ్డి నుంచి పోటీ చేయాలని కోరడంతో కేసీఆర్ అక్కడి నుంచి పోటీ చేయడానికి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
సంగారెడ్డి జిల్లా పాత వారికే టికెట్లు
సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ తరఫున ఇక్కడున్న అయిదు నియోజకవర్గాల్లో నాలుగు చోట్ల సిట్టింగ్‌లకు ఛాన్స్ ఇవ్వగా, ఒక్క సంగారెడ్డి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కు సీఎం కేసీఆర్ మళ్లీ చాన్స్ ఇచ్చారు. కానీ బీఆర్ఎస్ నుంచి పోటీకి ఆశపడ్డ వారు సైలెంట్ అయ్యారు. ఇందులో నారాయణఖేడ్, పటాన్ చెరు సెగ్మెంట్ల నుంచి టికెట్లు దక్కించుకున్న భూపాల్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి హ్యాట్రిక్ విజయం కోసం వ్యూహాలు రచిస్తున్నారు. అందోల్, జహీరాబాద్ నియోజకవర్గాల నుంచి చంటి క్రాంతి కిరణ్, మాణిక్ రావులు రెండో సారి గెలుపు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.
పంతం నెగ్గించుకున్న ఆ ఇద్దరు
జహీరాబాద్ సెట్టింగ్ ఎమ్మెల్యే మాణిక్ రావు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ లు టికెట్ విషయంలో తమ పంతం నెగ్గించుకున్నారు. చింత అనారోగ్య సమస్యతో పాటు కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ మార్పుపై కొన్ని రోజులుగా హైడ్రామా నడిచింది. చివరకు జగ్గారెడ్డి పార్టీ మారేది లేదని తేల్చి చెప్పడంతో చింతకు టికెట్ వరించింది. ఇక జహీరాబాద్ సెగ్మెంట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే మాణిక్ రావుకు వ్యతిరేకంగా సర్వే రిపోర్టులు రావడంతో అక్కడ కొత్త అభ్యర్థి కోసం పార్టీ వెతుకులాట మొదలు పెట్టింది. అప్రమత్తమైన ఎమ్మెల్యే మాణిక్ రావు సీఎం కేసీఆర్ అనుచరులతో పాటు క్రిస్టియన్ కమ్యూనిటీ పెద్దలతో రికమెండ్ చేయించి టికెట్ తెచ్చుకున్నారన్న ప్రచారం జరుగుతోంది.
మెదక్ ఒకే.. నర్సాపూర్ పెండింగ్
మెదక్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కే మళ్లీ టికెట్ కేటాయించారు. నర్సాపూర్ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి మళ్లీ పోటీకి రెడీగా ఉండగా, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. వీరిద్దరూ టికెట్ కోసం గట్టిగా పట్టు బడుతుండటంతో అధిష్టానం ఎటూ తేల్చుకోలేక అభ్యర్థిత్వాన్ని పెండింగ్‌లో పెట్టింది. ఒకరికి టికెట్ ఇస్తే ఎన్నికల్లో మరొకరి వర్గం సపోర్ట్ చేయమంటున్నారు. దీంతో నర్సాపూర్ బీఆర్ఎస్ టికెట్ విషయంలో సందిగ్దత నెలకొంది. 3
మూడో సారి కేసీఆర్.. ఏడోసారి హరీశ్ రావు
సిద్దిపేట జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో మూడింట సిట్టింగ్‌లే బరిలో దిగుతున్నారు. గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్, హుస్నాబాద్ నుంచి ఓడితెల సతీశ్ కుమార్ మూడోసారి, హరీశ్‌రావు సిద్దిపేట నుంచి ఏడోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. దుబ్బాక నుంచి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా మొదటిసారి బరిలోకి దిగనున్నారు. సీఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి స్థానాల నుంచి బరిలోకి దిగుతుండటం ఆసక్తిని కలిగిస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొన్ని స్థానాల్లో సిట్టింగ్‌లతో పాటు ఇతర నేతలు టికెట్లు ఆశించినా సీఎం కేసీఆర్ కొత్త వారికి అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం.