- బీఆర్ఎస్ సూర్యాపేట అభ్యర్థి జగదీశ్ రెడ్డి
సూర్యాపేట, వెలుగు : తనకు మరో అవకాశం ఇస్తే వెయ్యి ఎకరాల్లో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేసి 10 వేల మందికి ఉపాధి కల్పిస్తానని బీఆర్‌ఎస్ సూర్యాపేట అభ్యర్థి జగదీశ్ రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం సూర్యాపేట రూరల్ మండలం కేసారం, కాసరబాద, తాళ్ల ఖమ్మం పహాడ్, రూప్ల తండా, జాటోత్ తండా, రామ్ల తండా, ఇమాంపేట గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2009లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ 5 గంటల కరెంట్ కూడా ఇవ్వలేదని.. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాకే 24 గంటల వచ్చిందని స్పష్టం చేశారు.
కొత్త వారికి పింఛన్ రావాలంటే అప్పటికే పింఛన్ తీసుకుంటున్న వారి చావు కోసం ఎదురుచూసే పరిస్థితులు ఉండేవని ఆరోపించారు. ప్రస్తుతం ప్రతి గ్రామంలో దాదాపు 500 మందికి పింఛన్లు వస్తున్నాయని చెప్పారు. బీఆర్ఎస్ వచ్చాకే తండాలు పంచాయతీలుగా మారాయని, గిరిజనులు స్వయం పాలకులు అయ్యారని స్పష్టం చేశారు. తాను మళ్లీ గెలిస్తే ఐటీ టవర్లను నిర్మించి 3 వేల మంది యువతకు ఐటీ ఉద్యోగాలు కల్పిస్తానని, డ్రైపోర్టు తీసుకువచ్చి గ్రామాలలో ఉన్న పేదలకు ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు కాంగ్రెస్ నమ్మి ఆగం కాకుండా.. బీఆర్‌ఎస్‌కు ఓటే వేయాలని కోరారు.