ఆటో డ్రైవర్ల కష్టాలు తీర్చినం : జగదీశ్ రెడ్డి

సూర్యాపేట , వెలుగు :  ఫిట్‌‌నెస్ చార్జీలు రద్దు చేసి ఆటో డ్రైవర్ల కష్టాలు తీర్చామని విద్యుత్ శాఖ మంత్రి, బీఆర్‌‌‌‌ఎస్‌‌  అభ్యర్థి  జగదీశ్ రెడ్డి చెప్పారు. బుధవారం ఆటో డ్రైవర్లు సూర్యాపేటలో భారీ ర్యాలీ నిర్వహించి కల్నల్ సంతోష్ బాబు చౌరస్తాలో సీఎం కేసీఆర్, మంత్రి  జగదీశ్ రెడ్డి ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం 3 వేల మంది ఆటో డ్రైవర్లు పార్టీ జిల్లా ఆఫీస్‌‌కు వెళ్లి జగదీశ్‌‌ రెడ్డికి మద్దతు తెలిపారు.  అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌‌‌‌ అన్ని వర్గాల అభ్యున్నతే  లక్ష్యంగా మానవీయ కోణంలో పనిచేస్తున్నారని చెప్పారు.

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వనివి కూడా అమలు చేశామని చెప్పారు.   సూర్యాపేటను జిల్లా చేయడంతో పాటు, ట్యాంక్ బండ్, రహదారుల విస్తరణ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్  నిర్మాణం వంటి అభివృద్ధి పనులు చేయడంతో పాటు హామీ ఇవ్వకపోయినా మెడికల్ కాలేజ్ తీసుకొచ్చానని తెలిపారు.  గతంలో సూర్యాపేటలో ఆరుగురు డాక్టర్లు మాత్రమే ఉండేవారని, ఇప్పుడు  600 మందికి చేరారని చెప్పారు.  సూర్యాపేటలో ప్రశాంత వాతావరణం కల్పించడంతో డీమార్ట్, సీఎంఆర్, వసుంధర మాంగల్య లాంటి  షాపింగ్ మాల్స్ వచ్చాయని

తద్వారా 1500 మంది స్థానిక యువతకు ఉపాధి లభించిందన్నారు. మరోసారి ఆశీర్వదిస్తే ఇండస్ట్రియల్ పార్క్‌‌, డ్రైపోర్టు తీసుకురావడంతో పాటు ఐటీ టవర్లు నిర్మించి వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.  ఉర్లు గొండ, లింగమంతుల స్వామి, పిల్లలమర్రి, ఫనిగిరి దేవాలయాలు, మూసీ ప్రాజెక్టును కలిపి టూరిస్ట్ హబ్‌‌గా మారుస్తామని చెప్పారు. బోటు సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పారు.  

పేదలు, రైతుల ప్రభుత్వమైన బీఆర్‌‌‌‌ఎస్‌‌ను కాపాడుకునేందుకు ప్రతి ఆటోవాలా నడుం బిగించాలని, బీఆర్‌‌‌‌ఎస్‌‌ సంక్షేమ పథకాలకు ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని పిలుపునిచ్చారు. అనంతరం బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన ఆటో యూనియన్  నాయకులు స్వామి నారాయణ, వెంకన్న, సైదులు గౌడ్ తో పాటు పలువురు ఆటో వాలాలు బీఆర్‌‌ఎస్‌లో చేరగా.. మంత్రి  కండువా కప్పిన ఆహ్వానించారు.