ఖానాపూర్​ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా : జాన్సన్ నాయక్

ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇవ్వాలని, ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ అన్నారు. శనివారం ఉట్నూరుతోపాటు కడెం మండలం ధర్మాజీపేటకు చెందిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతోపాటు, ఎన్ఎస్​యూఐ నాయకులు జాన్సన్ నాయక్ సమక్షంలో బీఆర్ఎస్​లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ సర్కారు రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని.. అందుకే  ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా బీఆర్​ఎస్​లోకి​ వస్తున్నారని పేర్కొన్నారు.

కాంగ్రెస్,  బీజేపీ పార్టీలను ఈ ప్రాంత ప్రజలు నమ్మడం లేదన్నారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో ఉట్నూరు జడ్పీటీసీ చారులత, మాజీ ఎంపీపీ రాజేశ్వర్ గౌడ్, నాయకులు తిరుపతి, వెంకటేశ్, దండగుల రవి, గోపాల్, అశోక్, ఆనంద్​తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో బీఆర్​ఎస్ ప్రచారం జోరుగా సాగుతోంది. శనివారం పట్టణంలోని వార్డుల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తిరుగుతూ తమ పార్టీ అ భ్యర్థి జాన్సన్ నాయక్​ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.