- బీఆర్ఎస్ సిర్పూర్ అభ్యర్థి కోనేరు కోనప్ప
కాగజ్ నగర్, వెలుగు : సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేస్తానని, నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిపించి తనను అసెంబ్లీకి పంపాలని బీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప ఓటర్లను అభ్యర్థించారు. గురువారం నియోజకవర్గంలోని బెజ్జుర్, పెంచికల్ పేట్ మండలాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించగా గ్రామాల్లోని ప్రజలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు అనునిత్యం సేవచేస్తూ వస్తున్నామని.. అధికారంలో ఉన్నా లేకున్నా తాను, తన కుటుంబం ప్రజలకు సేవ చేస్తూ కష్టసుఖాలు పంచుకున్నామని చెప్పారు.
పల్లెలకు రోడ్ల నిర్మాణంతో పాటు రవాణా సౌకర్యం మెరుగుపర్చేందుకు చొరవ చుపానని, మారుమూల గ్రామాలకు మౌళిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేశానన్నారు. నిరుపేద విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు వచ్చేలా, సర్కారు కొలువులు సాధించేందుకు తన వంతుగా ఉచిత కోచింగ్, ట్రైనింగ్ ఇప్పించానని తెలిపారు. కాగ జ్ నగర్ కు పనుల నిమిత్తం వచ్చే ప్రజల ఆకలి బాధ తీర్చేందుకు నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు చేశానన్నారు. కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం పేదల అభ్యున్నతికి పాటుపడుతోందని, మరోసారి బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు.