మైనంపల్లి వచ్చాకే  కొట్లాటలు మొదలైనయ్ : పద్మా దేవేందర్ రెడ్డి 

  • బీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి 

పాపన్నపేట,వెలుగు : మెదక్​ నియోజకవర్గంలో మైనంపల్లి వచ్చాకే గొడవలు, కొట్లాటలు మొదలయ్యాయని బీఆర్​ఎస్​మెదక్​అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి ఆరోపించారు. గురువారం ఆమె పాపన్నపేట మండలంలోని కొత్తపల్లిలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం తమ్మాయిపల్లి , ఆర్కెల, నార్సింగి, సీతానగర్, బాచారం, ఎనికెపల్లి, చిత్రియాల్, గాజులగూడెం, కొడుపాక గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రైతుకు ఎకరాకు రూ.16 వేల రైతుబంధు ఇస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎన్ని ఎకరాలున్న రూ.15 వేలు మాత్రమే ఇస్తుందన్నారు. డ్వాక్రా రుణాలు సమయానికి చెల్లించే మహిళకు నెలకు రూ.3 వేలు ఇస్తామన్నారు. ప్రతి గ్రామంలో స్త్రీ శక్తి భవనం నిర్మిస్తామని చెప్పారు. పింఛన్ విడతల వారీగా రూ.5 వేలకు పెంచుతామని సీఎం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.

మైనంపల్లి, కుటుంబానికి 13 ఏళ్లుగా గుర్తుకు రాని మెదక్ ఎలక్షన్​ టైంలో గుర్తుకొచ్చిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కు ఓటేస్తే కయ్యాలే మిగులుతాయన్నారు. ఆమె వెంట జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు సోములు, మండల పార్టీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు జగన్, ఏడుపాయల చైర్మన్​ బాలాగౌడ్ ఉన్నారు. 

ఊరూరా నిరసనలు

ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డికి ఊరూరా నిరసనలు ఎదురయ్యాయి. తమ్మాయిపల్లిలో ప్రచారం చేస్తుండగా జనాలు సమస్యల గురించి నిలదీయడంతో అక్కడి నుంచి ఆర్కెలో ప్రచారానికి వెళ్లారు. అక్కడ సైతం రోడ్డు మీద మురికి పారుతుంటే పట్టించుకోవడం లేదని జనాలు ప్రశ్నించారు. తరువాత రెండో విడత గొర్లు రాలేదని నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు, నాయకులు నిరసన చేస్తున్న యువకులను పక్కకు తీసుకువెళ్లారు. అలాగే ఎనికెపల్లిలో పద్మాదేవేందర్​రెడ్డి మాట్లాతుండగా జనర్థన్ అనే వ్యక్తి  తన మూగ,చెవిటి  కొడుకుకు ఇప్పటి వరకు పింఛన్​ ఇవ్వడం లేదని గొడవకు దిగాడు.

ALSO READ : కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే పేదలకు పట్టాలుప్పిస్తాం :సుదర్శన్​ రెడ్డి