- తుమ్మల, జలగం దారెటు.. ఖమ్మంలో వాళ్లిద్దరి నిర్ణయంపై సస్పెన్స్
- పార్టీ మారుతరా? ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తరా?
- ఖమ్మంలో తుమ్మల అనుచరుల సీక్రెట్ మీటింగ్
- కాంగ్రెస్‌లో చేరాలని ఒత్తిడి చేస్తున్న కార్యకర్తలు
- కొత్తగూడెం ఎన్నికపై సుప్రీంతీర్పు కోసం జలగం వెయిటింగ్
- ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారంటున్న సన్నిహితులు
ఖమ్మం, వెలుగు: బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన వ్యవహారం ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ము ఖ్యంగా రెండు సీట్లలో పరిస్థితి ఆసక్తికరంగా మారింది. పాలేరు నుంచి తుమ్మల నాగేశ్వరరావు టికె ట్ ఆశించగా కందాల ఉపేందర్‌రెడ్డికి.. కొత్తగూడెం నుంచి జలగం వెంకట్రావు సీటు ఆశించగా వనమా వెంకటేశ్వర్‌రావుకే హైకమాండ్ చాన్స్ ఇచ్చింది. 2018 లో పోటీ చేసి ఓడిన తమకు కాకుండా.. కాంగ్రెస్ నుంచి వచ్చిన సిట్టింగులకు టికెట్ ఇవ్వనున్నట్లు జాబి తా రిలీజ్ చేయడంతో.. తుమ్మల, జలగం దారెటు? అన్నది చర్చనీయాంశమవుతోంది. పార్టీ మారుతారా? లేక స్వతంత్రులుగా పోటీ చేస్తారా? అన్నది కీలకం కానుంది. తుమ్మల, జలగం వెంకట్రావు ఇద్దరూ ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నారని, ఎలాగైనా అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉండాలని నిర్ణయించుకున్నారని అనుచరులు చెప్తున్నారు. అయితే వాళ్లు ఏ పార్టీలో చేరతారు? అనేది ఇప్పుడు ఇంట్రస్టింగ్ గా మారింది.
కాంగ్రెస్ వైపు తుమ్మల చూపు!
తాను కచ్చితంగా పాలేరు నుంచి ఎన్నికల బరిలో ఉంటానని చాలా సార్లు తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. కందాల ఉపేందర్ రెడ్డికే టికెట్ ఇవ్వనున్నట్లు పార్టీ ప్రకటించడంపై ఇప్పటికీ ఆయన స్పందించలేదు. ఎలాంటి కామెంట్ చేయకుండా గుంభనంగానే ఉన్నారు. నిజానికి 2018లో పాలేరులో కందాల చేతిలో ఓడిపోవడం, తర్వాత కందాల టీఆర్ఎస్‌లోకి రావడంతో తుమ్మలకు వర్గపోరు మొదలైంది. స్థానికంగా ఎమ్మెల్యేతో విభేదాలున్నా.. నాలుగేండ్లుగా తుమ్మల పార్టీకి విధేయుడిగా ఉంటూనే వస్తున్నారు. నాలుగైదు రోజులుగా హైదరాబాద్‌లోనే ఉన్న ఆయన.. ముఖ్య అనుచరులతో మాత్రమే మాట్లాడుతున్నారు. పార్టీ వ్యతిరేక ప్రకటనలు చేయకుండా, లాయల్‌గానే ఉన్నప్పటికీ టికెట్ రాకపోవడంతో ఆయన బాధపడుతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.
ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం, మరో పార్టీలో చేరడంపై చర్చ జరిగినట్టు తెలుస్తున్నది. అయితే స్వతంత్ర అభ్యర్థి కంటే, ఏదైనా పార్టీ గుర్తుపై పోటీ చేయడం బెటర్ అని అనుచరులు సూచిస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్‌లో చేరితే విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. గతంలో తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత టీఆర్ఎస్‌లో ఉండి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే పనిచేసి, ఇప్పుడు అదే పార్టీలో చేరేందుకు తుమ్మల ఆసక్తిగా లేరన్న ప్రచారం జరుగుతున్నది. మరోవైపు మంగళవారం ఖమ్మం రూరల్ మండలంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో తుమ్మల అనుచరులు సీక్రెట్‌గా భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లో చేరేలా తుమ్మలపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. రెండ్రోజుల్లో ఆయన ఖమ్మం వచ్చిన తర్వాత తన రాజకీయ భవిష్యత్‌పై స్పష్టత రానుంది.
హైకమాండ్‌పై జలగం గుర్రు
మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కొడుకు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుకు బీఆర్ఎస్‌లో డోర్లు క్లోజ్ అయినట్టు కనిపిస్తున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2014లో కారు గుర్తుపై గెలిచిన ఒకే ఒక్కడిగా జలగం నిలిచారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. తర్వాత ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారమిచ్చారంటూ వనమాపై హైకోర్టును ఆశ్రయించారు. కొద్దిరోజులకే వనమా కూడా బీఆర్ఎస్‌లో చేరారు. దీంతో వర్గ పోరు కొనసాగింది. ఇటీవల వెంకట్రావుకు అనుకూలంగా హైకోర్టు తీర్పు రావడం, వనమాపై అనర్హత వేటువేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. కారు గుర్తుపై పోటీ చేసిన జలగం వెంకట్రావును 2018 నుంచి ఎమ్మెల్యేగా గుర్తించాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా పార్టీ అధినేత కేసీఆర్ లైట్ తీసుకున్నారు. కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకపోవడం, ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయించకపోవడంతో కేసీఆర్ వైఖరిపై వెంకట్రావు సీరియస్‌గానే ఉన్నారని సమాచారం. మరోవైపు వనమా సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడంతో, అక్కడి నుంచి మళ్లీ క్లియరెన్స్ తెచ్చుకోవడంపై జలగం నజర్ పెట్టారు.
ఇటీవల ఢిల్లీ వెళ్లి కేసుకు సంబంధించిన ఆధారాలను సబ్మిట్ చేసినట్టు సమాచారం. వచ్చేనెల మొదటి వారంలో సుప్రీం తీర్పు వచ్చే అవకాశం ఉందని, అది కూడా తనకు అనుకూలంగా ఉంటుందని వెంకట్రావు ధీమాగా ఉన్నారు. అయితే వనమాకు వ్యతిరేకంగా ఒక వేళ తీర్పు వచ్చినా, వెంకట్రావుకు మాత్రం పార్టీ టికెట్ ఇచ్చే అవకాశం లేదని బీఆర్ఎస్ వర్గాల టాక్. వనమాపై అనర్హత వేటు పడితే ఆల్టర్నేటివ్‌గా రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను కొత్తగూడెం నుంచి పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తున్నది. అందుకే ఇటీవల కొత్తగూడెం ఎన్నికల ఇన్‌చార్జ్‌గా వద్దిరాజు రవిచంద్రకు కేసీఆర్ బాధ్యతలు అప్పగించారని సమాచారం. జలగం వెంకట్రావు మాత్రం సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతున్నది. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారని సన్నిహితులు చెబుతున్నారు.