బీఆర్ఎస్కి కేసుల ఉచ్చు బిగుసుకుంటున్నట్లు వెలువడుతున్న వార్తలు, కేసీఆర్, కేటీఆర్ సహా ఆ పార్టీ ముఖ్య నేతలు ఏదో ఓ కేసులో అరెస్ట్ కాకతప్పదనే ఊహాగానాలపై తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతోంది. పదేండ్లలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారన్నది ఆరోపణ. కాళేశ్వరం, కరెంటు కొనుగోళ్లపైవేసిన కమిషన్ల విచారణలు తుదిదశకొచ్చాయి.
ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో విచారణకు గవర్నర్ అనుమతిని పొందారు. అంటే, బీఆర్ఎస్ అగ్రనాయకత్వంపై చర్యలుంటాయని, ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్‌ల అరెస్ట్ అనివార్యమన్న స్పెక్యులేషన్స్ సాగుతున్నాయి. ఇదే టైంలో బీఆర్ఎస్ నేతల్నిఅరెస్ట్ చేస్తే పౌరసమాజం నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుందోనన్న చర్చా లేకపోలేదు. అవినీతి, అక్రమాల కేసుల్లో దేశంలోని పలు రాష్ట్రాలలో జరిగిన రాజకీయ అరెస్టులు, వాటి పర్యవసానాలు రకరకాలుగా విశ్లేషించవచ్చు.
కానీ, తెలంగాణలో జరుగుతున్న విచారణలు, అరెస్టుల పరంపరల పట్ల తెలంగాణ సమాజం అంతగా పట్టించుకోకపోవచ్చనే భావన నెలకొంటున్నది. తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవానికి భంగం వాటిల్లేలా ప్రయత్నించడంతో పాటు పదేండ్లు అవినీతి, కుటుంబ పాలన సాగించిన ఆ పార్టీని, కేసీఆర్ నాయకత్వాన్ని తెలంగాణ జనం ఇప్పటికే తిరస్కరించారనే విషయం తెలిసిందే.
పదేండ్ల బీఆర్‌ఎస్‌పాలన అవినీతిని కాంగ్రెస్ ప్రజలకు చెప్పడంతోపాటు అధికారంలోకి వస్తే చర్యలుంటాయని స్పష్టం చేసింది. ఇల్లు అలకగానే పండుగ కాదు. అవినీతిపై రాజకీయంగా చెప్పగానే సరిపోదు. నిరూపణ చేయగలగాలి. అందుకే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలం తర్వాత చర్యలు తీసుకుంటారా? ఏడాదిపాటు ఏం చేశారనే రాజకీయ విమర్శలకు ఎక్కడా స్పందించకుండా చట్టం తన పని తాను చేసుకుపోతున్నదని జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి.
బీఆర్ఎస్ను రాజకీయాల్లో ఉండనివ్వనని, కేసీఆర్ అనే మొక్కను రాజకీయంగా మళ్లీ మొలకెత్తనివ్వనని స్వయంగా ముఖ్యమంత్రే బహిరంగంగా చెప్పినా, ఇటీవల దీపావళి ముందు బాంబులు పేలుతాయని ఓ మంత్రి లీకులిచ్చినా, ఆ పొలిటికల్ బాంబులకు ఇంకొందరు మంత్రులు మద్దతు పలికినా చర్యలేవి అని తెలంగాణ సమాజం ఎదురుచూడటం సహజం.
కాంగ్రెస్ నేతల హడావుడి ప్రకటనలతో ఇక తన అరెస్ట్ తప్పదని వారం రోజులపాటు కేటీఆర్ కూడా తన ఇంటిముందు మందీమార్బలంతో కాపు కాశారు. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి.. జైలుకెళ్లి స్లిమ్ అయి సీఎం అవుతానన్న సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడు కేసులు, విచారణల సమయం రానే వచ్చింది. కేసీఆర్, కేటీఆర్‌లు అరెస్ట్కాక తప్పదని స్వయాన సీఎం తాజా కేబినేట్ భేటీలో జరిగిన అంతరార్థ చర్చలో చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం ప్రచారంలో ఉంది. బీఆర్ఎస్ నాయకత్వంపై చర్యలు తీసుకోకుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాజకీయంగా అపవాదును మూటగట్టుకునే అవకాశమూ లేకపోలేదు.
అవినీతి, అక్రమాల ముద్ర
బీఆర్ఎస్పై, కేసీఆర్ కుటుంబంపై అటు బీజేపి, ఇటు కాంగ్రెస్ మొదట్నుంచీ అవినీతి ఆరోపణలే చేస్తున్నాయి. కాళేశ్వరం ఏటీఎంలా ఉపయోగపడిందని, కేసీఆర్ కుటుంబం అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిందని ప్రధాని మోదీ, అమిత్ షా సహా బీజేపి మంత్రులు అనేక సందర్భాల్లో పేర్కొన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ అవినీతిపై ప్రజల్లో చర్చ పెడుతున్నది.
ఎన్నికల సమయంలో కాళేశ్వరం కుంగిపోవడం కాంగ్రెస్ ఆరోపణలకు మరింత బలం చేకూరింది. పదేండ్ల అక్రమాలపై శాఖలవారీగా లెక్కలు తీసి ప్రచారం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం బీఆర్ఎస్ అవినీతిని రూఢీ చేయకపోతే ఆ పార్టీయే బోనెక్కే ప్రమాదమున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని డైలీ సీరియళ్లని తలపించే విధంగా నడిపించింది. కానీ, ఇందులో సూత్రధారులు, పాత్రధారులెవ్వరో సమాజానికి తెలిసినా దాన్ని రూఢీ చేయలేకపోతుండడం ప్రభుత్వంపై కొంత అసహనం వ్యక్తమవుతున్నది.
భారం, నేరం కేసీఆర్‌దేనా?
కాళేశ్వరం, కరెంట్ కొనుగోళ్ల ఒప్పందాల విచారణలు బీఆర్ఎస్ ను వెంటాడుతున్నాయి. ఆ రెండింటికి కేసీఆర్ ప్రధాన సూత్రధారి, పాత్రధారి అని అధికారులు లిఖిత పూర్వకంగా రాసిచ్చారు. ఆ రెండు కమిషన్ల విచారణలోనూ కేసీఆర్ ప్రధాన నిందితుడుగా తేలే అవకాశమున్నది . పైగా లక్షకోట్లతో కట్టిన కాళేశ్వరం కుంగి గత ప్రభుత్వాన్ని వెక్కిరిస్తున్నది.
కాళేశ్వరం నీటితో తెలంగాణ పొలాలు తడారలేదని అంతా వర్షంతోనే దిగుబడి సాధించినట్టు రేవంత్ సర్కారు ఇటీవల వానాకాలం పంటలను లెక్కలతో సహా తెలిపింది. కాళేశ్వరం పనికిరాని ప్రాజెక్ట్ అని జనాల్లో చర్చ పెట్టగలిగింది. కరెంటు కొనుగోళ్లలో కూడా వేల కోట్ల రూపాయలు చేతులు మారాయన్నది ఆరోపణ. ఆ కమిషన్‌పై కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించినా లాభం లేకుండా పోయింది. దీంతో అవినీతి భారమంతా కేసీఆర్‌పైనే పడుతున్నది.
ఇవే కారణాలు..
గతంలో తెలంగాణ కోసం ఉద్యమానికి మద్దతు ఇచ్చిన జనం ఇప్పుడు అవినీతికి మద్దతుగా నిలుస్తారా అనేది ప్రశ్నార్థకం. అవినీతిని నిరూపించి చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా బోనులో నిలబడే ప్రమాదమూ ఉంది. బీఆర్ఎస్ అవినీతి, అక్రమాలపై ప్రజల్లో చర్చ పెట్టడం. అసెంబ్లీలో 38 సీట్లొచ్చినా పార్లమెంటు సున్నా సీట్లకు ఓటు బ్యాంకు పడిపోవడం.
ప్రజల్లో ఆ పార్టీకి, నేతలకు సానుభూతి లేకపోవడం. కవిత అరెస్ట్ అయినా ప్రజల నుంచి సింగిల్ నిరసన కూడా జరగకపోవడం. కేసీఆర్, కేటీఆర్ అహంకారపూరిత ధోరణి. పదేండ్ల శాఖలవారీగా అవినీతిని రుజువవుతుండడం చూస్తే... కేసీఆర్ సర్కార్‌లో జరిగిన అవినీతిని నిగ్గు తేల్చేందుకే రేవంత్ ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు కనిపిస్తున్నది.
ఏ రాజకీయ పార్టీయైనా రాజకీయ అరెస్ట్‌ల వల్ల జరిగే పరిణామాలను ఊహించి నిర్ణయం తీసుకోవడం పరిపాటి. కేటీఆర్ అరెస్ట్ సరే.. అది కాస్త ఓ అడుగు ముందుకేసి కేసీఆర్ వరకు కూడా కొనసాగితే ఎట్లా ఉంటుందనే చర్చ లేకపోలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల సినీ హీరో అల్లు అర్డున్ అరెస్టును సమర్థించి తెలంగాణ సమాజం నుంచి ప్రశంసలందుకున్నారు. తేడా వస్తే ఎంతటివారినైనా అరెస్ట్ చేయకతప్పదని ఈ ఘటన ద్వారా నిరూపించుకున్నారు.
హైడ్రాతో నాగార్జునలాంటి స్టార్ ‘ఎన్ కన్వెషన్’ను కూలగొట్టి సామాన్యుల నుంచి మన్ననలు పొందారు. కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత అరెస్టయితే ఆమె అరెస్ట్ అక్రమమని ప్రజలెవరూ రోడ్డెక్కలేదు. ఇక కేసీఆర్, కేటీఆర్‌లను అరెస్ట్ చేసినా కూడా రాజకీయంగా పరిణామాలేవి ఉండవని భావిస్తున్నారు. ఉద్యమ సమయంలో పార్టీలకతీతంగా సమాజం మొత్తం కేసీఆర్ వెంట నడిచింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించాక, పదేండ్ల వ్యతిరేక పాలనను చూడడంతో పాటు తెలంగాణకున్న పేగుబంధాన్ని తెంచుకున్నప్పుడు ఆ పార్టీ అవసరంగానీ, కేసీఆర్ అవసరంగానీ తెలంగాణ సమాజానికి ఏమున్నదనే ప్రశ్న బలంగా వినిపిస్తున్నది.
కేటీఆర్ అరెస్ట్‌కు లైన్ క్లియర్?
ఎవరు అవునన్నా, కాదన్నా కేటీఆర్ అరెస్ట్‌కు రంగమైతే సిద్ధమైనట్లు ఊహాగానాలు నడుస్తున్నాయి. కేటీఆర్ అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు కాదని ఖచ్చితమైన ఆధారాలతోనే అరెస్ట్ చేస్తామని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. కేటీఆర్ వ్యవహారశైలి, ఆయన అహంకారపూరిత ధోరణియే కేసుల వైపు ఉసిగొల్పుతున్నాయన్న వాదన స్వయానా గులాబీ శిబిరంలోనే ఉన్నది.
అవకాశం ఎప్పుడొస్తే అప్పుడు సీఎం సీటులో కూర్చునేందుకు సిద్ధమైన ఆయన ప్రతిపక్ష పాత్రను నిర్మాణాత్మకంగా పోషించడం లేదనే అపవాదును మూటగట్టుకుంటున్నారు. ఒకవేళ కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే పార్టీ శ్రేణులు, తెలంగాణ సమాజం నుంచి నిరసనలు రావాలి. కానీ, ఆయన తీరుపట్ల అటు పార్టీలో, ఇటు ఉద్యమకారుల్లో కొంత వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో అలాంటివి ఉండకపోవచ్చునని కాంగ్రెస్ భావిస్తున్నది.
- వెంకట్ గుంటిపల్లి, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం-