ఎస్టీ సెగ్మెంట్లలోనే... సిట్టింగ్​లకు షాక్

  • ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలకు దక్కని టికెట్
  • బోథ్, ఆసిఫాబాద్ లో జడ్పీటీసీలు అనిల్ జాదవ్, కోవ లక్ష్మికి ఛాన్స్
  • ఖానాపూర్ నుంచి కేటీఆర్ ఫ్రెండ్ జాన్సన్ నాయక్ పోటీ
  • వ్యతిరేకత ఉన్న జనరల్ స్థానాలు వదిలి ఎస్టీలను మార్చడంపై చర్చ

ఆదిలాబాద్, వెలుగు : బీఆర్ఎస్ హైకమాండ్​ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మూడు ఎస్టీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ లను మార్చడం చర్చనీయాంశంగా మారింది. బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో బోథ్, ఖానాపూర్ లో జడ్పీటీసీలకు టికెట్ ఇవ్వగా, ఖానాపూర్ నుంచి కేటీఆర్ సన్నిహితుడు జాన్సన్ నాయక్ కు చాన్స్ దక్కింది. 

ఉమ్మడి జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముథోల్, బెల్లంపల్లి, మంచిర్యాల సిట్టింగ్ లను మారుస్తారంటూ మొదట ప్రచారం జరిగినా అవి కాకుండా ఎస్టీ రిజర్డ్వ్ స్థానాలను మార్పు చేయడంపై ఆయా సెగ్మెంట్లలో చర్చ జరుగుతోంది. మిగతా ఎమ్మెల్యేలపై పలు ఆరోపణలు, ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ తిరిగి వారికే టికెట్లు కేటాయించడంతో ప్రజలు, లీడర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

జనరల్ లో వదిలేసి.. ఎస్టీలను మార్చేసి..

ఆదిలాబాద్ జిల్లాలోని జనరల్ స్థానాల సిట్టింగ్ ఎమ్మెల్యేలు తీవ్ర వ్యతిరేకత, వర్గపోరు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ వారిని మార్చకుండా కేవలం ఎస్టీ నియోజకవర్గాల్లోని సిట్టింగ్ లను మార్చడం వెనుక అంతర్యమేంటని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో సిట్టింగ్ లను మార్చినప్పటికీ హైకమాండ్ పై ఎలాంటి ఒత్తిడి చేయలేరన్న ధీమాతోనే వారికి టికెట్ ఇవ్వలేదని తెలుస్తోంది. 

బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుకు వ్యతిరేకంగా ఆ పార్టీలోని ఎస్టీ, బీసీ నేతలు పనిచేయడం, వర్గపోరుతో నిత్యం వార్తల్లోకెక్కారు. ఈ కారణం వల్లే టికెట్ దక్కలేదని సమాచారం. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ స్థానంలో కేటీఆర్ సన్నిహితుడు జాన్సన్ నాయక్​కు టికెట్ ఇవ్వగా, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు స్థానంలో జడ్పీ చైర్ పర్సన్ గా ఉన్న కోవ లక్ష్మికి టికెట్ దక్కింది. అయితే మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, ముథోల్ ఎమ్మెల్యేల పట్ల పార్టీలో వర్గ విభేదాలు ఉన్నా హైకమాండ్ వారిపై మొగ్గు చూపింది.

తలనొప్పిగా మారిన వర్గపోరు

మూడు చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చిన బీఆర్ఎస్ కు వర్గపోరు తలనొప్పిగా మారనుంది. ముఖ్యంగా బోథ్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల వర్గీయులు కొత్త వారికి అనుకూలంగా పనిచేస్తారా లేదా అని అనుమానం వ్యక్తం అవుతోంది. సిట్టింగ్ లను కాదని ఇంతకాలం వ్యతిరేకంగా పనిచేసిన వారికి టికెట్లు దక్కడంతో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు భవిష్యత్ కార్యాచరణపై తమ వర్గీయులతో చర్చిస్తున్నారు. పాత, కొత్త క్యాండిడేట్ల మధ్య వర్గ పోరు తీవ్రం అయితే ప్రతిపక్షాలకు బలం చేకూరే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. 

ఎమ్మెల్యేలుగా ఓడి.. జడ్పీటీసీలుగా గెలిచి..

బోథ్ నియోజకవర్గంలోని నేరడిగొండ జడ్పీటీసీ అనిల్ జాదవ్ తో పాటు ఆసిఫాబాద్ జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మికి బీఆర్ఎస్ టికెట్ కేటాయించింది. అనిల్ జాదవ్ గతంలో కాంగ్రెస్ నుంచి రెండు సార్లు, ఇండిపెండెంట్ గా ఒకసారి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మొదటిసారిగా బీఆర్ఎస్ నుంచి బరిలో దిగుతుండడంతో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

ఆసిఫాబాద్ నుంచి కోవ లక్ష్మి సైతం గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీగా గెలిచి జడ్పీ చైర్ పర్సన్ పదవి దక్కించుకున్నారు. వీరిద్దరికీ ప్రజాప్రతినిధులుగా పనిచేసిన అనుభవం ఉండగా ఖానాపూర్ నుంచి మాత్రం కొత్త క్యాండెట్ జాన్సన్ నాయక్ మొదటిసారిగా పోటీలో ఉంటున్నారు. కేటీఆర్ అండదండలు పుష్కలంగా ఉండడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ ను పక్కన పెట్టి పార్టీ టికెట్ ను దక్కించుకున్నారు.