- ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర: మంత్రులు
- ప్రజా పాలన చూసి ఓర్వలేకపోతున్నరు
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రజాపాలనపై చార్జ్‌షీట్ వేసేంత నైతికత బీఆర్ఎస్కు లేదని మంత్రులు మండిపడ్డారు. పదేండ్లు రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిందన్నారు. పదేండ్లలో బీఆర్ఎస్ సర్కార్ చేయలేని అభివృద్ధి.. తాము ఏడాది కాలంలోనే చేసి చూపించామని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని, ప్రజా ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు కుట్రలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ చార్జ్‌షీట్‌పై పలువురు మంత్రులు ఆదివారం మీడియాతోమాట్లాడారు.
ఉనికి కాపాడుకునేందుకే పోరాటం: మంత్రి వెంకట్‌రెడ్డి
హరీశ్ రావు, కేటీఆర్.. రాజకీయ ఉనికి కోసం పాకులాడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తమ ఉనికి కాపాడుకోవడానికి పోరాటం చేస్తున్నారే తప్ప.. అది నిజమైన ప్రతిపక్ష పాత్ర కాదన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనపై చార్జ్‌షీట్ వేసేంత నైతికత బీఆర్ఎస్ పార్టీకి లేదని విమర్శించారు. దళిత ముఖ్యమంత్రి, ఇంటికో ఉద్యోగం, వంద సార్లు తల నరుక్కుంటా అని ఉద్యమంలో కేసీఆర్ ఎన్నో ఉచిత హామీలు ఇచ్చారని గుర్తు చేశారు.
చిత్తుగా ఓడించినా జ్ఞానోదయం కాలే: మంత్రి పొంగులేటి
బీఆర్ఎస్ పదేండ్ల పాలనపై ఏడాది కిందే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు డిస్ చార్జ్‌షీట్ ఇచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రెండు ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయినా హరీశ్ రావుకు ఇంకా జ్ఞానోదయం కాలేదన్నారు. పదేండ్లు రాష్ట్రాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. దొంగే.. దొంగ, దొంగ అన్నట్లు ఉందని విమర్శించారు. పదేండ్ల పాలనలో వందేండ్లకు సరిపడా దోపిడీ చేశారని ఆరోపించారు.
అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్నరు: మంత్రి సీతక్క
సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్నదని, దాన్ని పక్కదారిపట్టించేందుకే బీఆర్ఎస్, బీజేపీలు చార్జ్‌షీట్ డ్రామాలు ఆడుతున్నాయని మంత్రి సీతక్క మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉండి సలహాలు, సూచనలు ఇవ్వకుండా చార్జ్షీట్లు వేసుడేందని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రలు చేస్తున్నాయన్నారు. ప్రజా ప్రభుత్వం విజయవంతంగా ఏడాది పాలన పూర్తి చేసుకున్నదని తెలిపారు. దీన్ని చూసి బీఆర్ఎస్, బీజేపీలు ఓర్వలేకపోతున్నాయన్నారు.
చార్జ్‌షీట్ కాదు.. రిప్రజెంటేషన్: మంత్రి పొన్నం
ప్రతిపక్షాలు ఇచ్చింది చార్జ్‌షీట్ కాదని.. రిప్రంజెంటేషన్ గా భావిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రతిపక్షాలు విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని తెలిపారు. తమ ఏడాది పాలనపై చార్జ్‌షీట్ ఇవ్వడం దురదృష్టకరమన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలంతా ఒక్కటే అని ఆరోపించారు.