నాపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నరు: కేసీఆర్

  •  కేసీఆర్ రైతుబంధు ఇస్తే దుబారా అంటున్నరు
  •     నున్నగ రోడ్డు ఉంటే’ తెలంగాణ అని మహారాష్ట్ర నుంచి వచ్చే వాళ్లు చెప్తున్నరు
  •     మహారాష్ట్ర వైపు లైట్ ఉండదు.. మన వైపు 24 గంటలూ లైట్ ఉంటది
  •     ఆర్మూర్, భైంసా, కోరుట్ల సభల్లో సీఎం వ్యాఖ్యలు

నిజామాబాద్/ భైంసా/ జగిత్యాల, వెలుగు:  ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ దుష్ప్రచారాలు చేస్తున్నదని బీఆర్ఎస్​అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. సీఎం అని కూడా చూడకుండా తనను దురుసు మాటలతో ఇష్టమొచ్చినట్లు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలన్నారు. శుక్రవారం నిజామాబాద్​జిల్లా ఆర్మూర్, నిర్మల్ జిల్లా భైంసా, జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్వహించిన సభల్లో ఆయన మాట్లాడారు. ‘‘కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు తెస్తుంటే దుబారా అంటున్నరు. దేశంలో నీటి పన్ను లేని రాష్ట్రం మనదే ” అని అన్నారు. 

‘‘24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్​ఇవ్వడంతో బోర్లకాడ ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్ల అవసరం లేకుండా పోయింది. రైతులు పండించిన వడ్లు కొంటున్నం. మేం చేస్తున్న ఈ పనులతో రైతు ముఖాలు తెల్లబడుతున్నయ్. బాకీలు తీర్చుకుంటున్నరు. పంట పెట్టుబడి సొమ్ము రైతు చేతిలో ఉండడమే బంగారు తెలంగాణ. అందుకోసమే ఎవరూ అడగకున్నా రైతుబంధు తెచ్చిన. ఈ పథకం చాలా మంచిదని ప్రముఖ వ్యవసాయవేత్త స్వామినాథన్ మెచ్చుకున్నారు. ప్రపంచంలోనే గొప్ప పథకమని ఐక్యరాజ్యసమితి ఒక లెటర్‌‌లో పేర్కొంది. అందరికీ గొప్పగా కనిపించే రైతుబంధును పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్​కుమార్​రెడ్డి దుబారా అంటున్నారు” అని కేసీఆర్​ఫైర్​అయ్యారు. ‘‘పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి 24 గంటల ఉచిత కరెంట్‌కు డబ్బులు దండగ అంటున్నడు. వ్యవసాయానికి మూడు గంటలే చాలట. మాకు మతిపోయిందని, రైతుబంధు పేరుతో బిచ్చమేస్తున్నరని అడ్డగోలుగా మాట్లాడుతున్నడు. బాకీ కట్టకుంటే రైతు ఇంటి తలుపులు పీక్కపోయినప్పుడు రూపాయి సాయం చేయని కాంగ్రెస్​ఇప్పుడు ఓట్లు అడగడానికి వస్తున్నది’’ అని విమర్శించారు. ధరణి పోర్టల్ లేకముందు పైరవీలు, లంచాల రాజ్యం కొనసాగిందని, ధరణి వల్లనే రైతుబంధు డబ్బులు వెంటనే రైతుల ఖాతాల్లో పడుతున్నాయని చెప్పారు. ‘‘ఓటు వేసే ముందు అభ్యర్థి గుణగణాలు.. అతడి వెనుకున్న పార్టీ గురించి ఆలోచన చేయాలె. ఆ పార్టీల చరిత్ర, దృక్పథం తెలుసుకోవాలె. ఎవరో చెబితే ఓటేయవద్దు. మన తలరాతలు మార్చే ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు. అన్ని విషయాలమీద ఊళ్లలో చర్చ జరగాలె. ఓటు ఎవరికి వేయాలో అప్పుడు నిర్ణయించాలె. ఆపద మొక్కులతో వచ్చే వారిని నమ్మొద్దు’’ అని కోరారు.

నేతన్నలను ఆదుకుంటున్నం..

‘‘గత పాలకుల హయాంలో సిరిసిల్ల, భూదాన్ పోచంపల్లి, దుబ్బాకల్లో చేనేత కార్మికులు రోజుకు ఆరేడుగురు చనిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒకనాడు భూదాన్ పోచంపల్లిలో ఏడుగురు నేతన్నలు చనిపోతే అప్పటి సీఎంకు రెండు చేతులు జోడించి దండం పెట్టిన. ‘పోయినోళ్లు పోయిండ్రు.. యాభై వేలో లక్షనో ఇస్తే ఉన్నోళ్లు బతుకుతరు’ అని వేడుకున్నా. కానీ ఒక్క రూపాయి కూడా ఇయ్యలేదు. ఇప్పుడు తెలంగాణ సర్కార్ ఎవరూ అడగకపోయినా నేతన్నలను ఆదుకునేందుకు ప్రోత్సాహకాలు ఇస్తున్నది’’ అని కేసీఆర్​ చెప్పారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ చేస్తున్న తరహాలో రాబోయే రోజుల్లో చేనేత పరిశ్రమను, నేతన్నలను ఆదుకునేందుకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయిస్తామని తెలిపారు. బెంగాల్, మహారాష్ట్ర లాంటి 19 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నా ఎక్కడా పెన్షన్ ఇవ్వడం లేదని, ఎవరూ అగడగకపోయినా, దరఖాస్తు పెట్టకపోయినా తాము బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. కొత్తగా నంబర్లు వచ్చిన బీడీ కార్మికులు, టేకేదార్లకు కూడా పెన్షన్​ఇస్తామని ప్రకటించారు. ‘‘సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర రైతులు.. తెలంగాణలో అర ఎకరం భూమి కొని బోర్లు వేసుకుంటున్నారు. ఇక్కడి నుంచి తమ పొలాలకు నీళ్లు పారించుకుంటున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చే వాళ్లు ఏదన్నా దాబా దగ్గర.. ‘తెలంగాణ ఎంత దూరంలో ఉంది’ అని అడిగితే ‘ఎక్కడి నుంచి నున్నగ రోడ్డు ఉంటుందో అదే తెలంగాణ’ అని చెప్తుంటారు. మహారాష్ట్ర వైపు లైట్ ఉండదు.. మన వైపు 24 గంటలు లైట్ ఉంటది” అని చెప్పారు.

నేను ఉన్నంత కాలం సెక్యులరిజం ఉంటది

‘‘విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేయడానికి బోర్ల కాడా మీటర్లు పెట్టాలని ప్రధాని మోదీ వార్నింగ్​ఇచ్చిండు. ఏటా రూ.5 వేల కోట్ల నష్టాన్ని భరిస్తున్నాం కానీ మీటర్లు పెట్టడానికి ఒప్పుకోలేదు. మోటార్లకు మీటర్లు పెట్టాలన్న బీజేపీ ప్రభుత్వాన్ని రైతులు నిలదీయాలి’’ అని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు, నవోదయ స్కూళ్లు కూడా ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. హిందూ, ముస్లింల ఐక్యతను బీజేపీ దెబ్బతిస్తున్నదని, అందరం కలిసి బతుకుతుంటే బీజేపీకి కళ్లమంట ఎందుకని ప్రశ్నించారు. మత పిచ్చి లేపి ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు. పదేండ్ల నుంచి రాష్ట్రంలో కర్ఫ్యూలు, లాఠీచార్జీలు లేవని, ప్రజలంతా కలిసిమెలిసి ప్రశాంతంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. తాను ఉన్నంత కాలం రాష్ట్రంలో సెక్యులరిజం ఉంటుందన్నారు. అధికారం కోసం కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలను తాము పెట్టలేదని, ఎలక్షన్స్ లో పది చెపితే వంద రకాల పథకాలు బీఆర్ఎస్ సర్కార్ అమలు చేసిందని వివరించారు.