
- ఆరు నెలల్లోనే పవర్ కట్స్.. స్కీములన్నీ బంద్: కేసీఆర్
- ఏం కోల్పోయామో ప్రజలకు ఇప్పుడు అర్థమవుతోంది
- ఇప్పుటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాకు 105 సీట్లు
- సుద్దాల అశోక్ తేజకు పాట రాయరాకపోతే.. నేనే దగ్గరుండి రాయించిన
- మన తెలంగాణల దుర్మార్గులు ఎక్కువ
- నేను తీద్దామనుకున్న బతుకమ్మ సినిమా ఓ సన్నాసి తీసిండు.. వాడి సినిమాల ఏమీ లేదు
- రాష్ట్ర గీతం రాసినప్పుడు మేధావులతో చర్చించినం
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అసమర్థ సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయని బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ప్రభుత్వం చర్యలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని, అన్ని స్కీమ్‌లను బంద్ చేశారని, కరెంట్ కోతలు విధిస్తున్నారని, విత్తనాల కోసం రైతులు క్యూలు కడుతున్నారని తెలిపారు. ఆదివారం తెలంగాణ భవన్ లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో కేసీఆర్ మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ సర్కారు అసమర్థత నాకు అర్థం కావట్లేదు.
కరెంట్ కోతలకు హరీశ్‌రావు కారణమని సీఎం అంటున్నడు. సీఎం ఎవరు? రేవంత్ రెడ్డా? హరీశ్‌రావా? సీఎం సహా మంత్రులందరూ కరెంట్ కోతలపై బుద్ధిలేకుండా మాట్లాడుతున్నరు. రైతుబంధు, దళితబంధు, ఆసరా పెన్షన్లు, పల్లె, పట్టణ ప్రగతి.. ఇలా అన్ని స్కీమ్‌లన్నీ ఆగాయి. ఏం కోల్పోయామన్నది ప్రజలకు ఇప్పుడు అర్థమవుతున్నది. బీఆర్ఎస్ గెలవాల్సిందని ఇప్పుడు బాధపడుతున్నరు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాకు 105 సీట్లు వస్తాయని ఇటీవల మా పార్టీ లీడర్ నాకు చెబుతుండు” అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఒక్క పాలసీ అయినా ప్రకటించిందా? అని ప్రశ్నించారు. పదేండ్లలో రాష్ట్రాన్ని ఎంతో డెవలప్ చేశామని చెప్పారు.
పదేండ్లు అధికారంలో ఉంటమని కలలో ఊహించలే
ఏండ్ల పోరాటం తర్వాత తెలంగాణ వస్తదని, పదేండ్లు తాము అధికారంలో ఉంటామని కలలో కూడా ఊహించలేదని కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కొంత నిరాశ కలిగిందని తెలిపారు. బీఆర్ఎస్ పని ఖతమైందని మోకాలెత్తు లేనోడు కూడా విమర్శిస్తున్నాడని ఫైర్ అయ్యారు. పవర్లో ఉన్నా.. లేకున్నా ప్రజల కోసమే పనిచేస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ మహావృక్షం.. ఓ సముద్రమని పేర్కొన్నారు. అధికారం శాశ్వతం కాదని, ప్రజలు ఏ పాత్ర ఇస్తే అందులో పనిచేయాలన్నారు. గొర్రెలు, చేపల పంపిణీని అపహాస్యం చేస్తున్నారని, ఎన్నికల కోసం తాము రైతుబంధు, ధరణి తీసుకు రాలేదని చెప్పారు. రాష్ట్ర లోగో ప్రజల గుండెల మీద ఉంటదని, రాష్ట్ర గీతం రాసినప్పుడు అన్ని వర్గాల మేధావులను సంప్రదించామని తెలిపారు.
ఎగ్జిట్ పోల్స్ ఓ గ్యాంబ్లింగ్
మహబూబ్ నగర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీగా నవీన్ కుమార్ రెడ్డి గెలవడం సంతోషకరమని కేసీఆర్ అన్నారు. నవీన్ కుమార్ రెడ్డికి, ఆ జిల్లా నేతలకు అభినందనలు తెలిపారు. వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని కూడా గెలుస్తున్నామన్నారు. “ఎగ్జిట్ పోల్స్ గ్యాంబ్లింగ్లాగా మారాయి. పార్లమెంట్ లో ఎన్ని సీట్లు గెలుస్తమో చూద్దాం. ఎన్నొచ్చినా బాధ లేదు.. కుంగిపోయేది లేదు” అని పేర్కొన్నారు. త్వరలో కొత్త ఉద్యమ పంథా రెడీ చేసుకుందామని, పార్టీ ఆవిర్భావ వేడుకలు కూడా జరుపుకుందామని కేసీఆర్ ప్రకటించారు.
ప్రొఫెసర్ జయశంకర్ గొప్ప వ్యక్తి
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ కోసమే జీవించారని, ఆయన ఆజన్మ తెలంగాణ వాది అని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల సాకారమయ్యే కొద్దిరోజుల ముందే ఆయన మరణించారని తెలిపారు. తెలంగాణ కోసం ఒంటరిగా పోరాటం చేశారని తెలిపారు. ఉద్యమంలో తెలంగాణను చూస్తే కన్నీళ్లు వచ్చేవని, తెలంగాణ అని మాట్లాడితే ఏమన్నా అంటారేమోనని భయపడేవాడినని చెప్పారు.
తెలంగాణల దుర్మార్గులు ఎక్కువ
తెలంగాణ అంటే చాలా మందికి చులకన భావం ఉండేదని కేసీఆర్ అన్నారు. అప్పట్లో బతుకమ్మ సినిమా కోసం స్టోరీ రాశానని, సినిమా తీద్దామనుకున్నానని తెలిపారు. ఆ విషయం తెలుసుకొని ఒకరు అదే పేరు మీద సినిమా తీశారని, ఆ సినిమాలో ఏమీ లేదని విమర్శించారు. తాను బతుకమ్మ సినిమా తీస్తే చాలా గొప్పగా ఉండేదని చెప్పారు. ‘‘అప్పట్ల బతుకమ్మ సినిమా తీద్దమని ప్రయత్నించినం. నేనే కథ రాసిన. కానీ మన తెలంగాణల దుర్మార్గులు ఎక్కువ కదా. వాడు దన్నన పోయి రిజిస్ట్రేషన్ చేసి మొదలుపెట్టిండు దుకాణం. వాడు ఏమీ తీయలేదు సన్నాసి. అండ్ల ఏమీ లేదు” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు పాట రాయరాకపోతే తానే దగ్గరుండి రాయించినట్లు చెప్పారు. ‘‘సుద్దాల అశోక్ తేజ ఒక పాట రాసేటప్పుడు ఆయనకు రాయవస్తలేదు. సార్.. గీ నాలుగు లైన్లు పడ్తలేవ్ అన్నడు. ఏందయ్యా అంటే.. మన పండుగలు, మనది అంత చెప్పాలే సార్ అన్నడు. ఏం లేదు నేను చెప్త.. రాయ్ అన్న. ‘పోశమ్మ బోనాల శివసత్తులాట.. మన సొంతమే కదా బతుకమ్మ పాట’ అని చెప్పిన. అట్లనే రాసిపడేసిండు. సూపర్ హిట్ అయింది ఆ పాట” అని అన్నారు.
అధికారంలో ఉంటే నెలపాటు సంబురాలు: కేటీఆర్
తాము అధికారంలో ఉంటే నెల పాటు ఆవిర్భావ సంబురాలు నిర్వహించే వాళ్లమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ మూర్ఖుడని, దశాబ్ది ఉత్సవాలను కేవలం ఒక్క రోజుకే పరిమితం చేశారని ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించి, మాట్లాడారు. రేవంత్ రెడ్డి జాక్ పాట్ సీఎం అని, ఆయనకు తెలంగాణ ప్రజల త్యాగాలు, ఉద్యమం గురించి ఏ మాత్రం తెలియదన్నారు. దశాబ్దాల స్వరాష్ట్ర కలను సాకారం చేసుకొని, దశాబ్దం గడిచిన సందర్భమిదంటూ ట్వీట్ చేశారు.