- విచారణను నిలిపివేస్తూ స్టే ఇవ్వలేం
- పవర్ కమిషన్‌ను రద్దు చేయాలన్న కేసీఆర్ పిటిషన్‌పై హైకోర్టు
- పిటిషన్‌కు నంబర్ కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశం
- ఇయ్యాల విచారణ చేస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణాల్లో అక్రమాలను తేల్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంక్వైరీ కమిషన్‌ను రద్దు చేయాలంటూ హైకోర్టుకు వెళ్లిన బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్‌కు ఎదురు దెబ్బ తగిలింది. కమిషన్ విచారణను నిలిపివేస్తూ స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎంక్వైరీ కమిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్‌తో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది.
ఈ పిటిషన్‌కు నంబర్ కేటాయించేందుకు హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరాలు లేవనెత్తగా, నంబర్ కేటాయింపు అంశంపై కోర్టు విచారణ కొనసాగించింది. ఈ సందర్భంగా డివిజన్ బెంచ్ స్పందిస్తూ.. ‘‘ఎంక్వైరీ కమిషన్ విచారణ చేస్తే తప్పేంటి? ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చాక, దాన్ని ప్రభుత్వం అసెంబ్లీలోనే పెడుతుంది. అప్పుడు ఆ నివేదికపై అసెంబీల్లోనే చర్చ చేయవచ్చు కదా?” అని పిటిషనర్‌ను ప్రశ్నించింది.
దీనిపై కేసీఆర్ తరఫు లాయర్ స్పందిస్తూ.. ‘‘అసలు కమిషన్ వ్యవహరిస్తున్న తీరునే మేం ప్రశ్నిస్తున్నాం. కమిషన్ చైర్మన్ జస్టిస్ నర్సింహారెడ్డి విచారణ పూర్తి చేయకుండానే, అసమగ్ర వివరాలను సేకరించి, తప్పు జరిగిపోయిందని మీడియా సమావేశంలో వెల్లడించారు. కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు. ఏకపక్షంగా వ్యహరిస్తున్నది” అని అన్నారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. రిజిస్ట్రీ అభ్యంతరాలను తోసిపుచ్చింది.
పిటిషన్‌కు నెంబర్ కేటాయించాలని ఆదేశించింది.కాగా, చత్తీస్ గఢ్ తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం, భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణాల్లో అవకతవకలపై విచారణ చేపట్టేందుకు జస్టిస్ నర్సింహారెడ్డితో ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎంక్వైరీ కమిషన్ తో పాటు వ్యక్తిగత హోదాలో జస్టిస్ నర్సింహారెడ్డిని ప్రతివాదులుగా పేర్కొన్నారు.
రాజకీయ కక్షతోనే కమిషన్ ఏర్పాటు: పిటిషనర్ తరఫు లాయర్
తొలుత కేసీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ ఆదిత్య సోంధి వాదనలు వినిపించారు. ఈ నెల 30తో ఎంక్వైరీ కమిషన్ గడువు ముగుస్తుందని, ఈలోగా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని.. కాబట్టి కమిషన్ విచారణపై స్టే ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ‘‘పిటిషన్‌కు నెంబర్ కేటాయింపు అంశంపైనే నేడు విచారణ జరుపుతున్నాం. పిటిషన్‌కు నెంబర్ కేటాయించాక శుక్రవారం విచారణ చేస్తాం. అన్ని అంశాలను పరిశీలిస్తాం” అని తెలిపింది. దీంతో తొలుత పిటిషన్‌కు నెంబర్ కేటాయించాలని ఆదిత్య సోంధి కోరారు.
‘‘విద్యుత్ కు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నీ చట్టప్రకారమే చేసింది. కేవలం రాజకీయ వేధింపుల్లో భాగంగానే ప్రస్తుత ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. ఈఆర్సీ ఇచ్చిన తీర్పు ప్రకారమే చత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు జరిగింది. ఈఆర్సీ తీర్పులపై విచారణ చేసే అధికారం జ్యుడీషియల్ కమిషన్ కు లేదు. ఈ నెల 15లోపు విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని కేసీఆర్ ను కమిషన్ కోరింది. కానీ ఆలోపే (ఈ నెల 11న) కమిషన్ చైర్మన్ జస్టిస్ నర్సింహారెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి.. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ వ్యవహారాల్లో తప్పులు జరిగినట్టు చెప్పారు.
కమిషన్ విచారణ చేపట్టి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలే గానీ.. వాటిని మీడియాకు వెల్లడించడానికి వీల్లేదు. కేవలం కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నట్టుగా ప్రెస్ మీట్ లో జస్టిస్ నర్సింహారెడ్డి మాట్లాడారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ ను సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించడాన్ని ఆయన తప్పుపట్టారు. దేశవ్యాప్తంగా చాలా ప్రాజెక్టులు సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించినవే ఉన్నాయి. ఆ ప్రాజెక్టు వల్ల రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు నష్టం వస్తుందంటూ వెల్లడించి కమిషన్ తన పరిధి దాటింది” అని అన్నారు. ‘‘కమిషన్ ఏర్పాటు నోటిఫికేషన్‌లోనే అనేక లోపాలు ఉన్నాయి.
ఫలానా తప్పు జరిగిందని, దాన్ని నిగ్గు తేల్చాలనే షరతులతో విచారణ కమిషన్ ఏర్పాటు చేయడం చెల్లదు. కేవలం రాజకీయ కక్షతోనే ఏదో తప్పు జరిగిందని తేల్చేందుకే ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దీనికి అనుగుణంగా జస్టిస్ నర్సింహారెడ్డి కూడా మీడియాకు విషయాలన్నీ ముందే చెప్పి, కమిషన్ తుది నివేదిక ఎలా ఉండబోతున్నదో చెప్పకనే చెప్పారు” అని పేర్కొన్నారు.
‘‘అన్ని అనుమతులతోనే విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణం జరిగింది. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చాయి. ఈఆర్సీ నిర్ణయంపై అభ్యంతరాలు ఉంటే, వాటిపై సుప్రీంకోర్టులో మాత్రమే సవాల్ చేసేందుకు వీలుంది. 2 రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందంపై హైకో ర్టు లేదా సుప్రీంకోర్టు మాత్రమే విచారణ చేపట్టాల్సి ఉంటుంది. కమిషన్ ఏర్పాటు చేయడం కుదరదు” అని అన్నారు.
పిటిషన్ అంశాల్లోకి వెళ్లడం సరికాదు: ప్రభుత్వ లాయర్
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషన్‌కు నెంబర్ కేటాయించేందుకు రిజిస్ట్రీ నిరాకరించిన అంశంపైనే వాదనలు వినిపించాలని అన్నారు. ఆ వాదనలు చేయకుండా పిటిషన్‌లోని అంశాల్లోకి వెళ్లడం సరికాదని అభ్యంతరం చెప్పారు. అయితే వాస్తవాలు చెప్పాకే, పిటిషన్‌కు నెంబర్ కేటాయింపు ఉత్తర్వుల జారీకి వీలుంటుందని ఆదిత్య అన్నారు. ఇదే అభిప్రాయాన్ని డివిజన్ బెంచ్ కూడా వ్యక్తం చేసింది. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత.. పిటిషన్‌కు నెంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. పిటిషన్‌పై శుక్రవారం విచారణ కొనసాగిస్తామని తెలిపింది. ఈలోగా కమిషన్ విచారణపై స్టే ఇవ్వాలన్న పిటిషనర్ వినతిని తిరస్కరించింది.