- అసమర్థులు, చవట దద్దమ్మలు ఉన్నందునే ఇయ్యాల ఈ పరిస్థితి
- నీళ్లివ్వడం ఈ రండలతో కాని పని.. కాంగ్రెస్‌పై కేసీఆర్ కామెంట్లు
- ఇది మనిషి సృష్టించిన కృత్రిమ కరువు
- ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇయ్యాలి
- బోనస్ ఇయ్యకుంటే పులుల్లెక్క గొంతు కొరికి సంపుతం
- వీళ్లకు కాళేశ్వరం గురించి ఎంటిక కూడా తెల్వదు
- 50 వేల మందితో పోయి రిజర్వాయర్లు నింపుత
- నేతన్నలకు బిల్లులివ్వకుంటే రాష్ట్రాన్ని రణరంగం చేస్తమని వ్యాఖ్య
- కరీంనగర్, సిరిసిల్లలో పర్యటన
కరీంనగర్/రాజన్నసిరిసిల్ల, వెలుగు : పాత తెలంగాణ పునరావృతమైందని, ఇందిరమ్మ రాజ్యంలో ఇగిలించినట్టయిందని, నీటి నిర్వహణ తెల్వని లత్కోర్లు రాజ్యమేలుతున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కామెంట్ చేశారు. ‘‘అసమర్థులు, చవట దద్దమ్మలు రాజ్యంలో ఉన్నారు కాబట్టే ఇవ్వాళ ఈ పరిస్థితి వచ్చింది. నీళ్లు ఇవ్వడం ఈ రండలతోని కాదు” అని విమర్శించారు.
కాంగ్రెసోళ్లకు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తోక తెల్వదని.. తొండం తెల్వదని, ఎంటిక కూడా తెల్వదని అన్నారు. పొలంబాట కార్యక్రమంలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో శుక్రవారం పర్యటించారు. తొలుత మధ్యాహ్నం కరీంనగర్ రూరల్ మండలం మగ్దుంపూర్ లోని ఎండిన పొలాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండల కేంద్రంలో కౌలు రైతుతో మాట్లాడి, శభాష్ పల్లి వద్ద మిడ్ మానేరు పరిశీలించారు. అక్కడి నుంచి సిరిసిల్లలోని తెలంగాణ భవన్ కు చేరుకుని మీడియాతో మాట్లాడారు. ఇది మనిషి సృష్టించిన కృత్రిమ కరువు అని, రాష్ట్రంలో 15 లక్షల నుంచి 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇయ్యాలని డిమాండ్ చేశారు. అన్ని పంటలకు బోనస్ ఇస్తామని కాంగ్రెస్హామీ ఇచ్చింది.. బోనస్ ఇయ్యకపోతే పులుల్లెక్క గొంతుకొరికి సంపుతమని హెచ్చరించారు.
నిరోధ్ లు అమ్ముకుని బతకల్నారా..
‘‘300 కోట్లు పాత బకాయిలు ఉన్నయి. ఇస్తలేరు అని చేనేతలు చెప్పిండ్లు. సిరిసిల్లలో చేనేతల ఆత్మహత్యలు మల్ల మొదలయ్యేటట్లు ఉన్నయని అంటే.. వాళ్లను నిరోధ్ లు, పాపుడాలు అమ్ముకుని బతుకుమనుండ్రి అని ఓ కాంగ్రెసోడు అంటడు. నిరోధ్ లు అమ్ముకుని బతకల్నారా.. కుక్కల కొడుకుల్లారా.. చేనేత కార్మికులు మొన్నటిదాక దొబ్బితిన్నరట. దొబ్బితిన్నార్రా.. దొంగ నా కొడుకుల్లారా? చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తరా? చేనేత కార్మికులు పులులై గర్జిస్తరు బిడ్డా. మిమ్మల్ని తరిమికొడుతరు. అవసరమైతే వకీళ్ల ఫీజుకు మేం పార్టీ నుంచి ఇస్తం. రాష్ట్రమంతా రణరంగం చేస్తం’’ అని కేసీఆర్ హెచ్చరించారు.
కోమటిరెడ్డిని ఆనాడు జైల్లో పెట్టలే..
‘‘తెలంగాణ కాంగ్రెస్ నాయకుల అసమర్థత వల్ల మిడ్ మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులను పెండింగ్ లో పెట్టారు. ఒక సీజన్ లో మేం కట్ట నింపుతా ఉంటే మాచారెడ్డి మండలంలో 25 సెంటీమీటర్ల పర్షపాతం కురిసి కట్ట కొట్టుకుపోయింది. అది కట్టినోడు ఈ రోజు అడ్డంపొడుగు మాట్లాడే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ రోజు మంత్రి. ఆ రోజు మేం అనుకుంటే వాన్ని జైల్లో పెట్టకపోదుమా. ఆ చిల్లర పని చేయలే’’ అని కేసీఆర్ అన్నారు.
మేడిగడ్డలాంటి ఘటనలు కామన్..
‘‘నేను నిన్న, ఇయ్యాళ ఇంజనీర్లతో మాట్లాడిన. సార్ మమ్మల్ని అడ్డుకున్నరు అని చెప్పిండ్రు. మొన్న వచ్చిపోయినోడు.. ఆ రెండు పిల్లర్ల కింద ఉన్న ఇసుక కదిలి అవి కదిలినయని చెప్పిండు. అట్ల జరుగుతనే ఉంటయి. చాలా బ్యారేజీలల్లో జరుగుతయి. దానికేందో ప్రళయం బద్దలయినట్లుగా చేస్తున్నరు” అని ఎద్దేవా చేశారు. ఈ దద్దమ్మలకు చేతకాకపోతే ఎన్నికల తర్వాత 50 వేలమంది రైతులను ఎంబడి వేసుకుని, వీళ్లను తొక్కుకుంట పోయి మేడిగడ్డ దగ్గర కూర్చుని ఇవన్నీ నింపుతానని కేసీఆర్ హెచ్చరించారు.
ఈ రండలతో కాదు..
నీళ్లు ఇవ్వడం ఈ రండలతోని కాదని, మంచిమాట తోటి వింటరా వినరా చూద్దామని, లేదంటే ఎన్నికలయ్యాక వాళ్ల సంగతేందో చూద్దామని కేసీఆర్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం మగ్దుంపూర్ లో పొలగాని సంపత్ కు చెందిన ఎండిపోయిన పొలాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ 10 వేల మందితోటి మేడిగడ్డకాడ ధర్నా చేద్దామని, మీరు ధైర్యంగా ఉండాలని, ఒక్కటిగా ఉండి పోరాటం చేయాలని సూచించారు.
ఫోన్ ట్యాపింగ్ పై రెండు, మూడు రోజుల్లో స్పందిస్త
ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేసీఆర్ స్పందించారు. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ‘నో పొలిటికల్ స్టేట్ మెంట్స్’ అని సమాధానం దాటవేసిన కేసీఆర్.. కిందికి వచ్చాక చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ అంశంపై రెండు, మూడు రోజుల్లో స్పందిస్తానని వెల్లడించారు. పదేండ్ల పాటు తాను సీఎంగా ఉన్నానని, తనకు ఆ బాధ్యత ఉందని, కచ్చితంగా క్లారిటీ ఇస్తానని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో నిజానిజాలు బయటపెడతానని చెప్పారు.
చుట్టూ పచ్చదనమే నీరందని చివరి నాలుగు మడ్లను పరిశీలించిన కేసీఆర్
కేసీఆర్ శుక్రవారం పర్యటించిన కరీంనగర్ రూరల్ మండలం మగ్దుంపూర్ లో రోడ్డు వెంట పొలాలన్నీ పచ్చగా ఉండడం, వరి కోతలు సాగుతుండడం చూసి అక్కడికొచ్చిన జనం, బీఆర్ఎస్ నాయకులు ఆశ్చర్యపోయారు. ఎటూ చూసినా పచ్చదనమే కనిపిస్తున్నదని, ఎండిన పంటల పరిశీలనకు ఈ గ్రామానికి ఎందుకు ఎంపిక చేశారంటూ అక్కడికి వచ్చిన ఓ మాజీ ఎమ్మెల్సీ తన అనుచరులతో చెప్పడం కనిపించింది. కేసీఆర్ సందర్శించిన పొలం యజమాని సంపత్ తన పొలానికి పక్కనే ఉన్న వాగులోని బావి ద్వారా నీరందిస్తుంటాడు. ఆయనతోపాటు బండి సంపత్, వేల్పుల నర్సయ్యకు కలిపి వాగు ఒడ్డున 11 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ వేసవిలో వారు 6 ఎకరాలు సాగు చేశారు. ఇందులో సుమారు 30 గుంటల వరకు పంట ఎండిపోయినట్లు కనిపిస్తున్నది. ఆ నాలుగు మడ్లనే కేసీఆర్ పరిశీలించారు.