
సిద్దిపేట: రాబోయే రోజుల్లో అధికారం బీఆర్ఎస్దేనని.. సింగిల్‌గానే రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం (మార్చి 22) ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెల్లం ఉన్న దగ్గరకే ఈగలు వస్తాయి.. అలానే సిరిసంపదలు ఉన్న తెలంగాణాని దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
బీఆర్ఎస్ పాలనలో పదేళ్లు తెలంగాణలో ఎటువంటి ఇబ్బందులు లేవని.. ఇప్పుడు సమస్యల వలయంలో తెలంగాణ చిక్కుకుందని విమర్శించారు. ఆనాడు ప్రధాని మోడీ నా మెడపై కత్తి పెట్టిన తెలంగాణ కోసం నేను ఎక్కడ వెనకడుగు వేయలేదని పేర్కొన్నారు. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది ఒక్క బీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు. రామగుండంలో గెలిచిన ఎమ్మెల్యే ఓ సన్నాసి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకి ఆనాడు ఇందిరాగాంధీ మోసం చేసిందని.. బలవంతంగా మనల్ని ఆంధ్రాలో కలిపారని పేర్కొన్నారు.
ALSO READ | డీలిమిటేషన్ తో తీవ్ర నష్టం.. భారత జీడీపీకి దక్షిణాది రాష్ట్రాలే ఆయువు పట్టు: కేటీఆర్
ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు గెలిచేవారే కాదన్నారు. ఈ నేలపై ఎవరు శాశ్వతం కాదన్నారు. అందరూ ఒక్కో కేసీఆర్‌లా తయారు కావాలని.. తెలంగాణ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నోటికి వచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది.. కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ మేనిఫెస్టోలో పెట్టకున్న రైతు బంధు, కల్యాణ లక్ష్మీ ఇచ్చిన ఘనత బీఆర్ఎస్దని అన్నారు.