13వ రోజు బస్సు యాత్రాలో భాగంగా సోమవారం నిజామాబాద్ దిశగా సాగారు కేసీఆర్. ఆదివారం జగిత్యాలలో బస చేసిన కేసీఆర్, స్థానికంగా నివాసం ఉంటున్న తన చిన్ననాటి గురువు ప్రముఖ కవి జైశెట్టి రమణయ్య వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. వయోభారంతో, అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న వారిని కేసీఆర్ పరామర్శించారు.
రమణయ్య కుటుంబ సభ్యులు కేసీఆర్ ను సాదరంగా ఆహ్వానించారు. తాను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో సిద్దిపేట జూనియర్ కాలేజీలో హిస్టరీ లెక్చరర్ గా తనకు చరిత్ర పాఠాలు నేర్పిన నాటి జ్ఞాపకాలను కేసీఆర్ నెమరు వేసుకున్నారు.
ఇంతింతై వటుడింతయ్ అన్నట్టుగా ఎదిగిన తన శిష్యుణ్ణి చూసిన గురువు రమణయ్య ఎంతగానో సంబురపడ్డారు. ఓ పావు గంట పాటు ఇష్టాగోష్టి సాగించారు. అనంతరం గురువు వద్ద మరోసారి ఆశీర్వాదం, వీడ్కోలు తీసుకున్నారు కేసీఆర్.