- అటుకులు బుక్కి ఉద్యమం జేసిన
- తెలంగాణ తెచ్చిన నన్నే నోటికొచ్చినట్టు అంటడా?
- కాంగ్రెస్, బీజేపీలకి ఓట్లేసుడు దండుగ
- బీఆర్ఎస్ను గెలిపిస్తే సర్కారు మెడలు వంచుతానని కామెంట్
- నాగర్ కర్నూల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్పీకి మద్దతుగా రోడ్ షో
నాగర్ కర్నూల్, వెలుగు: తాను అటుకులు బుక్కి ఉద్యమం చేశానని, చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చి తెల్లగా చేసిన తనను సీఎం రేవంత్ తిట్టుడు న్యాయమా? అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ప్రశ్నించారు. ‘‘ గుడ్లు పీకి గోటీలాడ్త..పేగులు తీసి మెడలో వేసుకుంటా.. లాగు లేకుండా చేస్తా అంటడు. ఇంత చేసిన నన్ను ఇట్ల తిట్టుడు ధర్మమా?” అని అడిగారు. శనివారం ఆయన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కు మద్దతుగా ఉయ్యాలవాడ నుంచి నాగర్కర్నూల్బస్టాండ్ వరకు రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. పార్లమెంట్ఎన్నికల్లో బీఆర్ఎస్అభ్యర్థులను గెలిపిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి.. ఇచ్చిన హామీలు అమలు అయ్యేటట్టు చూస్తానని చెప్పారు. ఈ ఎన్నికల్లో పోటీ బీజేపీ, బీఆర్ఎస్ మధ్యనే ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ అబద్ధాల ప్రచారాలు, అమలు కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని తెలిపారు. రైతులకు రైతుబంధు ఇచ్చేందుకు కాంగ్రెస్ వెనుకాముందు ఆడుతున్నదని, ఐదు ఎకరాలు దాటిన వారికి పెట్టుబడి సాయం ఇవ్వమని అనడం సరైంది కాదన్నారు. ప్రభుత్వ సొమ్మును రైతులకు ఇస్తే వచ్చిన నష్టమేందని ప్రశ్నించారు. -రైతులంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంత చులకనా? అని అడిగారు.
బీజేపీకి తెలంగాణలో ఏంపని?
అక్కరకు రాని సుట్టం బీజేపీకి తెలంగాణలో ఏం పని ఉందని కేసీఆర్ ప్రశ్నించారు. పాలమూరుకు జాతీయ హోదా ఇయ్యాలని, రూ.25 వేల కోట్లు మంజూరు చేయాలని ఎన్నిసార్లు విన్నవించినా మోదీ స్పందించలేదని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలు, నవోదయ స్కూళ్లు ఇయ్యలేదన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మాత్రం పెంచారని మండిపడ్డారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని మోదీ చెప్తే తాను వినలేదని తెలిపారు.
సొంత గడ్డకు సేవ చేయాలనే సంకల్పంతో మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లో వచ్చారని కేసీఆర్ అన్నారు. గురుకులాలను బాగుచేసినట్టే నాగర్ కర్నూల్‌ను ప్రపంచ పటంలో ఉంచుతారని చెప్పారు. ఒక లక్ష్యం కోసం పనిచేసే ఆర్ఎస్పీ లాంటి వ్యక్తులను గెలిపించి, పార్లమెంట్‌కు పంపాల్సిన బాధ్యత ప్రజలదేనన్నారు. కాగా, తనను పార్లమెంట్‌కు పంపిస్తే నాగర్‌కర్నూల్ దశాదిశ మారుస్తానని ఆర్ఎస్పీ అన్నారు. ఈ రోడ్ షోలో మాజీ మంత్రులు నాగం జనార్దన్ రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు విజయుడు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్‌యాదవ్, బీరం హర్షవర్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆడోళ్లు మళ్లీ బిందెలు మోసే రోజులచ్చినయ్
తాను మిషన్ భగీరథ తెచ్చి ఫ్రీగా నీళ్ళిస్తే.. ఇప్పుడు -గ్రామాల్లో తాగు నీటికి నీళ్ల ట్యాంకర్ల కోసం ఎదురు చూసి.. ఆడోళ్లు మళ్లీ బిందెలు మోసే రోజులు వచ్చాయని కేసీఆర్ అన్నారు. వ్యవసాయానికి కరెంట్ రాక పంటలు ఎండిపోతున్నాయని ఆరోపించారు. రాత్రి పూట కరెంట్‌తో పొలాల దగ్గరకు వెళ్తున్న రైతులు పాము, తేళ్ల కాట్లకు గురవుతున్నారని, ఇప్పటికే 225 మంది రైతుల ప్రాణాలు పోయాయని తెలిపారు. తాను పదేండ్ల తెలంగాణలో అన్ని వర్గాల వారిని కోడిపిల్లల్లాగా సాదిన అని చెప్పారు. తన హయాంలో వరి చేలు, ధాన్యపు రాసులు ఉంటే.. కాంగ్రెస్ 4 నెలల పాలనలో వడ్లు కొంటలేరన్నారు. వరికి ఇస్తామన్న రూ.500 బోనస్ ఎక్కడికి పోయింది? అని ప్రశ్నించారు. ఆడపిల్లలకు తులం బంగారం, స్కూటీలు, కల్యాణలక్ష్మి, రూ.2,500, రైతు బంధు, రుణ మాఫీలాంటి హామీలు అమలయ్యాయా? అని అడిగారు.