- మహారాష్ట్ర రైతు నాయకులు ఇదే అంటున్నరు: కేసీఆర్
- తెలంగాణ రైతుల కంటే వాళ్లే ఎక్కువ బాధపడ్తున్నరు
- బీఆర్‌ఎస్ కార్యకర్తల మీటింగ్‌లో మాజీ సీఎం
హైదరాబాద్, వెలుగు: తన ఓటమి వల్ల దేశ రైతాంగం నష్టపోయినట్టు తెలిసిందని, ఈ విషయాన్ని మహారాష్ట్ర రైతు నాయకులు తనకు చెప్పారని బీఆర్‌ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రైతుల కంటే మహారాష్ట్ర రైతులనే తన ఓటమి ఎక్కువగా బాధించిందని ఆయన వ్యాఖ్యానించారు. ఖమ్మం, మహబూబాబాద్, వేములవాడ, నర్సాపూర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల పార్టీ కార్యకర్తలు, నాయకులతో ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో జరిగిన మీటింగ్‌లో కేసీఆర్ మాట్లాడారు.
‘‘బీఆర్‌ఎస్ పాలనలో అభివృద్ధి అంతకుముందెన్నడూ లేని విధంగా జరిగింది. తెలంగాణ వ్యవసాయ ప్రగతిని చూసి మహారాష్ట్ర లాంటి పక్క రాష్ట్రాల ప్రజలు తమకూ కేసీఆర్ పాలన కావాలని కోరుకున్నరు. అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో దేశంలో రైతు రాజ్యం తెచ్చుకోవాలని బీఆర్‌ఎస్‌తో కలిసి నడిచారు.మొన్నటి తెలంగాణ ఎన్నికల ఫలితాలతో మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఆవేదన చెందారు. కేసీఆర్ పాలన లేకపోవడం వల్ల తెలంగాణ రైతుల కంటే, దేశ రైతాంగమే తీవ్రంగా నష్టపోయిందని ఇటీవల నన్ను కలిసిన మహారాష్ట్ర నేతలు చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమితో రైతు రాజ్యాన్ని అందించగల దమ్మున్న కేసీఆర్ దార్శనిక నాయకత్వాన్ని దేశం కోల్పోయిందని వారు బాధపడ్డారు” అని కేసీఆర్ అన్నారు.
ప్రతిపక్ష పాత్ర కూడా శాశ్వతం కాదు
నల్ల చట్టాలను తెచ్చి తమ జీవితాలను, తాము నమ్ముకున్న వ్యవసాయ రంగాన్ని ఆగం చేయాలని చూసిన గత బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీ వీధుల్లో దేశ రైతాంగం శాంతియుత పోరాటం చేసిందని మాజీ సీఎం గుర్తుచేశారు. రైతుల మీద లాఠీ చార్జీ, కాల్పులు జరిపి 700 మంది రైతుల మరణానికి నాటి బీజేపీ సర్కార్ కారణమైందని మండిపడ్డారు.
‘‘దేశ రైతాంగ బాధలను తీర్చేందుకు నడుం కట్టిన బీఆర్ఎస్ పార్టీ కిసాన్ సర్కార్ నినాదం తో మహారాష్ట్ర నుంచి ఒక లైన్ తీసుకొని ముందుకు సాగింది. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రజల నిర్ణయం, ఇతర రాష్ట్రాల రైతాంగాన్ని నిరుత్సాహపరిచింది. ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ నిర్ణయం. అధికారం శాశ్వతం కాదు.. ప్రతిపక్ష పాత్రకూడా శాశ్వతం కాదు. ప్రజలు అప్పగించిన పాత్రను చిత్తశుద్ధి తో నిర్వర్తించాలి.” అని కేసీఆర్ చెప్పుకొచ్చారు. రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, తెలంగాణ సంపూర్ణ అభివృద్ధి సాధించడమే బీఆర్ఎస్ అంతిమ లక్ష్యమని అన్నారు.