అంబేద్కర్ పుణ్యం వల్లే తెలంగాణ వచ్చిందన్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. అంతటి మహనీయుడి జయంతి రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ను అవమానించిందని మండిపడ్డారు. అంబేద్కర్ ను అవమానించిన పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో బుద్ది చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సంగారెడ్డిలో ప్రజా ఆశ్వీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు.
సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వామేనని... అందులో ఎందుకు కూర్చున్నారని కాంగ్రెస్ నేతలను కేసీఆర్ ప్రశ్నించారు. ఇప్పుడే తెలంగాణకు బీఆర్ఎస్ ఎంపీలు అవసరమని అన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో ఉంటే మన హక్కుల కోసం కొట్లాడుతారని, రాష్ట్ర ఆకాంక్షలు నెరవేరాలంటే పార్లమెంట్‌లో బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలని చెప్పారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
ఇదే సభలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 2 కంటే ఎక్కువ సీట్లు రావని చెప్పారు. సర్వే రిపోర్టులు చూసి సీఎం రేవంత్ భయపడుతున్నారని, నారాయణపేట సభలో సీఎం వణికిపోయారన్నారు. ఏడాది కూడా ఈ ప్రభుత్వం ఉండేలా కనిపించడం లేదన్నారు. సీఎం రేవంత్ బీజేపీలో చేరబోతున్నారంటూ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారో, సీఎం జంప్ కొడుతాడో తెలియదన్నారు.
పొలీసులు జాగ్రత్తగా ఉండాలని.. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధింపులు గురి చేయోద్దని కేసీఆర్ సూచించారు. తాము అన్ని రికార్డు చేసి ఉంచుతున్నామని.. మళ్ళీ వచ్చేది తమ ప్రభుత్వమేనని ఆ విషయం పొలీసులు మరిచిపోవద్దని కేసీఆర్ హెచ్చరించారు. బీజేపీకి ఓటు వేసినా.. మంజీరా నదిలో వేసిన ఒకటేనన్నారు కేసీఆర్. బీజేపీ మనకు అక్కరకు రాని చుట్టం, దాన్ని వదిలేసుకోవాలిని అన్నారు.