
- ఫాంహౌస్‌కు వెళ్లిపోయిన బీఆర్ఎస్ చీఫ్
హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం కనిపించట్లేదు. సమావేశాలు ప్రారంభమైన తొలి రోజైన బుధవారం గవర్నర్ ప్రసంగానికి హాజరైన కేసీఆర్.. తర్వాత నేరుగా నందినగర్‌లోని తన నివాసానికి వెళ్లిపోయారు. ఇటు ప్రతిపక్షనేత హోదాలో బీఏసీ సమావేశంలోనూ పాల్గొనలేదు.
గురువారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా కూడా సభకు రాలేదు. అయితే, గురువారం నందినగర్ నివాసంలో కేసీఆర్‌కు హెల్త్ చెకప్ చేశారని తెలిసింది. ఆ తర్వాత ఆయన ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌కు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో తదుపరి సమావేశాలకు వస్తారా.. లేదా.. అన్నది సందేహమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అనర్హతను తప్పించుకునేందుకే వచ్చారా..!
అనర్హత వేటును తప్పించుకునేందుకే గవర్నర్ ప్రసంగం రోజు కేసీఆర్ వచ్చారన్న చర్చ జరుగుతున్నది. మామూలుగా అసెంబ్లీ జరిగిన 60 పనిరోజుల్లోపు కచ్చితంగా ఒక్కసారైనా సభకు హాజరుకావాలన్న రూల్ ఉంది. లేదంటే అనర్హత వేటు వేస్తారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ సభకు వచ్చారంటున్నారు. కొద్ది రోజుల కింద నిర్వహించిన బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్‌లో బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులకు మద్దతివ్వాలని పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచించారు. ఈ నెల 17, 18న అసెంబ్లీ వాటిపై సమావేశం ఉండనుంది. ఆ బిల్లులపై చర్చకు కేసీఆర్ రాకపోవచ్చని పార్టీ వర్గాలంటున్నాయి.