మేడిగడ్డకు పీకనీకిపోయినవా? .. సీఎం రేవంత్​పై కేసీఆర్ వ్యాఖ్యలు

మేడిగడ్డకు పీకనీకిపోయినవా? ..   సీఎం రేవంత్​పై కేసీఆర్ వ్యాఖ్యలు

 

  • అక్కడ తోకమట్ట ఏమైనా ఉన్నదా?.. సీఎం రేవంత్​పై కేసీఆర్ వ్యాఖ్యలు 
  • 250 పిల్లర్లలో రెండు, మూడు కుంగినయ్ అంతే 
  • మమ్మల్ని బద్నాం చేస్తరా? మిమ్మల్ని 
  • బతకనీయం.. వెంటపడతం.. వేటాడతాం 
  • అసెంబ్లీ తర్వాత మేడిగడ్డకు మేం కూడా పోతం.. మీ బండారం బయటపెడ్తం 
  • జనం ఏం భ్రమలో పడ్డారో.. పాలిచ్చే బర్రెను అమ్మి, దున్నపోతును తెచ్చుకున్నరు
  • అప్పట్లో తాత్కాలిక సర్దుబాటు కోసమే కృష్ణా జలాల్లో వాటాకు ఒప్పుకున్నామని వెల్లడి  

నల్గొండ, వెలుగు:  మేడిగడ్డకు ఏం పీకుదామని పోయావని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ నోరుపారేసుకున్నారు. ‘‘ఏం పీకుతనని మేడిగడ్డకు పోయినవ్. ఎందుకు పోతున్నవ్​ మేడిగడ్డకు? దమ్ముంటే కాపర్ డ్యామ్ పెట్టి కూడా నీళ్లు ఇయ్యొచ్చు. కేసీఆర్​ను బద్నాం చేయాలనే దుష్టబుద్ధితో నీళ్లు ఇయ్యకుండా మేడిగడ్డకు పోతం.. బొందల గడ్డకు పోతం అంటున్రు. మేడిగడ్డ దగ్గర తోకమట్ట ఏమైనా ఉన్నదా?’’  అని ఆయన అన్నారు. అసెంబ్లీ సమావేశాలయ్యాక తాము కూడా మేడిగడ్డకు పోతామని, అక్కడ కాంగ్రెస్ బండారం బయటపెడ్తామని చెప్పారు. మంగళవారం నల్గొండలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు.  ‘‘గోదావరికి ప్రధానమైన ఉపనది ప్రాణహిత. అందులో ఇప్పుడు కూడా ఐదువేల క్యూసెక్కుల నీళ్లు వస్తున్నయ్. వాటిని ఎత్తిపోయాలి. రైతులకు నీళ్లు ఇవ్వకుండా, ఏంచేద్దామని మేడిగడ్డకు పోయిన్రు’’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  

కాళేశ్వరం అంటే ఆటబొమ్మ కాదు..  

కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఆటబొమ్మ కాదని.. మూడు బ్యారేజీలు, 250 కిలోమీటర్ల టన్నెల్స్, 15 వందల మీటర్ల కాలువ, 19 సబ్ స్టేషన్లు, 20 రిజర్వాయర్లు ఉంటాయని కేసీఆర్​అన్నారు. ‘‘మేడిగడ్డ బ్యారేజీలో 250 పిల్లర్లు ఉంటయ్. ఒక మూడు పిల్లర్లు కుంగిపోతే దాన్ని పట్టుకుని అనవసర రాద్ధాంతం చేస్తున్నరు. ఎన్నిసార్లు నాగార్జునసాగర్ ​ప్రాజెక్టు కుంగిపోలేదు. కడెం, మూసీ ప్రాజెక్టుల గేట్లు వాగుల్లో కొట్టుకుపోలేదా? ఏదైనా పోతే దాన్ని సరిచేయాలి. తొందర తొందరగా రిపేర్లు చేసి, రైతులకు నీళ్లు ఇవ్వాలి తప్ప రాజకీయాలు చేయడం తెలివంటరా?’’ అని ఫైర్ అయ్యారు. పిల్లర్లు కుంగిపోయాయని మహబూబాబాద్, తుంగతుర్తి, సూర్యాపేట, డోర్నకల్​ ప్రాంతాలకు నీళ్లు ఇయ్యకుండా ప్రభుత్వం ఆపేసిందని మండిపడ్డారు. 

తెలివితక్కువ తీర్మానం పెట్టిన్రు.. 

ఏ ప్రభుత్వం ఉన్నా ట్రిబ్యునల్‌ ముందు గట్టిగా వాదించాలని, మన అవసరాలు చెప్పి మాకు ఇంత వాటా రావాలని కొట్లాడాలని కేసీఆర్ అన్నారు. ‘‘మీకేం కోపం వచ్చిందో.. ఏం భ్రమలో పడ్డారో.. పాలిచ్చే బర్రెను అమ్మి దున్నపోతును తెచ్చుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే మన జీవితాలను దెబ్బకొట్టేలా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించింది. జలాల్లో వాటా అడక్కుండా ప్రభుత్వం సంతకం పెట్టింది” అని ప్రజలను ఉద్దేశించి అన్నారు. ‘‘దీనివల్ల జరిగే నష్టం హరీశ్​రావుకు తెలుసు కాబట్టి ఆయన గర్జించారు. దీంతో మీరు నాలుగైదు రోజులు నాటకాలు ఆడారు. అబద్ధాలు ఆడారు. బిడ్డా మిమ్మల్ని బజారున నిలబెట్టి మీ సంగతి ప్రజల ముందే తేల్చుకుందామని ‘చలో నల్గొండ’కు పిలుపునిచ్చాను. దీంతో పీక్క చస్తున్నారు. ఇజ్జతిమానం పోతుందని, ఏం చేయాలని చేతులు కాళ్లు పిసుక్కొని, ఆగమాగమై బడ్జెట్‌ పక్కకు పెట్టారు. ఆగమేఘాలపై అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. అదికూడా సరిగ్గా పెట్టకుండా తాగునీటి కోసమని పెట్టారు. కరెంటు ఉత్పత్తి గురించి పెట్టలేదు. తెలివి తక్కువ తీర్మానం పెట్టి మమ అనిపించారు’’ అని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రమే బాగుందని మంత్రి ఉత్తమ్‌ అన్నారని, అదే మంచిగుంటే అంత పెద్ద ఉద్యమం ఎందుకు జరిగిందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ వాళ్లకు పదవులు, పైరవీలు కావాలి కానీ ప్రజల హక్కుల గురించి పట్టించుకోరన్నారు. మనకు జరిగే అన్యాయంపై అవసరమైనప్పుడు పోరాడాలని, అవసరమైతే సద్దులు కట్టుకుని రావాలన్నారు. ఉవ్వెత్తున ఉద్యమంలా ఎగసి పడకపోతే ఎవరూ మనల్ని రక్షించేందుకు రారని చెప్పారు. నాడు ఫ్లోరైడ్‌ సమస్యపై పోరాడేందుకు ఎవరూ ముందుకు రాలేదన్నారు. 

పనులు చెయ్యకుంటే నిలదీస్తం.. 

‘‘చలో నల్గొండ అంటే కేసీఆర్‌ను తిరగనీయమని కాంగ్రెసోళ్లు సవాల్​ చేస్తున్నరు. కేసీఆర్‌నే తిరగనీయనంత మొగోళ్లా.. ఏమి చేస్తరు చంపేస్తరా?’’ అని ప్రశ్నించారు. ‘‘కేసీఆర్‌ను చంపి మీరుంటరా? ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజా సమస్యలను అడుగుతది. మీకు దమ్ముంటే చెప్పిన దానికంటే మంచిగా చేసి చూపియ్యాలె’’ అని అన్నారు. దమ్ముంటే పాలమూరు ఎత్తిపోతలు, సీతారామ ప్రాజెక్టు పూర్తిచేయాలని.. పేద పిల్లలకు గురుకులాలు పెంచాలని, కరెంట్‌ మంచిగా ఇయ్యాలని సవాల్ చేశారు. ఇవన్నీ వదిలేసి బలాదూర్‌గా తిరుగుదామనుకుంటే తిరగనీయమని, తప్పకుండా నిలదీస్తామని చెప్పారు. కొత్త గవర్నమెంట్‌ వస్తే పోయిన గవర్నమెంట్‌ కంటే మంచి పనులు చేయాలని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటినుంచి సొల్లు పురాణం, కేసీఆర్‌ను ఎట్లా తిట్టాలా అని చూస్తున్నదని విమర్శించారు. 

తాత్కాలిక సర్దుబాటుకే ఒప్పుకున్నం..

తాత్కాలిక సర్దుబాటుకే కృష్ణా జలాల్లో వాటాకు ఒప్పుకున్నామని కేసీఆర్ తెలిపారు. ‘‘విభజన టైమ్​లో కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఒక్క ఏడాది కోసం తాత్కాలికంగా సర్దుబాటు చేసుకోండి. ఆ తర్వాత ఎవరి వాటా వారికి వస్తాయని చెప్పింది. ఆనాడు తెలంగాణ రావాలని, ఇది ఆటంకం కావద్దని సరే అన్నాం. తర్వాత చూసుకుందామని చెప్పినం. ఆ తర్వాత మోదీ ప్రభుత్వం రాగానే వెంటనే నీళ్ల పంపిణీ చేయండని వందల ఉత్తరాలు రాశాం. ట్రిబ్యునల్‌ వేయమన్నా వేయలే. మా పోరాటం, ఒత్తిడికి తలొగ్గి మొన్న ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేశారు” అని చెప్పారు. ‘‘అధికారం కోసం నోటికొచ్చింది చెప్పిన్రు. వరికి, పంటలకు కనీస మద్దతు ధర వస్తే వాళ్లు చెప్పిన 500 బోనస్‌  ఇయ్యరట. మరి అప్పుడు బోనస్​ ఇస్తమని ఎందుకు చెప్పిన్రు” అని ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు సంపూర్ణమైన వాటా వచ్చేదాక కొట్లాడతామన్నారు. ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకుపోవాలని సూచించారు. ‘‘మీరు గెలిచిన్రు. ఐదేండ్లు అధికారంలో ఉండండి. మాకు అభ్యంతరంలేదు. అపోజిషన్‌కు వచ్చిన. నాలుగు రోజులు ఆరంగా కూర్చుందామనుకున్నా. కానీ ఏమి చేసిండ్రు. నల్లమొకం పిల్లిపోయి సచ్చిపోయిన ఎలుకను పట్టిందన్నట్టు.. కృష్ణా నీళ్లను కొంచబోయి కేఆర్‌ఎంబీకి అప్పజెప్పిన్రు. మంచినీళ్లకు కూడా ఇక చిప్ప పట్టి అడుక్కోవాలి. మనకున్న అధికారాన్ని కొంచబోయి అప్పజెప్పిన్రు” అని మండిపడ్డారు. కేంద్రం తననూ బెదిరించిందని, కానీ తానూ అప్పజెప్పలేదని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పిచ్చిప్రేలాపనలు మాని, నీళ్ల వాటా తేల్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కేసీఆర్​ కోరారు. 

చెప్పుతో కొడ్తానంటరా.. అంత కండకావరమా?

కాంగ్రెస్ రాంగనే కరెంట్ పోయిందని కేసీఆర్ విమర్శించారు. ‘‘మేం కరెంట్‌ బాగుచేసి 24 గంటలు ఇచ్చినం. కేసీఆర్‌ పోంగనే కట్కా బందు చేసినట్టు కరెంట్‌ పోతదా? ఏమైనా మాయ రోగం వచ్చిందా? దద్దమ్మలు, చేతగాని చవటల రాజ్యం ఉంటే గిట్లనే ఉంటది” అని అన్నారు. ప్రజలను కరెంట్‌, నీళ్లకు తిప్పలు పెడితే ఎక్కడికక్కడ నిలదీస్తామని హెచ్చరించారు. చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా అసెంబ్లీలో జనరేటర్‌ పెట్టారని చెప్పారు. ‘‘జగదీశ్‌రెడ్డి సభలో మాట్లాడుతుంటే ఏడుసార్లు కరెంట్‌ పోయింది. మీకు నడపడం చేతగాక మంది మీద బద్నాం పెట్టి బతుకుదామనుకుంటున్నారు. బిడ్డా జాగ్రత్త.. మిమ్మల్ని బతకనీయం. వెంటపడతం.. వేటాడతాం’’ అని అన్నారు. ‘‘రైతుబంధు ఇచ్చుడుచేతకావడం లేదా? రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతానంటవా? ఎన్ని గుండెలురా నీకు.. కండకావరమా.. కళ్లు నెత్తికెక్కినయా.. రైతుల చెప్పులు బందబస్తుగా ఉంటయ్‌. ఒక్కటి కొడితే మూడు పళ్లు ఊసిపోతయ్‌. ప్రజలను గౌరవించే పద్ధతా ఇది. మీకు చేతగాక పోతే తర్వాత ఇస్తామని చెప్పాలే. పైసలు లేవని చెప్పాలే. చేయొస్తలేదని చెప్పాలే. చెప్పుతో కొట్టాలని అంటరా’’ అని మండిపడ్డారు.

Also Read : నిధుల్లేక..నిలిచిన పనులు ..ఆగిపోయిన 124 హెల్త్ సబ్ సెంటర్ వర్క్స్ 

కేటీఆర్ బస్సుపై కోడిగుడ్లతో దాడి.. 

నల్గొండ సభకు కేటీఆర్, హరీశ్​రావు వెళ్తుండగా.. వాళ్ల బస్సుపై ఎన్ఎస్ యూఐ నాయకులు కోడిగుడ్లతో దాడి చేశారు. స్థానికంగా గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసంలో లంచ్​పూర్తి చేసుకుని సభాస్థలికి వెళ్తున్న క్రమంలో శ్రీలక్ష్మీ కాలనీలోని మనోరమ హోటల్ దగ్గరికి బస్సు రాగానే.. నల్లని దుస్తుల్లో ఉన్న ఎన్ఎస్​యూఐ నేతలు హఠాత్తుగా బస్సుకు అడ్డుగా వెళ్లారు. ‘కేసీఆర్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేస్తూ బస్సుపై కోడిగుడ్లు విసిరారు. వెంటనే తేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.