బహుజనుల బతుకులు మారలేదు : వట్టే జానయ్య యాదవ్

సూర్యాపేట, వెలుగు :  తెలంగాణ ఏర్పడి తొమ్మిదిన్నరేండ్లు అయినా  బహుజనుల బతుకులు మారలేదని బీఎస్పీ సూర్యాపేట  అభ్యర్థి వట్టె జానయ్య యాదవ్ వాపోయారు. శుక్రవారం చివ్వెంల మండలం వాల్యతండా, మంగళి తండా, సూర్యాపేట మండలం ఇమాంపేట, పెన్ పహాడ్ మండలం సింగిరెడ్డి పాలెం గ్రామాలకు చెందిన 1000 మంది బీఆర్‌‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ  కార్యకర్తలకు బీఎస్పీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పిన బీఆర్‌‌ఎస్‌ సర్కారు.. ఇవ్వకపోగా ఉల్టా  వారిని భూములను గుంజుకుందని మండిపడ్డారు.

ఇమాంపేట గ్రామంలో దళితుల భూములు లాక్కొని మిషన్ భగీరథ  కార్యాలయాలు ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల భూముల్లో డంపింగ్ యార్డ్ చేపడుతుంటే వద్దని వారించినందునే మంత్రి జగదీశ్ రెడ్డి తనపై కక్ష కట్టారని వాపోయారు.  పేదలకు నష్టం చేసే అనేక అంశాల్లో విభేదించినందునే తనపై ఒక్కరోజులోనే 75  కేసులు పెట్టించారన్నారు.

బీసీ, ఎస్సీ , ఎస్టీ, మైనార్టీల అభివృద్ధి కోసమే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, గెలిపించి ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. ఈ పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్  జిల్లా నాయకులు నాగిరెడ్డి వెంకట నరసింహారెడ్డి, బీఆర్ఎస్  గ్రామ శాఖ ఉపాధ్యక్షులు కుంచం ఉపేందర్,  వార్డు మెంబర్లు  సొప్పరి నాగమణి లాలయ్య, నగిరి వెంకటమ్మ అంజయ్య, మాజీ వార్డు మెంబర్లు నగిరి అంజయ్య, సాగాల సోమమ్మ, సొప్పరి నాగమ్మ ఉన్నారు.