- రాహుల్ పర్యటనతో కాంగ్రెస్ క్యాడర్‌లో జోష్
- పసుపు బోర్డు ప్రకటనతో పుంజుకున్న బీజేపీ
- గత ఎన్నికల్లో అన్నీ తానై నడిపించిన ఎమ్మెల్సీ కవిత
- ఈసారి ఆమె ప్లేస్‌ను ఎవరు భర్తీ చేస్తారని క్యాడర్‌లో కన్ఫ్యూజన్
జగిత్యాల, వెలుగు : ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడంతో జగిత్యాల జిల్లాలో ప్రచారం ఊపందుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్, కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతుండగా, బీజేపీ అభ్యర్థిగా బోగ శ్రావణి కన్ఫాం కావడంతో ఆమె సైతం ప్రచారంలోకి దిగారు. అధికార పార్టీ అభ్యర్థి సంక్షేమ పథకాలు, అభివృద్ధిని వివరిస్తుండగా, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దీంతో సెకండ్ క్యాడర్ కూడా లీడర్ల గెలుపోటములను అంచనాలు వేసుకుంటూ కండువాలు మార్చుకోవడం పొలిటికల్ వర్గాల్లో హీట్ పుట్టిస్తోంది. ప్రధాన పార్టీలైన ముగ్గురు అభ్యర్థులు ఖరారు కావడం.. ప్రచారం ఊపందుకోవడం తో ట్రయాంగిల్ ఫైట్ షూరూ అయ్యింది.
ప్రచారంలో ముందంజ
బీఆర్ఎస్ హైకమాండ్ సిట్టింగులకే టికెట్ ప్రకటించడంతో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నియోజకవర్గంలో ‘మన ఊరు– మన ఎమ్మెల్యే, మన వార్డు మన ఎమ్మెల్యే’ కార్యక్రమాల పేరుతో అందరికంటే ముందుగానే ప్రచారం మొదలుపెట్టారు. గతంలో కాంగ్రెస్ కంచుకోట గా ఉన్న జగిత్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ ను బలోపేతంలో కీలక పాత్ర పోషించిన అప్పటి ఎంపీ కవిత, ఆ తర్వాత ఓడిపోవడంతో జగిత్యాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ కావడంతో నిజామాబాద్ జిల్లాకే పరిమితమయ్యారన్న ప్రచారం ఉంది. ఇటీవల జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఎల్. రమణ బీఆర్ఎస్‌లో చేరడం వెయ్యి ఏనుగుల బలమని కవిత పేర్కొనడం ఇందుకు నిదర్శనమని రాజకీయ వర్గాల్లో చర్చ నడిచింది. కానీ ఎల్.రమణ ఆశించిన స్థాయిలో యాక్టివ్‌గా లేకపోవడం ఆ పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది.
కాంగ్రెస్‌లో హుషారు
జగిత్యాలలో ఇటీవల కాంగ్రెస్అగ్రనేత రాహుల్‌గాంధీ పర్యటన క్యాడర్‌లో హుషారు నింపింది. ఇప్పటికే కాంగ్రెస్ ఇంటింటి ప్రచారంలో అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గ్రామాల వారీగా కాంగ్రెస్ కార్యకర్తలు, కుల సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వస్తే కాంగ్రెస్ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలను అమలుచేస్తామని ప్రచారం చేస్తున్నారు. దీంతోపాటు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, కేసీఆర్ నియంతృత్వ పోకడ, రైతు సమస్యల పై ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఓటర్లను చైతన్య పరుస్తూ గెలుపే లక్ష్యంగా పని చేస్తూ ఆధికార పార్టీని ఇరకాటంలో పెడుతున్నారు.
ALSO READ : నిజామాబాద్ అర్బన్ నుంచి షబ్బీర్ అలీ పోటీ ?
పసుపు బోర్డు శాంక్షన్‌తో జోష్‌లో బీజేపీ
రైతుల డిమాండ్ మేరకు అర్వింద్కృషితో పసుపు బోర్డు మంజూరు చేయడం నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ పుంజుకుందని ఆపార్టీ లీడర్లు చెబుతున్నారు. ముఖ్యంగా కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల్లో బీజేపీకి కలిసి వస్తుందని క్యాడర్ భావిస్తోంది. దీంతోపాటు కోరుట్ల అభ్యర్థిగా ఎంపీ అర్వింద్, జగిత్యాల అభ్యర్థి గా పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ బోగ శ్రావణి టికెట్ దక్కించుకున్నారు. ఈ రెండు స్థానాల్లో రైతులతోపాటు గెలుపోటములను ప్రభావితం చేయగలిగే పద్మశాలీ సామాజిక వర్గం ఉండడం పార్టీకి కలిసివస్తుందని క్యాడర్‌లో చర్చ నడుస్తోంది. ఈక్రమంలో ఈ వర్గం ఓట్లను ఆకర్షించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది.