వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల వెనక BRS కుట్ర: బండ్రు శోభారాణి

వికారాబాద్: రాష్ట్రంలోని గురుకులాలు, హాస్టల్స్, స్కూళ్లలో జరుగుతోన్న వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల వెనక బీఆర్ఎస్ నాయకుల కుట్ర దాగి ఉందని రాష్ట్ర మహిళా కార్పొరేషన్ సహకార అభివృద్ధి చైర్మన్ బండ్రు శోభారాణి అన్నారు. 2024, డిసెంబర్ 10వ తేదీన ఫుడ్ పాయిజన్ జరిగిన వికారాబాద్ జిల్లా తాండూర్ గిరిజన బాలికల హాస్టల్‎ను బుధవారం (డిసెంబర్ 11) అధికారులతో కలిసి ఆమె సందర్శించారు. 

ఈ సందర్భంగా శోభారాణి మాట్లాడుతూ.. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల వెనక గురుకులాల మాజీ కార్యదర్శి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‎పై అనుమానాలు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ రాజకీయ లబ్ధి కోసం స్కూల్ పిల్లల జీవితాలతో ఆడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల జీవితాలతో ఆడుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫుడ్  పాయిజన్ ఘటనలపై దర్యాప్తు జరుగుతోందని.. దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. 

ఎలాంటి ఆందోళన వద్దు: కలెక్టర్ ప్రతీక్ జైన్

ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో హాస్టల్ విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ధైర్యం చెప్పారు. యావత్ జిల్లా యంత్రాంగం మొత్తం విద్యార్థుల ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు. వంటలు నిర్వహించే ఏజెన్సీ సిబ్బందిని మార్చడం కానీ.. లేదా ఉన్నవారికి ట్రైనింగ్ ఇచ్చే లాగా ఇచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. తాండూర్ ఒకటే కాదు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి హాస్టల్లో తనిఖీలు నిర్వహించి నిర్విరామంగా సందర్శిస్తూ ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా పట్టిష్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.